Sunday, May 19, 2024

మహబుబాబాద్​ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు.. రెండు నెలల్లోనే 20మంది బలవన్మరణం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వ్యవసాయంచేసి దేశానికి అన్నంబెట్టేరైతన్నకు కష్టం వస్తే పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. అకాల వానలు, విపరీతమైన కొత్త కొత్త వైరస్‌లతో పంటలన్నీ ఆగమవుతున్నాయి. వెరసి వీటన్నింటిని చూసి తట్టుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక రైతులు పురుగుల మందు సేవించి అర్ధాంతరంగా ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు కలచివేస్తుండగా తాజాగా రైతు స్వరాజ్య వేదిక, మానవ హక్కుల వేదిక సంయుక్తంగా మహబూబాబాద్‌ జిల్లాలో చేసిన సర్వేలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఒక్క ప్రాంతంలోనే 2 నెలల వ్యవధిలో సుమారు 20 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నట్టు సర్వేలో తేలింది. సర్వే నిర్వహించిన వారిలో మానవ హక్కుల వేదిక నుంచి డాక్టర్‌ ఎస్‌ తిరుపతయ్య, రైతు స్వరాజ్య వేదిక నుంచి బి.కొండల్‌, బి.రాజు, టి.హరికృష్ణ, ఎ.యాదగిరి, యు సురేందర్‌, పి.శ్రీనివాస్‌, బీరం రాములు ఉన్నారు.

మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం, మరిపెడ, దంతాలపల్లిలో సుమారు 12 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీటిలో మహబూబాబాద్‌, కేసముద్రం మండలాల్లో ఎక్కువగా జరగ్గా, డోర్నకల్‌, నెల్లికుదురు మండలాల్లో ముగ్గురు చొప్పున, దంతాలపల్లి, మరిపెడ మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో గిరిజనలు, దళితులు, యాదవులు ఉండగా, వీరందరికీ తక్కువ భూమి ఉండగా, వీరంతా సుమారు 2 నుంచి 4ఎకరాలను కౌలు చేస్తుండడం గమనార్హం. వీరిలో చాలామందికి సుమారు రూ.6 నుంచి 12 లక్షల మేర అప్పులున్నాయని కమిటీ సర్వేలో తేలింది.

ప్రభుత్వ పథకాలు అందలేదు.. రైతుబీమా అందాల్సి ఉంది..
ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు సంబంధించి బ్యాంకు, ప్రైవేటు అప్పులన్నీ అంతే ఉన్నాయి. రుణం ఇచ్చిన వాళ్లు ఇంటిచుట్టూ తిరగడంతో బాధిత కుటుంబసభ్యులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంకటగిరి గ్రామంలోని భూక్యా వెంకన్నకు రైతు బీమా అందినా.. ఆస్పత్రి ఖర్చులకే సగం అయిపోయాయి. ఇనుగుర్తి గ్రామానికి చెందిన వల్లం వెంకన్న, తారాసింగ్‌ తండాకు చెందిన రాంలాల్‌ శ్రీనులకు రైతు బీమా అందాల్సి ఉంది. వెంకన్నకు ముగ్గురు కుమార్తులు, వీరి చదువులు, పెళ్లిళ్లు ప్రశ్నార్ధకంగా మారాయని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.
తారాసింగ్‌ తండాలోని బాణోత్‌ లాల్‌ సింగ్‌, కేసముద్రం గ్రామ రైతు భూక్యా బాలు, అర్పణపల్లి జిపి కిష్టాపూర్‌ తండాకు చెందిన ఈర్యా నాయక్‌లకు ఏ మాత్రం సొంత భూమి లేకపోవడంతో రైతుబీమా వచ్చే అవకాశాలు లేవు.

ప్రభుత్వమే ఆదుకోవాలని ఎదురుచూపులు..
అర్ధాంతరంగా కుటుంబాలను విడిచిన రైతుల కుటుంబ సభ్యులకు భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారడంతో వీరంతా ప్రభుత్వం సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. వీరిలో రైతుబీమాకు నోచుకోని కుటుంబాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వీరందరికి జీవో నెంబర్‌ 194ను వర్తింపజేయాలని రైతు స్వరాజ్య వేదిక, మానవ హక్కుల వేదిక సూచించింది. కౌలు రైతులు కూడా అధికంగా ఉండడంతో ప్రభుత్వం వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరింది. కౌలు రైతులను కూడా వాస్తవ సాగుదారులుగా గుర్తించేలా ఒక చట్టాన్ని రూపొందించి, రైతులకు ఇస్తున్న సహాయాలను వారికి అందజేయాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement