Saturday, May 4, 2024

వ‌డ్ల‌ కొనుగోళ్లలో కేంద్రం తీరు దుర్మార్గం.. గోయల్‌ది అహంకార వైఖరి: తెలంగాణ మంత్రులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్రంలో ఉన్నది రైతు, పేదల ప్రభుత్వం కాదని పొద్దున లేస్తే లెక్కలు చూసుకునే వ్యాపార, వాణిజ్య ప్రభుత్వమని తెలంగాణా రాష్ట్ర మంత్రుల బృందం మండిపడింది. తెలంగాణా అవసరాలు తీరగా మిగిలిన ముడిబియ్యం కొంటామంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తేల్చిచెప్పడంపై వారు ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో చర్చించేదుకు ఢిల్లీ పర్యటన చేపట్టిన రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో దాదాపు ముప్పావు గంట సేపు కేంద్ర ఆహార, వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చించారు. వంద శాతం వడ్లే కొనుగోలు చేయాలని వినతిపత్రం సమర్పించారు. పంజాబ్ తరహాలో తెలంగాణా నుంచి ధాన్యం సేకరిస్తామని కేంద్ర మంత్రి వారికి స్పష్టం చేశారు. సమావేశం అనంతరం మంత్రుల బృందం టీఆర్‌ఎస్ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో కలిసి తెలంగాణా భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ… పీయూష్ గోయల్‌ అహంకారపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ ప్రధాన దేశంలో ఒక రాష్ట్రం పట్ల కేంద్రం ఇలా అహంకారాన్ని ప్రదర్శించడం బాధాకరమన్నారు. పాడిందే పాట అన్నట్టు కేంద్ర ప్రభుత్వ తీరు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తమకంటే ముందే ఆత్రంగా మీడియా వద్దకు వెళ్లి తెలంగాణ ప్రభుత్వం రైతులను తప్పుదారి పట్టిస్తోందని చెప్పడం సిగ్గుచేటని మంత్రి మండిపడ్డారు. పండిన పంట కొనుగోలు బాధ్యత అంతా కేంద్రానిదన్న ఆయన, కేంద్రానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదని చెప్పుకొచ్చారు. ధాన్యం సేకరణకు, పప్పు దినుసుల సేకరణకు తేడా కేంద్రానికి తెలియడం లేదని విమర్శించారు. కేంద్రం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనుకోవడం అవివేకమని దుయ్యబట్టారు. వడ్లను వడ్లలాగే సేకరించాలి, గోధుమల సేకరణ అంటే గోధుమ పిండి సేకరిస్తారా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే మాట అడిగితే పీయూష్ గోయల్ పెద్దగా నవ్వారని ధ్వజమెత్తారు. తమకు మాత్రమే తెలివి ఉంది… ఇంకెవరికీ లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని వేలాదిమంది రైతులను రోడ్డు మీద నిలబెట్టి, దాదాపు 700 మంది చావుకు కారణమైన సిగ్గులేని, వ్యవసాయ ఆత్మ లేని ప్రభుత్వం బీజేపీదని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.

ఆఖరుకు రైతులకు చేతులెత్తి మొక్కి క్షమాపణ చెప్పింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి చెప్పి మేం మీ పంటలు కొనిపిస్తాం… మీరు వరి వేసుకోండంటూ రైతులను రెచ్చగొట్టారని మంత్రి గుర్తు చేశారు. అప్పటికే తాము తెలంగాణా రైతులకు విజ్ఞప్తి చేసి 50 లక్షల ఎకరాల వరి సాగును 30 లక్షలకు తగ్గించామని వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం నీళ్లిచ్చి, కరెంట్ ఇచ్చి, రైతుబంధు ఇచ్చి, రైతుభీమా ఇచ్చి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించిందని చెప్పుకొచ్చారు. ఇన్ని చేసినందుకు తమది రైతు వ్యతిరేక ప్రభుత్వమా అని నిరంజన్ రెడ్డి నిలదీశారు. పండిన ధాన్యం కొనాల్సిన బాధ్యత ఉన్న కేంద్రం నిరాకరించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయం 2022 వరకు రెట్టింపు చేస్తామన్న కేంద్రం కనీసం రైతులు పండించిన పంటలను కొనకపోవడం సిగ్గుచేటని ఆరోపించారు.

త్వరలోనే దేశ రైతాంగానికి, తెలంగాణా ప్రజలకు కేంద్రప్రభుత్వం క్షమాపణ చెప్పే పరిస్థితి వస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి జోస్యం చెప్పారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాఖ్య స్ఫూర్తి లేదని, కేంద్రం వివక్ష చూపుతోందని 2013లో రైతులతో సమావేశం పెట్టిన నరేంద్ర మోదీ ఇప్పుడు అదే సమాఖ్య స్ఫూర్తిని మోడీ నాయకత్వంలోని కేంద్రం దెబ్బ తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జీడీపీ పెంపుదలలో, నిరుద్యోగ నియంత్రణలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి ఆయన సూచనల మేరకు ఈ వ్యవహారంపై ముందుకెళ్తామని నిరంజన్ రెడ్డి తెలిపారు. పశుపక్షాదులకు కూడా నీళ్లు లేని చోట ఎండాకాలంలోనూ చెరువులు అలుగులు పారిస్తున్నామన్న మంత్రి, తెలంగాణ రైతులను ఆదుకున్నది కేసీఆరా? కేంద్రంలోని బీజేపీ మొనగాళ్లా అని ధ్వజమెత్తారు. తమకు అధికారం లేని చోట ఇతర పార్టీల ప్రభుత్వాలను కేంద్రంలోని బీజేపీ ఇబ్బందులు పెడుతోందని వాపోయారు. అబద్దాలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందనే విషయం వారి మేనిఫెస్టోను చూస్తేనే అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement