Friday, May 3, 2024

TS | హీట్​వేవ్​ని సమర్థవంతంగా ఎదుర్కొంటాం.. అన్ని ఆస్పత్రుల్లో ఐసీయూలు ఉన్నాయి: హరీశ్​రావు

వానాకాలం సీజన్​ వచ్చినా ఇంకా విపరీతమైన టెంపరేచర్లు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో హీట్​వేవ్​ పెరగడంతో వడదెబ్బకు చాలామంది పిట్టల్లా ప్రాణాలు వదులుతున్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ఇవ్వాల (బుధవారం) ఏడు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన ఈ సమీక్షలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టి హరీశ్ రావు పాల్గొన్నారు.

రాష్ట్రంలో పెరుగుతున్న హీట్​వేవ్​ని ఎదుర్కోవటానికి సమగ్ర ద్విముఖ వ్యూహాన్ని అమలు చేసినట్లు మంత్రి హరీవ్​ ఈ సందర్భంగా తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగళ్ల వానల కారణంగా ప్రజల ఆందోళనలను పరిష్కరించడానికి ఏడు రాష్ట్రాల నుండి ఆరోగ్య మంత్రులు.. విపత్తు నిర్వహణ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్​కు హాజరయ్యారు.

ఇక.. జిల్లా స్థాయిలోని సబ్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి తగిన అవగాహణ కల్పించడం, వారి నైపుణ్యాలను మరింత పెంచేదుకు ప్రతి జిల్లాలో ఇద్దరు వైద్యాధికారులను నియమించినట్లు హరీశ్​రావు ఈ సందర్భంగా హైలైట్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు), అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (UPHCలు) సహా అన్ని ఆసుపత్రులలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. తెలంగాణలో అంతరాయం లేని ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నట్టు చెప్పారు.  హీట్​వేవ్​ని నివారించడానికి, వివిధ బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, నిర్మాణ స్థలాలు, ఉపాధి హామీ పనుల స్థలాలలో తాగు నీటి సౌకర్యం కల్పించినట్టు వెల్లడించారు.

వేడి -సంబంధిత వ్యాధులతో ఆస్పత్రులకు వస్తున్న వారికి  ప్రభుత్వం ప్రత్యేక వార్డులు, ICU పడకలను కూడా ఏర్పాటు చేసినట్టు హరీశ్​రావు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 108 అంబులెన్స్ లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ వాహనాల్లో అత్యవసరాలకు అవసరమైన మందులను అమర్చామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, ORS  ఇతర ముఖ్యమైన మందులను నిల్వ చేసినట్టు తెలిపారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement