Friday, April 26, 2024

బీజేపీలో చేరిన ఈటల..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకున్నారు. కొద్ది రోజులు క్రితం ఈటల ఢిల్లీ వచ్చినప్పుడు నడ్డా సహా పలువురు నేతలను ఈటల కలిశారు. జూన్ 14న నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతానని అప్పడే ఈటల ప్రకటించారు. మంచి ముహూర్తం కోసం వేయిట్ చేశారు. సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన ఈటల తొలుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అనంతరం కేంద్ర మంత్రులు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు.

భూ కబ్జా ఆరోపణలపై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తరువాత ఈటల వ్యవహారం రోజుకో మలుపు తిరిగింది. ఈటల సొంతంగా పార్టీ పెడతారని.. లేదంటే బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈటల తన సన్నిహితులతో భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని.. రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈటల బీజేపీ గూటికి చేరారు. ఈ క్రమంలోనే ఆయన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనపై కావాలనే కక్ష్య కట్టి కేసీఆర్‌ పార్టీ నుంచి బయటకు పంపారని ఈటల ఆరోపించారు.

రెండు రోజుల క్రితం ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దానిని వెంటనే స్పీకర్ పోచారం ఆమోదించారు. దీంతో త్వరలో హుజురాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికల జరగనుంది. ఈసారి బీజేపీ అభ్యర్థిగా ఈటల బరిలో దిగబోతున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ నడిచింది. బీజేపీకి నోటా కంటే తక్కువగా ఓట్లు వచ్చాయి. అయితే, ఈ సారి బీజేపీ అభ్యర్థిగా ఈటల రంగంలో దిగబోతున్నారు. గతంలో గులాబీ ఫోటోతో ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఈటల.. ఈసారి కాషాయ బొమ్మపై బరిలో దిగి విజయం సాధిస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.

మరోవైపు టీఆర్ఎస్ పార్టీ ఇంకా తమ అభ్యర్థిని ఫిక్స్ చేయలేదు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నేతలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి హుజురాబాద్ ఉప ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. ఇదే విషయంపై మరోసారి చర్చించి.. అభ్యర్థిని ఖరారు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ పార్టీ తరుపున కౌశిక్ రెడ్డి బరిలో దిగే ఛాన్స్ ఉంది. అయితే, ఆయన ఇటీవల మంత్రి కేటీఆర్ తో రహస్యంగా భేటీ కావడం రాజకీయంగా సంచలనమైంది. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా ? లేదా అన్నది కూడా సస్పెన్స్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement