Friday, May 3, 2024

విద్యుత్‌ చార్జీల పెంపు తప్పదు.. డిస్కంల లోటుభర్తీకి పెంపు అనివార్యం: రఘుమారెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : విద్యుత్‌ పంపిణి ( డిస్కంలు) సంస్థలు నివేదించిన చార్జీల పెంపు ప్రతిపాదనలపై విద్యుత్‌ నియంత్రణ (ఈఆర్‌సీ) మండలి శుక్రవారం రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ భవనంలో శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 6,831 కోట్ల విద్యుత్‌ చార్జీల పెంపునకు డిస్కంలు ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. డిస్కంల ప్రతిపాదనలపై ఇప్పటికే సిరిసిల్ల, హన్మకొండ, వనపర్తిలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా.. శుక్రవారం హైదరాబాద్‌లో ఫైనల్‌గా ప్రజల నుంచి సలహాలు , సూచనలు స్వీకరించింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో కాంగ్రెస్‌ పార్టీతో పాటు వివిధ వ్యాపార వర్గాలు, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొని విద్యుత్‌ చార్జీల పెంపును వ్యతిరేకించారు. ఒక యూనిట్‌కు ఒక రూపాయి చార్జీ పెంపుతో వ్యాపారాలు, కంపెనీలపై తీవ్ర భారం పడుతోందని, తద్వారా మరింత నష్టాలను చవిచూడాల్సి పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. గృహ వినియోగంపైన కూడా 50 పైసలు పెంపుతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని, ఏడేళ్ల చార్జీలు ఒకేసారి పెంచడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది.

కాగా విద్యుత్‌ చార్జీల పెంపు తప్పదని విద్యుత్‌ పంపిణీ ( డిస్కంలు) సంస్థలు శుక్రవారం ఈఆర్‌సీ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మరోసారి స్పష్టం చేశాయి. చార్జీల పెంపును ప్రజలందరూ సహృదయంతో ఆర్థం చేసుకోవాలని టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. డిస్కంలకు వస్తున్న నష్టాలను ఆయన వివరించారు. గృహ అవసరాలకు కూడా చార్జీల పెంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్‌సీకి సమర్పించే ముందు ఇతర రాష్ట్రాల్లోని చార్జీలను పోల్చి చూశామన్నారు. గృహ అవసరాలకు యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్య వినియోగాదారులపై యూనిట్‌కు ఒక్క రూపాయి పెంచాలని ఈఆర్‌సీకి ప్రతిపాదనలు ఇచ్చామని రఘుమారెడ్డి వెల్లడించారు.

ట్రాన్స్ కోకు రూ. 9,128.57 కోట్ల లోటు..
ట్రాన్స్ కోకు కూడా రూ. 9,128.57 కోట్ల లోటు ఉందని ఈఆర్‌సికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. చార్జీల పెంపు తర్వాత కూడా ఆ లోటు ఇంకా రూ. 2,686.97 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. విద్యుత్‌ సరఫరాలో భాగంగా పెరుగుతున్న ఖర్చులు, నిర్వహణకు చార్జీలు పెంచక తప్పదని ట్రాన్స్‌కో స్పష్టం చేసింది. చార్జీలు పెంచితే రూ. 5,044.27 కోట్ల వరకు సమకూరుతుందని ట్రాన్స్‌కో పేర్కొన్నది. 2022-23 సంవత్సరానికి సంబంధించిన అంచనాలను వెల్లడించింది. విద్యుత్‌ సరఫరా ద్వారా మొత్తం రెవిన్యూ రూ. 34,870.18 కోట్లు కాగా విద్యుత్‌ చార్జీల ద్వారా రూ. 25,421.76 కోట్ల ఆదాయం సమకూరుతుందని ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఇతరాత్ర రాబడిని కలుపుకుంటే వచ్చే రెవిన్యూ రూ. 25,741.79 కోట్లు అని, ప్రభుత్వం అందించే సబ్సిడీ కింద రూ. 1397.50 కోట్ల రాబడి వస్తుందని ట్రాన్స్‌కో ఇచ్చిన నివేదికలో పొందుపర్చింది. చార్జీల పెంపు తర్వాత కూడా రూ. 2,686.86.79 కోట్ల లోటు ఉంటుందని ట్రాన్స్‌కో అంచనా వేసింది.

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త చార్జీలు..
బహిరంగ విచారణలో వచ్చిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈఆర్‌సీ పరిశీలించాక చార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకోనుంది. టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో సిరిసిల్ల, హన్మకొండ, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని వనపర్తిలో ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా.. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తాయి. అయితే వీటన్నింటిని పరిశీలన చేశాక మార్చి చివరి వారంలో చార్జీల పెంపుపై ఈఆర్‌సీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 1 నుంచి పెంచిన విద్యుత్‌ చార్జీలు అమల్లోకి రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement