Thursday, May 16, 2024

Big Story: రిజర్వుడు స్థానాలపై ఫోకస్‌.. ఎస్సీ, ఎస్టీల్లో బలమైన లీడర్ల గుర్తింపు

రాష్ట్రంలో రాజకీయ వేడి అప్పుడే మొదలైంది. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే.. ఇప్పటి నుంచే నియోజక వర్గాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టిని సారించాయి. అధికార టీఆర్‌ఎస్‌ ఎప్పటికప్పుడు నిఘా విభాగాల ద్వారా సమాచార సేకరణలో ఉండగా.. అందుకు దీటుగానే ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలు కూడా వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రధానంగా రిజర్వ్ డు నియోజక వర్గాలపై అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అందులో బీజేపీ ఒక అడుగు ముందుకేసి ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాల్లో పాగా వేయాలనే పట్టుదలతో ఉండగా.. టీఆర్‌ఎస్‌, బీజేపీల కార్యాచరణకు దీటుగా ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రతి వ్యూహాలను రూపొందిస్తోంది. ముందు నుంచి పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంక్‌గా ఉన్న దళిత, గిరిజన వర్గాలను తిరిగి సంపాదించుకునే ప్రయత్నంలో హస్తం నాయకులు ఆలోచన చేస్తున్నారు.

రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజక వర్గాలుండగా.. వాటిలో 19 ఎస్సీ, ఎస్టీలకు 12 స్థానాలు కలిపి మొత్తం 31 అసెంబ్లీ నియోజక వర్గాలు రిజర్వేషన్లు చేయబడ్డాయి. ఈ రిజర్వ్ డు నియోజక వర్గాల్లో ఆయా వర్గాలకు చెందిన ఓటు బ్యాంక్‌ దాదాపుగా 40 నుంచి 50 వేల వరకు ఉంటుంది. దళిత బంధు పథకంతో సీఎం కేసీఆర్‌ దళిత వర్గాల ఓటు బ్యాంక్‌ ను పదిలం చేసుకునే దిశలో అడుగులు వేస్తున్నారని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మెల్కొనకపోతే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన హస్తం నాయకులు నియోజక వర్గాల్లో పట్టు సాధించుకునే పనిలో ఉన్నారు. దళిత, గిరిజన వర్గాలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దళిత సీఎం, మూడు ఎకరాల భూ పంపిణి, డబుబెడ్‌ రూం ఇళ్లు, దళిత, గిరిజన వర్గాలపై దాడులు, హత్యలతో పాటు కొత్త రాజ్యాంగం అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలనే ఆలోచన చేస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు..
గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను సమీక్షించుకుని ముందుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై ఎన్ని ఓట్ల తేడాతో ఓటమి చెందాం.. ఓటమికి గల కారణాలు ఏంటీ..? టికెట్లు ఆలస్యంగా కేటాయించడమా..? ఆర్థిక అంశాలు కూడా కారణమా..? అనే అంశాలపైన టీ పీసీసీ నాయకత్వం దృష్టి సారించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఆ సమస్యలను రాకుండా జాగ్రత్తపడితే రిజర్వ్‌డు నియోజక వర్గాల్లో పై చేయి సాధించడానికి అవకాశం ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌లోని ధర్మపురి నియోజక వర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌పైన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ గత రెండు పర్యాయాలుగా పోటీ చేసి కేవలం వందల ఓట్ల తేడాతోనే ఓటమి చవి చూశారు. కొంత కష్టపడితే గెలిచే అవకాశాలు ఉండేవని ఎన్నికల తర్వాత లెక్కలేసుకోవడం జరుగుతోంది. అయితే పార్టీ టికెట్‌ ఆలస్యంగా ఇవ్వడంతో పాటు చివరి నిమిషంలో ఆర్థిక ఇబ్బందులు, అన్ని గ్రామాల్లో పూర్తిగా ప్రచారం చేయడానికి సమయం లేకపోవడం వల్ల ఓటమి చెందాల్సి వచ్చిందని టీ పీసీసీ నాయకత్వం గుర్తించింది.

అంతే కాకుండా సూర్యాపేట జిల్లా తుంగతూర్తి నియోజక వర్గంలోనూ అదే పరిస్థితి నెలకొన్నది. నామినేషన్లు వేసే సమమయం ముగిసే ఒక రోజు ముందు అభ్యర్థిని ప్రకటించడం, హడావుడిగా నామినేషన్లు వేసి పూర్తి స్థాయిలో ప్రచారం చేయకపోవడం వల్ల గెలిచే అవకాశాలున్నప్పటికి.. ఓటమి చెందాల్సి వస్తుందని హస్తం నాయకులు చెబుతున్నారు. ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ ఎస్సీ రిజర్వ్‌డు నియోజక వర్గాల్లో నెలకొన్నదని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. ఎస్టీ నియోజక వర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఉమ్మడి అదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలలో మొత్తం 12 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్‌ అయ్యాయి. ఒక ఖమ్మం జిల్లాలోనే గత ఎన్నికల్లో 5 ఎస్టీ నియోజక వర్గాలకు గాను మూడింటిలో కాంగ్రెస్‌, అశ్వరావుపేటలో టీడీపీ విజయం సాధించింది. 2 ఎస్సీ నియోజక వర్గాలుండగా మదిరలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సత్తుపల్లిలో టీడీపీ విజయం సాధించింది. మూడు జనరల్‌ నియోజక వర్గాల్లో రెండు కాంగ్రెస్‌, ఒకటి టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. తిరిగి ఆ జిల్లాలో పట్టు సాధించేందుకు కాంగ్రెస్​ పార్టీ ప్రయత్నాలను మొదలు పెట్టింది.

ముందుగానే అభ్యర్థుల గుర్తింపు..
ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డు నియోజక వర్గాల్లో బలమైన అభ్యర్థులను ముందుగానే గుర్తించడం వల్ల సానుకూల ఫలితాలుంటాయని టీ పీసీసీ నాయకత్వం భావిస్తోంది. ఎస్సీ నియోజక వర్గాల విషయానికి వస్తే అందోల్‌, జహీరాబాద్‌, అలంపూర్‌, జుక్కల్‌, ధర్మపురి తదితర నియోజక వర్గాల్లో సీనియర్‌ నాయకులు ఉన్నారు. మదిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగతా నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరడంతో నాయకత్వ సమస్య తీవ్రంగా ఉంది. ఇదే సమస్య ఎస్టీ నియోజక వర్గాల్లోనూ ఉన్నది. ఈ నాయకత్వ సమస్యను అధిగమించాలంటే ముందుగానే బలమైన నాయకులును గుర్తించి నిత్యం ప్రజల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో సత్ఫలితాలు వస్తాయని పార్టీకి చెందిన ఒక ముఖ్య నేత అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement