Monday, April 29, 2024

త‌ప్పుడు ప్ర‌చారాల‌ను తిప్పికొట్టాలే.. రేపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో కేసీఆర్‌ భేటీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కేంద్రంపై మరోవిడత యుద్ధానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌తో రెడీ అయ్యారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ళు పూర్తికాగా, ప్రభుత్వపరంగా.. ఈ ఏడాది అత్యంత కీలకం. ఓవైపు ప్రత్యర్థులను కాచుకుంటూ.. నియోజకవర్గాల్లో పరిస్థితిని పూర్తిగా వశపరుచుకోవాలి. పెండింగ్‌ పనులు పూర్తిచేసుకోవాలి. ప్రభుత్వంపై, కేసీఆర్‌పై ఉన్న పాజిటివిటీని కాపాడుకుంటూ మరింత పెంచుకోవాలి. ఈ క్రమంలో బహుముఖ వ్యూహాలు రెడీ చేసిన అధినేత కేసీఆర్‌ రైతు కేంద్రంగానే.. కేంద్రంపై, బీజేపీపై మరింత తీవ్రంగా ధుమధుమలాడాలని, ఇక్కడి నాయకులకు అవగాహనలేదని.. కేంద్రం మోసం చేస్తోందన్న ప్రచారాన్ని విస్తృతంగా తీసుకెళ్ళాలని డిసైడయినట్లు తెలుస్తోంది.

మరోవిడత ఆందోళనలకు నేతలను, పార్టీ యంత్రాంగాన్ని సంసిద్దం చేయడంతో పాటు రానున్నరోజుల్లో పార్టీ శ్రేణులు ఎంత ధృడంగా పోరాడాలో ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కమిటీని, డీసీసీబీ అధ్యక్షు లను, రైతుబంధు అధ్యక్షులను కూడా పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వానాకాలంకు సంబంధించి ప్రతి గింజా కొంటున్నా, డబ్బులు ఎప్పటికపడు చెల్లిస్తున్నా.. విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దీనిని క్షేత్రస్థాయి పార్టీ శ్రేణులు, నాయకులు ఎప్పటికపుడు తిప్పికొట్టేలా సీఎం సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

భేటీకి ప్రాధాన్యం..
ధాన్యం కొనుగోళ్ళ అంశంలో కేంద్రం సమాధానానికి సంతృప్తి చెందని టీఆర్‌ఎస్‌ ఆందోళనలపంథా కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో త్వరలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్‌ సభ్యుల సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ యోచిస్తున్నట్లు ఆంధ్రప్రభలో ఈనెల 12న ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. శుక్రవారం సీఎం నేతృత్వంలో సమావేశం జరగనుంది. తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేసే ప్రతి అడుగూ రాష్ట్ర రాజకీయాలపై, వచ్చే అసెంబ్లిd ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పోరాడాల్సిన అంశం వివరించడంతో పాటు టీఆర్‌ఎస్‌ తప్ప మరే పార్టీకి తెలంగాణ అభివృద్ధి సోయి ఉండదని, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించలేరన్న అంశాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని చెప్పనున్నట్లు సమాచారం. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఢిల్లిలో ధర్నా నిర్వహిస్తారా? లేక నియోజకవర్గాల స్థాయిలో ఆందోళనలు చేస్తారా? ఎంపీల రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తారా? అందుకు ఇది సరైన సమయమేనా? అన్న అంశాలపై పార్టీలో చర్చోపచర్చలు జరుగుతుండగా, ఈనెల 17న తెలంగాణభవన్‌లో జరిగే సమావేశంలో వీటిపై స్పష్టత రానుంది.

కేంద్రంపై పోరులో మార్పులేదని, ఇంకా ఉధృతమవుతుందని.. పోరాటపంథాను అధినేత కేసీఆర్‌ నిర్ణయిస్తారని పార్టీవర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏంచేసినా, ఏ కార్యాచరణ తీసుకున్నా ఎంతో ముందుచూపు ఉంటుందని పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్ళ అంశంలో కేంద్రం తీరును రైతుల ముందు ఉంచగలి గామని, తర్వాత కార్యాచరణపై అధినేతే రాష్ట్ర రైతాంగానికి, పార్టీ యంత్రాంగానికి స్పష్టతనిస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement