Thursday, May 2, 2024

హరీష్‌ భాయ్‌.. నువ్వు కూడా జుట్టుకి రంగేసుకో.. మండలిలో నవ్వులు పూయించిన కడియం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి కడియం శ్రీహారి శాసన మండలిలో గురువారం తనదైన శైలీలో నవ్వులు పూయించారు. బడ్జెట్‌ కేటాయింపులపై జరిగిన సాధరణ చర్చలో భాగంగా అధికార పక్షం నుంచి కడియం శ్రీహరి సమయం మించి మాట్లాడుతున్న నేపథ్యంలో శాసన మండలి ప్రొటెం ఛైర్మన్‌ హసన్‌ జాఫ్రి మధ్యలో కలిపించుకొని ‘ముగించాలి’ అని కడియం శ్రీహరికి సూచించగా.. దానికి కడియం శ్రీహరి బదులిస్తూ…’అధ్యక్షా నా జుట్టు.. మీ జుట్టు నెరిసింది (తెల్ల జుట్టు). పని చేసే వారి జుట్టు నెరుస్తది. అందుకే మాలాంటి వాళ్లకు ఇంకా కొద్దిగా సమయం ఇవ్వాలి’ అని అన్నారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఫరూక్‌ను చూపిస్తూ.. ‘ఆయన నాకంటే కేవలం మూడేళ్లే చిన్న.. ఆయన చూడు ఎలా కనబడుతున్నారో. ఆయన జుట్టు నల్లగా ఉంది. నా జుట్టు తెల్లగా ఉంది. హరీష్‌ రావు కంటే ఫరూక్‌ పెద్ద.. కానీ ఫరూక్‌ తన జుట్టుకి రంగు వేసుకొని యువకునిగా కనిపిస్తున్నారు. హరీష్‌ రావు బాగా కష్టపడుతారు కాబట్టి ఆయన జుట్టు నెరసి (తెల్ల జుట్టుతో) పెద్ద వారిగా కనిపిస్తున్నారు. అందుకే హరీష్‌ భాయ్‌.. నువ్వు కూడా కలర్‌ వేసుకో’.. అని అనడంతో మిగతా సభ్యులు ఒకటే నవ్వు. ఇలా కొంత సేపు సభలో కడియం నవ్వులు పూయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement