Saturday, May 4, 2024

Fire: అగ్గిపెట్టె రేట్.. అమాంతం పెంచేశార‌ట‌!

  • 14 ఏళ్ల తర్వాత ఫ‌స్ట్ టైమ్‌ పెరుగుతున్న ధర.. ఇక పెట్టె 2 రూపాయలు..

దాదాపు 14 ఏండ్ల‌ తర్వాత ఫ‌స్ట్ టైమ్‌ అగ్గిపెట్టె ధరలు పెరుగుతున్నాయి. అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించే 14 రకాల ముడి పదార్థాల ధరలు పెరగడమే దీనికి కారణం. ప్రస్తుతం అగ్గిపెట్టెను రూపాయికి విక్రయిస్తుండగా డిసెంబరు 1 నుంచి 2 రూపాయలకు అమ్మ‌నున్న‌ట్టు తయారీ సంస్థలు ప్రకటించాయి.

అగ్గిపుల్ల తయారీలో వినియోగించే రెడ్‌ఫాస్ఫరస్, మైనం, బాక్స్ బోర్డులు, పేపర్, పొటాషియం క్లోరేట్, గంధకం వంటి వాటి ధరలు పెరగడంతో తామూ ధర పెంచక తప్పడం లేదని తయారీదారులు పేర్కొన్నారు.అగ్గిపెట్టె తయారీదార్లకు సంబంధించి 5 సంఘాలు శివకాశీలో సమావేశమై ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నాయి.

కాగా, చివరిసారి 2007లో అగ్గిపెట్టె ధరను పెంచారు. అప్పట్లో రూ.50 పైసలున్న అగ్గిపెట్టె ధరను రూపాయికి పెంచారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ ధరను రెట్టింపు చేశారు. ప్రస్తుతం 600 అగ్గిపెట్టెలున్న బాక్స్‌ను రూ. 270-300 మధ్య విక్రయిస్తుండగా, తాజా నిర్ణయంతో దీని ధర రూ.430-480కి పెరగనుంది.

ఈ మేరకు నేషనల్ స్మాల్ మ్యాచ్‌బాక్స్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ కార్యదర్శి వి.ఎస్. సేతురథినమ్ తెలిపారు. ఈ ధరకు 12 శాతం జీఎస్టీ, రవాణా చార్జీలు అదనమని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement