Thursday, May 16, 2024

కేంద్రంపై టీఆర్‌ఎస్ పోరు ఉద్ధృతం.. నవోదయ విద్యాలయాల కోసం ఎంపీల ఆందోళ‌న‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్ర‌భుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్ర ద్వంద‌, తెలంగాణ వ్య‌తిరేక వైఖ‌రిపై ఢిల్లీ వేదికంగా పోరును ఉద్ధృతం చేశారు. తెలంగాణాలో జిల్లాకో న‌వోద‌య విద్యాలయాన్ని కేటాయించాలని శుక్రవారం లోక్‌సభ ప్రారంభం కాగానే కేటాయించాల‌ని టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ లోక్‌స‌భా ప‌క్ష నేత, ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌రరావు నేతృత్వంలో స్పీక‌ర్ ఓంబిర్లాకు వాయిదా తీర్మానం ఇచ్చారు. సాధార‌ణంగా జిల్లాకు ఒక న‌వోద‌య ఇవ్వాల్సి ఉన్న‌ప్ప‌టికీ, బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాలు జిల్లాకు ఒక‌టి కంటే ఎక్కువ కేటాయించార‌ని వివ‌రించారు. తెలంగాణకు మాత్రం జిల్లాకి ఒక‌టి కూడా ఇవ్వ‌లేద‌ని పేర్కొన్నారు. ఈ అంశంపై న్యాయం జ‌రిగేందుకు స‌భ‌లో చ‌ర్చ‌కు అవకాశమివ్వాలని స్పీకర్‌ను కోరారు. వారి విజ్ఞ‌ప్తిని స్పీక‌ర్ ఓంబిర్లా తిర‌స్క‌రించ‌డంతో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్య‌క్తం చేశారు. అనంత‌రం స‌భ నుంచి బ‌య‌టికి వ‌చ్చి పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వద్ద ప్లకార్డులు పట్టుకుని ఆందోళ‌న చేప‌ట్టారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ‌పై ఇంత వివక్ష పనికిరాదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర సమస్యలపై పోరాటం
సీఎం కేసీఆర్‌, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం మేరకు రెండవ విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు రైతులు, నిరుద్యోగం, ఎస్టీ రిజర్వేషన్స్, విభజన హామీలు, రాష్ట్రానికి నిధులు తదితర అంశాలపైన ప్రతిరోజు పార్లమెంట్ లోప‌ల‌, బయట గళమెత్తుతున్నారు. గత ఎనిమిదేళ్లలో దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 7 ఐఐఎం లు, 7 ఐఐటీ, 2 ఐఐఎస్ఇఆర్, 16 ఐఐఐటీలు, 4 ఎన్ఐడీలు 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేశార‌ని, తెలంగాణకు ఒక్క నవోదయ విద్యాలయం కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement