Wednesday, May 15, 2024

Fun Day: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌.. డార్లింగ్ రేంజే వేర‌ప్పా..

ఇండియాలో నెంబర్ వన్ హీరో ఎవరు? ఈ ప్రశ్నకు ఆన్స‌ర్‌ గతంలో చాలా మంది హీరోల పేర్లు వినిపించేవి. కానీ, ఈ మ‌ధ్య కాలంలో త‌న‌దైన స్టైల్‌లో మూవీస్ చేస్తూ.. రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియా నెం1 హీరో అనిపించుకుంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియన్ హీరో అయిపోయారు. ఆ సినిమాతో వచ్చిన మార్కెట్ గాలివాటం కాదు అని నిరూపించుకునే పనిలో పడ్డారు ప్రభాస్. చాలా జాగ్రత్తగా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథల వైపు అడుగులు వేస్తున్నారు. అందుకే ప్రభాస్ నటించిన సినిమాలు వందల కోట్ల బిజినెస్ చేస్తున్నాయంటున్నారు సినీ క్రిటిక్స్‌.

బాహుబలి తర్వాత భారీ అంచనాలతో విడుదలైన సాహో కూడా హిందీలో అద్భుతమైన విజయం సాధించింది. సుజిత్ తెరకెక్కించిన ఈ చిత్రం బాలీవుడ్ లో 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అక్కడ స్టార్ హీరోల సినిమాలకు దీటుగా ప్రభాస్ కూడా జెండా పాతేసారు. అంతేకాదు ఈయనతో సినిమాల కోసం కేజిఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్, ఓం రౌత్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా లాంటి పాన్ ఇండియన్ డైరెక్టర్స్ పోటీ పడుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా నటించే సినిమాల కోసం వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు కూడా తాము రెడీగా ఉన్నామ‌న్న చెబుతున్నార‌ట‌. దీన్నిబట్టి ఆయన రేంజ్ ఏంటి అనేది అర్థం అవుతోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్‌ ప్రభాస్.

ప్ర‌భాస్‌ ఒక్కో సినిమాకు 150 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు సినిమాకు 150కోట్ల పారితోషికం ఎవరూ తీసుకోలేద‌నేది టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఆ రికార్డు చేరుకున్న తొలి హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించారు. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఎందరో సూపర్ స్టార్స్ ఉన్నారు. కానీ, 150 కోట్ల పారితోషికం ఎవరూ అందుకోలేదు. ప్రస్తుతం ఈయన రాధే శ్యామ్, సలార్, నాగ్ అశ్విన్ సినిమా, ఆదిపురుష్, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటిలో రాధే శ్యామ్ జనవరి 14న విడుదల కానుంది.

ఆ తర్వాత డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన‌ సలార్, ఆదిపురుష్ కూడా 2022లోనే రిలీజ్‌ కానున్నాయి. కేవలం హీరోగానే కాకుండా సామాజిక బాధ్యత విషయంలో కూడా ప్రభాస్ అందరికంటే ముందున్నారు. మొన్న ఏపీలో వరదల కారణంగా నష్టపోయిన వాళ్లకు విరాళంగా కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చారు రెబల్ స్టార్. కేవలం సినిమాలు మాత్రమే కాదు ఎండోర్స్ మెంట్ విషయంలో కూడా ప్రభాస్ చాలా క్రేజ్ తెచ్చుకున్నారు. కానీ, ఆయనే బ్రాండింగ్ చేయడానికి కాస్త దూరంగా ఉన్నారు. చేసే ప్రతి సినిమా కోసం ప్రాణం పెడుతూ బాలీవుడ్ హీరోలు కూడా షాక్ అయ్యేలా మేకోవర్ అవుతున్నారు ప్రభాస్. ఈ లక్షణాలన్నీ ఆయనను ఇండియాస్ నెంబర్ వన్ హీరో చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement