Friday, April 26, 2024

అలర్ట్: ఫేస్‌బుక్ యూజర్లు మీ డాటా లీకైనట్లుంది..

ఫేస్ బుక్ డాటా లీక్..ఈ అంశం గత మూడేళ్లుగా యూజర్లను కలవరపెడుతోంది. ఓ మారు ఫేస్బుక్ డాటా లీక్ అవుతుందని…మరోమారు ఫేస్ బుక్కే డాటాను అమ్ముకుంటున్నారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ డేటా లీక్‌ విషయం చాలా పాతదే అయినా.. మరోసారి భారీ ఎత్తున డేటా లీక్ అయిందన్న సమాచారం మాత్రం ప్రస్తుతం ఫేస్‌బుక్‌ యూజర్లలో కలకలం రేపుతోంది. తాజాగా ఇప్పుడు మరో వార్త ఫేస్బుక్ వాడేవారని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

యూజర్ల సమాచారాన్ని, ఫోన్‌ నంబర్‌ను ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచినట్లు తెలుస్తోంది. హ్యాకర్ల కోసం ఫేస్‌బుక్‌ డేటాను ఓ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు ప్రచారం జరగుతోంది. ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వెబ్‌సైట్ల నుంచి ఈ డేటా సేకరించి ఆన్‌లైన్‌లో పెట్టినట్టు ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ ఇన్‌సైడర్ తన కథనంలో పేర్కొంది. ఫేస్ బుక్ ఖాతాలను హ్యాక్ చేసిన ఓ వ్యక్తి, తన వద్ద 50 కోట్లకు పైగా ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు ఫోన్ నంబర్లతో సహా ఉన్నాయని, వాటిని దాదాపు ఉచితంగా అందిస్తానని ప్రకటించి కలకలంలేపాడు. హడ్సన్ రాక్ కేంద్రంగా నడుస్తున్న ఇజ్రాయెల్ సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ సహ వ్యవస్థాపకుడు అలెన్ గాల్ వెల్లడించిన వివరాల మేరకు, ఈ లీకర్ చూపిన డేటాబేస్, జనవరి నుంచి హ్యాకర్ సర్కిల్స్ లో ఫేస్ బుక్ కు లింక్ అయిన టెలిఫోన్ నంబర్లవేనని, ఈ వివరాలను తొలుత టెక్నాలజీ పబ్లికేషన్ సంస్థ మదర్ బోర్డ్ ప్రకటించిందని అన్నారు. కాగా, 106 దేశాల్లో ఫేస్‌బుక్ వాడుతున్నవారి ఫోన్ నెంబర్లు, ఫేస్‌బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, లొకేషన్, పుట్టిన తేదీ, ఇమెయిల్ అడ్రస్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయని చెప్పుకొచ్చింది. ఫేస్‌బుక్‌ డేటా లీక్‌తో సుమారు 1.1 కోట్ల యూజర్లు ప్రభావితమయ్యారని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement