Sunday, April 28, 2024

Big Story | ఉపాధినిస్తున్న తెలంగాణ.. పొరుగు రాష్ట్రాల నుంచి వ్యవసాయ కూలీల రాక!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఓడలు బండ్లు కావడం, బండ్లు ఓడలు కావడం అన్న సామెత ఇప్పుడు తెలంగాణ వ్యవసాయరంగం సాధించిన ప్రగతి కి సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గడిచిన తొమ్మిదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముఖ్యంగా సాగునీటిరంగంలో స్వయం సమృద్ధిని సాధించింది. సమైఖ్యరాష్ట్రంలో సాగునీటిరంగంలో జరిగిన వివక్షను అధిగమించి నేడు తెలంగాణ స్వయం సమృద్ధిని సాధించింది. నాడు బీడువారిన భూములు నేడు పుష్కలమైన సాగునీటి లభ్యతతో బంగారు పంటలకు నెలవయ్యాయి. ఒకప్పుడు సాగునీటికి కటకటతో వ్యవసాయాన్ని వదిలి ఇతర రాష్ట్రాలకు వలసపోయిన తెలంగాణ రైతులు ఇప్పుడు పొరుగున ఉన్న ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను తీసుకొచ్చి మరీ వరినాట్లు వేయిస్తున్నారు.

సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం తెలంగాణలో ఖరీఫ్‌ వరినాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఖమ్మం, నల్గొండ,‘సిద్ధిపేట, వరంగల్‌ తదితర జిల్లాలో నాట్లు వేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి పెద్ద సంఖ్యలో కూలీలు తెలంగాణకు వస్తున్నారు. వలస కూలీలు బ్యాచ్‌లుగా విడిపోయి ఎకరానికి రూ.4500 తీసుకుని నాటు వేస్తున్నారు. మహిళా కూలీలు నాటు వేస్తుంటే పురుషులు నారు పీకి అందిస్తూ త్వరగా నాట్లను పూర్తి చేస్తున్నారు.

ఆంధ్రాలో నాట్లు వేసే పనిచేస్తే రోజుకు రూ.300దాకానే వస్తున్నాయని, అదే తెలంగాణ ప్రాంతానికి వచ్చి జట్టుగా ఏర్పడి ఎకరా చొప్పున గుత్త తీసుకుని నాటు వేస్తే రోజుకు రూ.500 రూ. 800దాకా వస్తున్నాయని ఏపీ నుంచి వచ్చిన కూలీలు చెబుతున్నారు. తమ సొంత రాష్ట్రంలో రోజంతా పనిచేసినా రూ.200 కూలీ దొరకదని, తెలంగాణలో రోజుకు రూ.1,000 వరకు సంపాదిస్తున్నామని ఖమ్మం, నల్గొండ జిల్లాల సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో ప్రస్తుత వానకాలం సీజన్‌లో ఏ ఊరిలో చూసినా ఏపీతోపాటు ఉత్తరాది రాష్ట్రాల కూలీలే నాట్లు- వేస్తూ కనిపిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకే దాదాపు 30 వేల మంది వలస వస్తున్నట్టు- ఓ అంచనా. స్థానిక కూలీల కంటే తక్కువ కూలీకే వలస కూలీలు పనికి వస్తుండటంతో తెలంగాణ రైతులు కూడా వలస కూలీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లోని పొలాల్లో పెద్ద సంఖ్యలో వలస కూలీలు నాట్లు వేస్తూ కనిపిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 70శాతం రైతులు వరినాట్లు వేసే పనుల్లో తీరికలేకుండా ఉన్నారు. రౖైెతులంతా ఒకేసారి వరినాట్లకు సిద్దమవడంతో కూలీల కొరత ఏర్పడింది. కూలీలకు డిమాండ్‌ ఏర్పడడంతో కూలీరేట్లు కూడా పెరిగాయి. ఈ తరుణంలో బీహార్‌, హర్యాణా , ఉత్తర ప్రదేశ్‌తోపాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన కూలీలు రైతులకు కూలీల కొరతను దూరం చేస్తున్నారు. దీంతో రైతులు అనుకున్న సమయానికి అదనులో వరి నాట్లు పూర్తి చేస్తున్నారు. రైతులు తమ గ్రామంలోని కూలీలతో పంటలు వేసుకోవాలంటే చాలా రోజులు పడుతోందని, వర్షాల వల్ల వచ్చి నీరు ఆలస్యం చేస్తే ఇంకిపోయి నాటుకు కష్టమవుతుందని రైతులు చెబుతున్నారు. ఈపరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యవసాయ కూలీలు తమకు ఎంతో మేలు చేస్తున్నారని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

తెలంగాణలోని వ్యవసాయ కూలీల కంటే వలస కూలీలు నాటుకు డబ్బులను కూడా తక్కువగానే తీసుకుంటున్నారని, స్థానిక కూలీలకంటే అదనపు పనిగంటలు పనిచేస్తూ సకాలంలో వరిపొలాల్లో నాట్లు పడేలా చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. స్థానిక కూలీలకైతే ఎకరా నాటుకు రూ.5నుంచి రూ.6వేలు చెల్లించాల్సి వస్తుండగా వలస కూలీలు ఎకరాకు నాలుగు వేలు తీసుకుని నాటు పూర్తి చేస్తున్నారని చెబుతున్నారు. వలస కూలీలు ఒక గ్రూప్‌లో 20 మంది ఉంటారు.

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల పాటు- విరామం లేకుండా వరి నాట్లు- వేస్తున్నారు. దీంతో రోజు ఏడు ఎకరాల వరకు వరి నాటు- వేయడంతో నెల రోజుల్లో గ్రామాల్లో నాట్లు- పూర్తి ఆవుతున్నాయి. పైగా రైతులకు శ్రమ లేకుండా వారే వరి నారు చేనుపై వేసుకుంటారు. రైతు పోలం దమ్ము కొట్టించి బురద మందు చల్లుకుని కూర్చుంటే చాలు వారే వరి నాటు- వేసి వెళ్తారు. దీంతో రైతులకు ఎలాంటి కష్టం లేకుండా పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement