Monday, May 13, 2024

Golden Chance – భ‌లే మంచి ఛాన్స్ లే…. దొరికినంతా మేసేద్దాం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కుందాం… వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుందాం… నైతిక విలువలంటూ కూర్చుంటే నష్టపోవడమే… అందింది పుచ్చుకుందాం… గోడ దూకేద్దాం! …ఇదీ ప్రస్తుతం ఎన్నికల రణక్షేత్రంలో గ్రామ, వార్డు స్థాయి నేతల తీరు! ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా వీరికి అతీతం కాదు! ఇది ఏ తీరులో ఉందంటే ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొకటి, సాయం త్రానికి ఇంకొక కండువాను కప్పుకునేందుకు ఏమాత్రం సిగ్గు పడడం లేదు. దీంతో విస్తు పోవడం ఆయా పార్టీల వంతు అవుతోంది. ఊసరవెల్లులకే పాఠాలు నేర్పుతున్న వీరి వ్యవ హారం తలనొప్పిగా మారడమే కాకుండా వాస్తవ పరిస్థితి ఏంటో కూడా తెలియని అయోమయంలో అభ్యర్థులు, నేతలు ఉన్నారు. ఎన్నికల వేడి పెరగడంతో నియోజక వర్గాల్లో చోటా నాయకుల ప్రాధాన్యం అమాంతం పెరిగి పోయింది. దేశ ఎన్నికల చరిత్రలోనే లేనివిధంగా ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయిలో లక్ష్మీ తాండవిస్తోంది! కొత్తగా పెళ్లయిన అల్లుడు అలకపాన్పు ఎక్కినట్టు తరతమ బేధం లేకుండా అందరిదీ ఒక్కటే డిమాండ్‌! తమ పార్టీ కింది స్థాయి నేతలే అసమ్మతిరాగాలు తీవ్రస్థాయిలో ఆలపిస్తుండడం పార్టీలను నివ్వెరపరుస్తోంది. గంట గంటకూ, రోజు రోజుకూ వీరి పాట ఆలపన పెరిగిపోతోంది! పైగా కొత్త డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి…


ఈసారి అసెంబ్లి ఎన్నికల హోరు తీవ్రస్థాయిలో ఉంటుందని ఇప్పటికే వెలువడుతున్న వేడి చెప్పకనే చెబుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి గెలిచినా మెజారిటీ తక్కువ స్థాయిలోనే ఉంటుందని విశ్లేషకుల అంచనా! దీంతో పోలింగ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాధాన్యం పెరిగింది. ఒక్క ఓటును కూడా నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి! ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు స్థాయి నేతలకు ఎక్కడలేని ఇంపార్టెన్స్‌ వచ్చింది. అన్ని పార్టీలు ఆయా చోటా మోటా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం అనివార్యంగా మారింది.
భానుడి కంటే ముందుగానే ఆయా పార్టీల నియోజకవర్గ స్థాయి నేతలు తలుపుతడుతున్నారు! దీంతో ప్రత్యర్థి పార్టీ గ్రామ, వార్డు స్థాయి నేతలతో పాటు సొంత పార్టీ నేతలను కూడా సవరదీసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు! తీరా వారిని సంతృప్తి పరిచినా ఆసాంతం తమ వెంట ఉంటారని నమ్మలేకుండా ఉన్నామని వారు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే పొద్దున్న తమతో మాట్లాడి ఓకే చెప్పిన వాళ్లే మధ్యాహ్నం మరో పార్టీ నేతలతో కనిపిస్తున్నారు! ఇలా పూటకో పల్లవి అందుకుంటుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అభ్యర్ధులు పడిపోతున్నారు!


ఈ పరిస్థితి ఇలా ఉంటే వీళ్లందరినీ సరి చేయడానికి కొందరు మధ్యవర్తులకు కూడా డిమాండ్‌ ఏర్పడింది! వాళ్లను ముందుగా మంచి చేసుకుని ఆ తర్వాత ఈ చోటా మోటా నాయకులను కలిసి డిమాండ్లను తీరుస్తున్నారు. అంతేకాదండోయ్‌… మళ్లిd పార్టీ మారితే ఇచ్చిన బహుమతులన్నీ తిరిగి ఇచ్చేయాలన్న పెద్దమనుషుల ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. ఇదే ఈ ఎపిసోడ్‌లో హైలైట్‌! ఇక భార్యాభర్తలను కూడా విడివిడిగా సంప్రదించి డిమాండ్లు తీర్చాల్సి రావడం కొసమెరుపు! ఎందుకంటే భార్య సర్పంచ్‌గా ఉంటే భర్తను, భర్త సర్పంచ్‌గా ఉంటే భార్యతోనూ మాట్లాడి సంతృప్తికర ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు! వార్డు మెంబర్‌, మాజీ మెంబర్‌లకు కూడా ఏమాత్రం తగ్గేదేలే అని విశ్వరూపం చూపించి అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు!

Advertisement

తాజా వార్తలు

Advertisement