Saturday, April 27, 2024

Big Story: పది పరీక్షలకు పక్కా ప్లానింగ్‌.. మెరుగైన ఫలితాలు వచ్చేలా చర్యలు

పదో తరగతీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ వందరోజుల యాక్షన్‌ ప్లాన్‌కు శ్రీకారం చుట్టింది. దానిని పక్కాగా అమలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక క్లాసులు నిర్వహించనున్నారు. మంత్రి సబితారెడ్డి సొంత జిల్లా కావడంతో రంగారెడ్డి జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా లక్షమంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు..

ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి: కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈసారి పది ఫరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. మే రెండవ వారంలో పరీక్షలు జరగనున్నాయి. గతంలో 11 పేపర్లు ఉండేవి వాటిని ఆరు పేపర్లకు కుదించారు. అందులో భాగంగానే శుక్రవారం నుంచి మోడల్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ప్లాన్​ చేశారు. పరీక్షల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుంటుంది. అందుకే పదిలో మంచి మార్కులు సాధించేందుకు వందరోజుల యాక్షన్‌ ప్లాన్‌కు శ్రీకారం చుట్టారు. సకాలంలో పోర్షన్‌ పూర్తి చేయడం.. విద్యార్థులకు స్పెషల్‌ క్లాసులు ఏర్పాటు చేసి పరీక్షలకు సిద్ధం చేయడం… వంటి కార్యక్రమాలు పక్కా ప్లానింగ్‌తో నిర్వహిస్తున్నారు. స్పెషల్‌ క్లాసులు ఏర్పాటు చేసి పదికి విద్యార్థులకు సిద్ధం చేస్తున్నారు. బాగా చదివే విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించేలా.. ఫర్వాలేదనే విద్యార్థులకు మంచి మార్కులు వచ్చేలా.. వీక్‌గా ఉన్న విద్యార్థులు కనీసం పాసయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఉదయం 8.45గంటలనుండి 9.30 గంటల వరకు.. సాయంత్రం 4.45గంటలనుండి 5.30గంటలవరకు స్పెషల్‌ క్లాసులు ఏర్పాటు చేశారు. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు స్పెషల్‌ క్లాసులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో లక్షమంది వరకు పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 45వేల మంది, మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలో 43వేలమంది, వికారాబాద్‌ జిల్లాలో 12వేల మంది విద్యార్థులు పది పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అన్ని సర్కార్‌ బడుల్లో స్పెషల్‌ క్లాసులు ఏర్పాటు చేసి విద్యార్థులను సమాయత్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారు. పది పరీక్షలు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. రంగారెడ్డి జిల్లాలో సగం రూరల్‌, మిగతా సగం అర్బన్‌ ప్రాంతాలున్నాయి. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో మొత్తం అర్బన్‌ ప్రాంతాలుండగా వికారాబాద్‌ జిల్లాలో మాత్రం రూరల్‌ ప్రాంతాలున్నాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర ఉత్తీర్ణత శాతం తక్కువే. ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

శుక్రవారం నుంచి మోడల్‌ పరీక్షలు..
మే రెండో వారంలో పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అప్పటివరకు విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా ఈనెల 4వ తేదీనుండి 11వ తేదీవరకు మొదటి విడత మోడల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 21వ తేదీనుండి 26వ తేదీవరకు సెంకడ్‌ విడత మోడల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ఎలా జరుగుతున్నాయనే దానిపై మానిటరింగ్‌ కమిటీకి శ్రీకారం చుట్టారు. శుక్రవారం నుండి ప్రారంభం కానున్న మోడల్‌ పరీక్షలను మానిటరింగ్‌ కమిటీ పరిశీలించనుంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో గురువారం జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. మోడల్‌ పరీక్షలతోపాటు స్పెషల్‌ క్లాసులు కూడా మానిటరింగ్‌ కమిటీ పరిశీలించనుంది. మానిటరింగ్‌ కమిటీలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.

వీక్‌ ఉన్న సబ్జెక్టులపై ఫోకస్‌..
గతంలో ఎక్కువమంది విద్యార్థులు ఏఏ సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యారనే దానిపై దృష్టిని కేంద్రీకరించారు. ప్రస్తుత పరీక్షల్లో ఆ పరిస్థితులు రాకుండా విద్యార్థులు వీక్‌గా ఉన్న సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ముఖ్యంగా గణితం, సామాన్యశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించి ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ఇప్పటికే స్కూళ్ల వారీగా విద్యార్థులు ఏఏ సబ్జెక్టుల్లో వీక్‌గా ఉన్నారనే విషయమై ఉపాధ్యాయులు ఒక అవగాహనకు వచ్చారు. వీక్‌గా ఉన్న సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. గతంలో ఎక్కువమంది ఏఏ సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యారనే లెక్కలు తీశారు. ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. గతంలో 11 పేపర్లు ఉండేవి. వాటిని రద్దు చేసి ప్రస్తుతం ఆరు సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి కూడా విద్యార్థులను సమాయత్తం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి రంగారెడ్డి జిల్లా వాసురాలు కావడంతో ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు విద్యాశాఖ అధికారులు…ఉత్తీర్ణత శాతం ఏమాత్రం తగ్గినా ఇబ్బందులు వస్తాయని భావించి పదికి పక్కాగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో ఎంతమేర విజయం సాధిస్తారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement