Friday, April 26, 2024

Telangana | హైదరాబాద్ లో అత్యాధునిక ఫార్మా క్యాంపస్ .. ఏర్పాటు చేయునున్న యూరోఫిన్స్

ఫార్మా రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు హైదరాబాద్ లో తమ విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలతో కూడిన ప్రయోగశాలను ( ల్యాబ్ ) హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటుచేస్తున్నట్టు యూరోఫిన్స్ ప్రకటించింది. ఆహారం, పర్యావరణం, ఫార్మాస్యూటికల్, కాస్మెటిక్ ఉత్పత్తుల పరీక్షలో, బయో అనలిటికల్ టెస్టింగ్ లో ఫ్రాన్స్ కు చెందిన యూరోఫిన్స్ గ్లోబల్ లీడర్ గా ఉంది. హైదరాబాద్ లో ప్రారంభించే అధునాతన టెస్టింగ్ ల్యాబ్ తో భారతీయ ఔషధ మార్కెట్ లో ఈ సంస్థ విస్తరించబోతుంది.

దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావుతో సమావేశమైన యూరోఫిన్స్ ప్రతినిధి బృందం తమ విస్తరణ ప్రణాళికలను చర్చించింది. 90,000 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ అత్యాధునిక ప్రయోగశాలలో సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎనలిటికల్ R&D, బయోఅనలిటికల్ సర్వీసెస్, ఇన్-వివో ఫార్మకాలజీ, సేఫ్టీ టాక్సికాలజీ రంగాలకు చెందిన అంతర్జాతీ స్థాయి దేశ,విదేశ ఫార్మాస్యూటికల్ కంపెనీలతో పాటు చిన్న బయోటెక్ కంపెనీలకు అవసరమైన సేవలు అందుతాయి. 

తన అనుబంధ సంస్థ యూరోఫిన్స్ అడ్వినస్ ద్వారా హైదరాబాద్ లో ప్రయోగశాలను యూరోఫిన్స్ ఏర్పాటుచేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో యూరోఫిన్స్ కొనసాగిస్తున్న కార్యకలాపాలతో పాటు డిస్కవరీ కెమిస్ట్రీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ, బయోఅనలిటికల్ సర్వీస్‌లను ఈ ల్యాబ్ ద్వారా మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఫార్ములేషన్ డెవలప్‌మెంట్‌తో పాటు ఇన్-విట్రో,ఇన్-వివో బయాలజీ విభాగాల్లో తన సేవలను విస్తరించేందుకు 2023 వ సంవత్సరం ప్రారంభం నుంచే యూరోఫిన్స్ అడ్వినస్ కు  ఈ ల్యాబ్ తో అవకాశం కలుగుతుంది. 

ఔషధాల తయారీ, పరిశోధనలకు ఆసియాలో ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ పరిగణించబడుతోంది. లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధన, తయారీ, క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్యకలాపాల కోసం భారతదేశంలో మొదటిసారిగా జీనోమ్ వ్యాలీలో  ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ప్రత్యేక ఆర్థిక మండళ్ల రూపంలో పారిశ్రామిక / నాలెడ్జ్ పార్కులు ఏర్పాటయ్యాయి. దాదాపు 15,000 మంది నిపుణులతో 200 కంటే ఎక్కువ కంపెనీలు జీనోమ్ వ్యాలీలో దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు తమ సేవలను అందిస్తున్నాయి. ఔషధాల పరిశోధన, తయారీలో ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ స్థానాన్ని యూరోఫిన్స్ అడ్వినస్ తాజా పెట్టుబడి మరింత బలోపేతం చేసింది.

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించడం తో పాటు లేబోరేటరీ నెట్ వర్క్ ను  మరింత సుస్థిరం చేసుకునే దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికలు తమ దగ్గర ఉన్నాయన్నారు యూరోఫిన్స్ సీఈఓ డాక్టర్ గిల్లెస్ మార్టిన్. ఔషధాల పరిశోధన, తయారీలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఉన్న ప్రాధాన్యత తమ దృష్టిలో ఉందన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే కొత్త క్యాంపస్ తో ఔషధాల అభివృద్ధి, ఆవిష్కరణల్లో హైదరాబాద్ కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు మార్టిన్. 

హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో యూరోఫిన్స్ ప్రవేశిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. తమ విస్తరణ-వృద్ధి ప్రణాళికల కోసం హైదరాబాద్ ను ప్రధాన కేంద్రంగా యూరోఫిన్స్ పరిగణిస్తున్నందుకు తనకు చాలా గర్వంగా ఉందన్నారు. తాజా పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలోని గ్లోబల్ కంపెనీల జాబితాలో చేరిన యూరోఫిన్స్ కు  తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందన్నారు.  ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తో పాటు తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement