Monday, May 20, 2024

‘మ‌ణ’ …. భార‌త దేశపు తొలి గ్రామం..

ఉత్తరాఖండ్‌ పరిథిలో బదరీనాథ్‌ క్షేత్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో కన్పించే అతి చిన్న గ్రామం మణ. చైనా సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉండే ఈ గ్రామాన్ని ఇన్నాళ్లూ భారత్‌లో చిట్టచివరి గ్రామంగా పిలిచేవారు. జాతీయ రహదారుల్లోను, గ్రామంలోనూ ఆదే విషయాన్ని సూచిస్తూ సైన్‌ బోర్డులు, కమాన్‌లు ఏర్పాటు చేశారు. అయితే ఇటీవలి కాలంలో సరిహద్దుల్లో చైనా కవ్వింపులు, దురాక్రమణలు ఎక్కువైనాయి. అరుణాచల్‌, ఉత్తరాఖండ్‌.. ఇలా తన సరిహద్దు రాష్ట్రాల్లో కయ్యానికి దిగుతూ తలనొప్పులు తెస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లోని గ్రామాలను చివరివిగా పేర్కొన వద్దని, వాటిని దేశపు తొలి గ్రామాలుగా గుర్తించి అభి వృద్ధి చేయాలని భావిం చింది. గత అక్టోబర్‌లో ప్రధా ని మోడీ మణలో పర్యటిం చారు. సరిహద్దు గ్రామాలను చివరివిగా చిన్నచూపు చూడొ ద్దని, వాటిని ఉజ్వలంగా అభి వృద్ధి చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రధాని మణ.. భారత దేశపు తొట్ట తొలి గ్రామంగా ప్రకటించారు. వైబ్రంట్‌ విలేజ్‌ ప్రోగ్రామ్‌ పేరుతో చైనాతో సరిహద్దులున్న అరుణాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్‌, కేంద్ర పాలిత ప్రాంతం లఢఖ్‌లోని 19 జిల్లాల్లో, 46 పంచాయతీ సమితిలకు చెందిన 2967 గ్రామాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) ఆధ్వర్యంలో సోమవారంనాడు మణలో ఏడవ నెంబర్‌ జాతీయ రహదారిపై సరికొత్త సైన్‌ బోర్డు ఏర్పాటయ్యింది. ఇన్నాళ్లూ అక్కడున్న చిట్ట చివరి భారతీయ గ్రామం అనే ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఉన్న బోర్డులుండేవి. వాటిని ఇప్పుడు తొలగించి భారతదేశపు తొట్ట తొలి గ్రామం అనే బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ బోర్డు ఏర్పాటు చేస్తున్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఉత్తరా ఖండ్‌ ముఖ్య మంత్రి ధామి… ప్రధాని సారథ్యంలో సరిహద్దు గ్రామాలు ఉజ్వలంగా అభివృద్ధి చెందుతున్నాయని ట్వీట్‌ చేశారు. తొలి గ్రామంగా ఇప్పుడు పిలుస్తున్న ప్పటికీ… ఇన్నాళ్లూ చివరి గ్రామంగా చెప్పుకున్నప్పటికీ… పురాణతిహాసా ల్లోనూ, పర్యాటక పరంగానూ మణకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ విశేషాలేంటో చూద్దాం…

అతిచిన్న గ్రామం
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో హిమా లయ పర్వత సానువుల్లో ఈ పల్లె ఉంది. సముద్ర మట్టానికి 3200 మీటర్ల ఎత్తున ఉన్న ఈ గ్రామం లో 2011 జనాభా లెక్కల ప్రకారం 558 ఇళ్లు, 1214 మంది జనాభా ఉన్నారు. ఇండో – నేపాల్‌ జాతులకు (భోతి యాస్‌ తెగ) చెందిన వారే ఎక్కువ. టిబెటిక్‌ భాషతోపాటు హిందీ మాట్లాడతారు. పర్యా టకమే ప్రధాన ఆదాయ వనరు. శీతాకాలంలో మంచు ధారాళంగా కురుస్తుంది. ప్రజలు గ్రామం అంతా ఖాళీ చేసి దిగువ ప్రాంతాలకు వచ్చేస్తారు. హిమాలయ పర్వతాల మధ్యలో ఓ వారగా అమర్చినట్లు ఈ గ్రామం ఉంటుంది. గుహలు, లోయలు, విచిత్రమైన వాతావరణం అక్కడి ప్రత్యేకత. ఇండియా – టిబెట్‌ సరిహద్దుకు 26 కి.మి దూరంలో ఈ గ్రామం ఉంది.
కొసమెరుపు
బదరీనాథ్‌ వెళ్లే వారంతా మణ సందర్శిస్తారు. అక్కడి ప్రకృతి అందాలను తిలకిస్తారు. నిత్యం శీతలగాలులు, చల్లని వాతావరణం గజగజలాడిస్తుంది. అందుకే అక్కడకు వచ్చే పర్యాటకుల కోసం వేడివేడి కాఫీ అందించే దుకాణాలు ఎక్కువగా ఉంటాయి. తమ దుకాణానికి వచ్చే పర్యాటకులతో మాట్లాడేటప్పుడు.. తమ కాఫీ దుకాణం దేశంలో చిట్టచివరిదని చెప్పటం పరిపాటి.
ప్రతీ దుకాణదారూ అదే మాట చెబుతారు. ఇప్పుడు వారి పల్లవి మారి పోతుందన్నమాట.. దేశపు తొలి కాఫీ షాప్‌ తమదేననడం ఖాయం. అయితే ఈసారి ఆ విషయాన్ని సగర్వంగా చెప్పుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement