Monday, April 29, 2024

War: ఒకవైపు యుద్ధం.. అయినా రష్యాలో కండోమ్‌ల‌కు ఫుల్ డిమాండ్‌.. మెడిక‌ల్ షాపుల్లో నో స్టాక్!

ఉక్రెయిన్‌తో రష్యా దళాలు కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా దళాలు చుట్టుముట్టి ఉన్నాయి. ఈ క్రమంలో రష్యా చర్యలను ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ప్రజలు ఎక్కువగా కొంటున్నవి ఏంటో తెలుసా? కండోమ్‌లు. అవును నిజమండీ బాబూ.. తాజా లెక్కల ప్రకారం గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం రష్యాలో కండోమ్ అమ్మకాలు 170 శాతం పెరిగాయని ఆ దేశ ఆన్‌లైన్ రీటెయిలర్ వైల్డ్‌బెర్రీస్ వెల్లడించింది. ప్రముఖ ఫార్మా చైన్ కూడా తమ కండోమ్ అమ్మకాల్లో 26 శాతం పెరుగుదల కనిపించిందని చెప్పింది. మొత్తంగా మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్న కండోమ్‌ల సంఖ్యలోనే 32 శాతం పెరుగుదల కనిపిస్తోందట.

సూపర్ మార్కెట్లలో కూడా ఈ పెరుగుదల 30 శాతంపైగానే ఉంది. వీటి ధరలు 50 శాతం పెరిగినా కూడా కండోమ్ అమ్మకాల్లో మాత్రం ఎటువంటి తగ్గింపులేదని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం పశ్చిమ దేశాల ఆంక్షలే అని తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కండోమ్‌ల ధరలు విపరీతంగా పెరుగుతాయనే భయం రష్యన్లలో పెరిగింది. ఈ కారణంగానే కండోమ్ విక్రయాలు ఆకాశాన్ని తాకుతున్నాయని తెలుస్తోంది. అయితే కండోమ్‌లు తయారుచేసే పశ్చిమ దేశాల కంపెనీలు రష్యాలో తమ వ్యాపారాన్ని ఆపకపోవడం గమనార్హం.

కానీ ఆంక్షల వల్ల రష్యా కరెన్సీ విలువ.. డాలర్, యూరోలతో పోలిస్తే తగ్గుతోంది. ఈ కారణంగా కండోమ్‌ల ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ప్రజలు కొంటున్న కండోమ్‌లను భవిష్యత్తులో వాడేందుకే కొంటున్నారని, అప్పుడు కండోమ్‌లు కొనలేని ధరకు చేరుతాయని ప్రజలు భావిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రపంచంలో కండోమ్‌లు అత్యధికంగా ఉత్పత్తి చేసే భారత్, థాయ్‌ల్యాండ్, దక్షిణ కొరియా, చైనాల నుంచి రష్యాకు దిగుమతులు ఆగలేదని, కాబట్టి కండోమ్‌ల కొరత అనేది దేశంలో రాదని అధికారులు అంటున్నారు. అదే సమయంలో ఆంక్షలు విధిస్తున్న పాశ్చాత్య దేశాలకు చెందిన కంపెనీలకు చెందిన కండోమ్‌లు వాడకుండా.. రష్యా మిత్రదేశాల నుంచి వచ్చే మంచి కండోమ్‌లు వాడాలని సెక్స్ స్పెషలిస్టులు కూడా రష్యన్ ప్రజలకు సలహాలు ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement