Friday, April 26, 2024

Kamareddy: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. ఆగిన మరో రైతన్న గుండె!

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలో కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో ఓ రైతు మృతి చెందిన ఘటన మరవక ముందే.. తాజాగా గురువారం అదే తరహా విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో వరి కొనుగోలు కేంద్రం వద్ద  రైతు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన కుమ్మరి రాజయ్య (50) అనే రైతు గురువారం సాయంత్రం గుండె పోటుతో వరి కొనుగోలు కేంద్రం వద్ద మృతి చెందాడు. కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన వడ్ల కుప్పను ఒకదగ్గరకు చేసి, అక్కడే కుప్పకూలిపోయాడు.

తనకున్న ఎకరమున్నర పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నా రాజయ్య.. పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రెండు రోజుల క్రితమే అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొచ్చాడు. నిర్వాహకులు ధాన్యాన్ని కొనకపోవడంతో ఆరబోసిన వడ్ల కుప్పను నిన్న రాత్రి 7గంటల సమయంలో ఒక వద్దకు చేర్చసాగాడు. అంతలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చి, అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి రైతులు అతడిని కామారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. రాజయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన రైతుకు భార్య రాజవ్వ, కుమారుడు నిఖిల్, కూతురు నిఖిత ఉన్నారు. కుమారుడు నెల రోజుల ముందే గల్ఫ్ వెళ్లడంతో శుక్రవారం జరిగే తండ్రి అంత్యక్రియలకు దుబాయ్ నుండి రానున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement