Sunday, April 28, 2024

Exclusive – రిపేర్ల ధ‌ర‌ణి! మధ్యంతర రిపోర్ట్ రెడీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో :ధరణి పోర్టల్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వివిధ వర్గాల స్ప్రదింపులతో పాటు వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసిన కమిటీ సభ్యులు ఇప్పటికే 35 మాడ్యూల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. తాజాగా మరోసారి సమావేశమైన క‌మిటీ మధ్యంతర నివేదికకు తుదిరూపు ఇచ్చింది. ధరణి చట్టం సవరణ చేయాల్సిందిగా ఈ నివేదిక ద్వారా సిఫారసు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలిపి వివాదంలో 18.60 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ధరణి వివాదంలో చిక్కుకున్నాయి.

అయితే.. కోర్టుకెక్కని భూ వివాదాల్లో ఉన్న లోటుపాట్లు, పొరపాట్లు జిల్లా స్థాయిలోనే పరిష్కారం చేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించనుంది. క‌లెక్ట‌ర్ల‌కు విస్తృత అధికారాలు..19.80 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌ ఉన్నాయి. అందుకోసం కలెక్టర్లకు విస్తృత అధికారాలు ఇవ్వాలని కమిటీ ప్రభుత్వానికి అందజేసే మధ్యంతర నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. గత పక్షం రోజులుగా అనేక కోణాల్లో కమిటీ అధ్యయనం చేసి అన్ని అంశాలను క్రోడీకరించి నివేదికను రూపొందించింది. ఐదు సార్లు ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించింది.

సమస్యలు అధికంగా, చిక్కుముడిగా ఉన్న పలువురు జిల్లా కలెక్టర్లతోనూ ప్రత్యేకంగా సమావేశమై పూర్వాపరాలను తెలుసుకుంది. రాష్ట్ర స్థాయిలో కసరత్తు పూర్తికావడంతో తదుపరి విచారణ క్షేత్రస్థాయిలో చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని కమిటీ సభ్యుడు కోదండరెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్‌ ద్వారా ఉత్పన్నమైన సమస్యలపై అధ్యయనం చేస్తున్న ధరణి కమిటీ- త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డికి మధ్యంతర నివేదిక ఇవ్వనున్నట్లు- ఆయన వెల్లడించారు.

ఏ అంశాన్నీ వదిలిపెట్టకుండా అధ్యయనంధరణి పోర్టల్‌ పునర్నిర్మాణం కోసం ఏర్పాటైన కమిటీ తమ పరిశీలనను వేగవంతం చేసింది. ఇప్పటికే భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయంతోపాటు పోర్టల్‌ నిర్వహణ కంపెనీ ప్రతినిధులు, ఐదు జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు జరిపిన కమిటీ.. సర్వే సెటిల్‌మెంట్‌, దేవాదాయశాఖ, వక్ఫ్‌ బోర్డులకు చెందిన ఉన్నతాధికారులతో భేటీ అయింది. ఆయా విభాగాల పరిధిలో ధరణి పోర్టల్‌ ద్వారా ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి మార్గాలు, ప్రత్యామ్నాయాలపై చర్చించింది. సోమవారం సచివాలయంలో స్టాంపులు రిజిస్ట్రేష్రన్ల శాఖతో సమావేశం కావాలని, ఆ తర్వాత జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలోని మూడు జిల్లాలను కమిటీ- ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.

రంగారెడ్డి, నిజామాబాద్‌తో పాటు ఆదిలాబాద్‌ లేదా ఖమ్మంలో ‘ధరణి’ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్టు తెలిసింది. ఈ పర్యటనలు పూర్తయ్యాక అన్ని అంశాలను క్రోడీకరించి, ధరణి పోర్టల్‌ వాస్తవ పరిస్థితిని తెలియజేస్తూ.. ప్రభుత్వానికి నివేదిక అందించాలని కమిటీ భావిస్తోంది.పోర్టల్‌ వ్యవస్థీకృత మార్పులపై ఆరా..సర్వే విభాగానికి సంబంధించి రికార్డుల జాబితా, ఖాస్రా, సెస్లా పహాణీల నిర్వహణ, ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయడం, భూ భారతి ప్రాజెక్టులో భాగంగా రూపొందించిన సర్వే పటాల ప్రస్తుత స్థితి, ధరణి పోర్టల్‌ సమాచారానికి, పటాలకు మధ్య వ్యత్యాసం తదితర అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు.

- Advertisement -

అదేవిధంగా తమ భూమిని సబ్‌డివిజన్‌ చేయాలని రైతులు దరఖాస్తు చేసుకుంటే.. అందుకు అవలంబిస్తున్న పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక వక్ఫ్‌ బోర్డు అధికారులతో చర్చల్లో భాగంగా.. మొత్తం వక్ఫ్‌ బోర్డు కింద ఉన్న భూవిస్తీర్ణం ఎంత? అందులో ఎంత కబ్జాకు గురైంది? వక్ఫ్‌ భూముల రక్షణ కోసం తీసుకుంటు-న్న చర్యలు, ధరణి పోర్టల్‌లో ఈ భూముల విషయంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న మొత్తం భూవిస్తీర్ణం, ఈ భూముల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, ధరణి పోర్టల్‌లో సమస్యలపై చర్చించి అన్ని అంశాలను మధ్యంతర నివేదికలో పొందుపరిచారు.రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌లోనే అనేక వివాదాలుధరణి పోర్టల్‌లో ఆటోమెటిక్‌ రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌తో అనేక వివాదాలు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రభుత్వం పరిహారమిచ్చి నేషనల్‌, స్టేట్‌ హైవేస్‌.. ఔటర్‌ రింగ్‌ రోడ్డుల కోసం సేకరించిన భూములకూ.. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా కొత్త పాస్‌ బుక్కులు జారీ అయ్యాయి. అయితే.. పొషెషన్‌లో లేకపోయినా రికార్డుల్లో భూమి ఉంటుండడంతో కొత్త సమస్యలు పుట్టు కొస్తున్నాయి. అక్రమార్కులు.. ఆ సర్వే నంబరులో ఏదో మూలన భూమిని చూపించి మరొకరికి అమ్మేస్తున్నారు. ఆ కొన్న వారు ఆ భూమి తమదంటూ ఇతరులతో గొడవకు దిగుతున్నారు. దీంతో పొషెషన్‌ లో ఉన్న రైతులు కేసుల పాలవుతున్నారు. ఇలాంటి ఘటనలు రంగారెడ్డి, మేడ్చల్‌లో అధికంగా ఉన్నట్లు కమిటీ గుర్తించింది. అర్బ‌న్‌, రూర‌ల్ తేడాలేకుండా స‌మ‌స్య‌..భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత పార్ట్‌ ఏ, పార్ట్‌ బి అంటూ అనేక చిక్కుముళ్లు వేశారు.

ఇక పీఓబీ సంబంధిత అంశాలు లక్షల్లోనే ఉన్నాయి. ప్రతి ఊరిలోనూ ఆర్‌ఎస్‌ఆర్‌ వ్యత్యాసాలు, తారతమ్యాలు (సేత్వార్‌ కంటే అదనం) ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో రెవెన్యూ విలేజ్‌ లో 10 నుంచి 20 శాతం విస్తీర్ణం పెరిగింది. గతంలో రైతులు భూమి అమ్మేసినా రికార్డుల్లో అలాగే కొనసాగించడం మూలానా తిరిగి సేల్‌ డీడ్స్‌ చేశారు. అసలు భూమి లేకుండా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో వారంతా పొషెషన్‌ కోసం అదే సర్వే నంబరులోని రైతులతో గొడవ పడుతున్నారు. అర్బన్‌, రూరల్‌ అన్న తేడా లేకుండా అన్ని చోట్లా ఈ సమస్య ఉత్పన్నమైంది. వాస్తవం కంటే లక్షలాది ఎకరాల విస్తీర్ణం పెరిగిందని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ కమిటీ సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement