Monday, April 29, 2024

Big Story: ప్రభుత్వ అనుమతుల్లేవ్‌.. అయినా ప్రైవేటు కాలేజీల‌ హాస్టళ్లు న‌డుస్తున్న‌య్‌

ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో హాస్టళ్లకు అనుమతుల్లేవ్‌.. అయినా చాలామ‌టుకు యథేచ్ఛగా న‌డుస్తున్న‌య్‌. పోనీ ఈ విషయం అధికారులకు తెలియదా అంటే అదీ లేదు. అన్ని తెలిసినా కానీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ఉన్న 1584 కాలేజీల్లో ఎలాంటి అకాడమీ, హాస్టల్‌ నిర్వహణకు ఇంటర్మీడియట్‌ బోర్డు అనుమతులు జారీ చేయలేదు. కానీ కార్పొరేట్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు వీటిని యథేచ్ఛగా న‌డిపిస్తున్నాయి. దొడ్డి దారిన నడిపిస్తూ ప్రభుత్వ ఖజానాకు రూ.వందల కోట్లల్లో గండి కొడుతున్నారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీలు మొత్తం 405 వరకు ఉంటే, 2021-22 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ బోర్డు నుండి అనుబంధ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ కాలేజీలు అధికారుల లెక్కల ప్రకారం 1584 ఉన్నాయి. వీటిలోని సుమారు సగం వరకు ప్రైవేట్‌ కాలేజీల్లో అనుమతులు లేకుండానే హాస్టళ్లను, అకాడమీలను నడిపిస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్‌ గవర్నమెంట్‌ లెక్చరర్‌ అసోసియేషన్‌ (టీఐజీఎల్‌ఏ) అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం.జంగయ్య, ఎం.రామకృష్ణ గౌడ్‌ సమాచార హక్కు చట్టం కింద ఈ అంశంపై వివరాలు కోరగా ఇంటర్మీడియట్‌ బోర్డు సమాచారమిచ్చింది. బోర్డు ఇచ్చిన సమాచారం ప్రకారం జూనియర్‌ కాలేజీలను నడుపుకునేందుకు మాత్రమే తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు అనుమతినిచ్చిందని…, అకాడమీలకు, హాస్టళ్లకు ఇవ్వలేదని అందులో పేర్కొంది. ఈ ఏడాదే కాదు గతంలోనూ ఎప్పుడూ కూడా హాస్టళ్లు, అకాడమీలు నడుపుకోమని ఇంటర్‌ బోర్డు అనుమతివ్వలేదని బోర్డులోని ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే ఫైర్‌ ఎన్‌వోసి, అనుమతుల్లేని హాస్టళ్ల నిర్వహణపై కోర్టులో కేసు కూడా ఉన్నట్లు సమాచారం. అయినా కానీ ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీలు హాస్టళ్లను నడిపిస్తున్నాయి. విద్యార్థుల దగ్గర నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి.

లక్షల్లో ఫీజు వసూలు…
రాష్ట్రంలో 1584 ప్రైవేట్‌ కాలేజీలు ఉంటే అందులో 700 నుంచి 800 కాలేజీల్లో బోర్డు అనుమతుల్లేకుండా హాస్టళ్లను నిర్వహిస్తున్నారని తెలంగాణ ఇంటర్మీడియట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులను వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఒక్కో విద్యార్థి నుండి కేవలం హాస్టల్‌ ఫీజే నెలకు కనీసం రూ.5000 నుంచి రూ.7000 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్‌ కాలేజీల్లో ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌ ఫీజు కలిపి రూ. లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆరోపిస్తుంది. ఏసీ, సెమీ ఏసీ, నాన్‌ ఏసీ రూమ్‌ల పేరుతో దాదాపు రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు హాస్టల్‌ ఫీజులను వసూలు చేస్తున్నారని పేర్కొంది. ఈ దోపిడీ ఎక్కువగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఎక్కువగా ఉంది. రూరల్‌ ప్రాంతాల్లో ఉండే కాలేజీల్లో పెద్దగా హాస్టళ్లు లేవు. జిల్లా కేంద్రాల్లు, అర్బన్‌ ప్రాంతాల్లో కొన్ని కాలేజీలు హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. అక్కడ రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాలేజీల్లో ఆర్ట్స్‌ గ్రూపు కూడా ఉండాలి…
అంతే కాకుండా ఒక కాలేజీకి అనుమతి తీసుకుంటూ మరికొన్ని బ్రాంచిలను నెలకొల్పుతున్నారు. ఒక
కాలేజీకు అనుమతి ఇవ్వాలంటే ఆ కాలేజీలో సైన్స్‌ గ్రూపుతో పాటు ఏదేని ఆర్ట్స్‌ గ్రూపును కూడా బోధించాల్సి ఉంటుందని టీఐజీఎల్‌ఏ నేతలు పేర్కొన్నారు. కానీ సీఈసీ, హెచ్‌ఈసీ లాంటి కోర్సులు లేకుండానే కేవలం సైన్స్‌ గ్రూపులతో పాటు ఎంసెట్‌, జేఈఈ, నీట్‌ లాంటి పేర్లతో ప్రత్యేక క్లాసులను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా అనుమతుల్లేకుండా హాస్టళ్లను, కోర్సులను, బ్రాంచిలను ఏర్పాటు చేసుకుంటూ ప్రతి ఏడాది వేల కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారని అసోసియేషన్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

దొడ్డిదారిలో రూ.వేల కోట్లల్లో వ్యాపారం: ఎం.రామకృష్ణ గౌడ్‌, టీఐజీఎల్‌ఏ ప్రధానకార్యదర్శి
జూనియర్‌ కాలేజీల్లో హాస్టళ్ల నిర్వహణకు అనుమతులు లేకున్నా ఒక్కో విద్యార్థి నుండి వేలు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. దొడ్డి దారిన ప్రతి ఏటా 4 నుంచి 5వేల కోట్ల వ్యాపారం నడుస్తోంది. కళాశాలల నుంచి అందినకాడ దండుకుని విచ్చలవిడిగా అనుమతులిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రభుత్వ ఖజానాను గండి కొడుతున్నారు. ప్రైవేట్‌ కాలేజీలపై అధికారుల పర్యవేక్షణ లేదు. రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలకు హాస్టల్‌ నిర్వహణకు గాని, అకాడమీ నిర్వహణకు గానీ ఇంటర్మీడియట్‌ బోర్డు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అనుమతుల్లేకుండా హాస్టళ్లను, అకాడమీలు, కాలేజీ బ్రాంచిలను నడిపిస్తున్న కార్పొరేట్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలపై, అధికారులపై చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం.

- Advertisement -

అనుమతి రద్దు చేయాలి: నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర శాఖ
1994లో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 1 ప్రకారం కళాశాలల ఆవరణలో ఎక్కడా కూడా హాస్టల్‌ను ఏర్పాటు చేయకూడదు. కానీ మెజార్టీ ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీలు అనుమతుల్లేకుండానే హాస్టళ్లను, కళాశాలలను నడిపిస్తున్నాయి. ఇలా నడిపే కళాశాలల అనుమతిని రద్దు చేయాలి. ప్రభుత్వం దీనిపై ఒక కమిటీ వేసి చర్యలు తీసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement