Monday, May 6, 2024

కరోనా సెకండ్ వేవ్‌ కు ఈసీనే కారణం: మద్రాస్ హైకోర్టు

తమిళనాడులో కోవిడ్-19  సెకండ్ వేవ్ ఈ స్థాయిలో పెరగడానికి ఏకైక కారణం ఎన్నికల సంఘమేనని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం అధికారులపై హత్యా నేరం కింద కేసులు పెట్టాలని పేర్కొంది. దేశంలో కోవిడ్-19 ఉపద్రవం ముంచుకొస్తున్న సమయంలో రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతి ఇవ్వడం ఏంటని ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారం సందర్భంగా కోవిడ్ నిబంధనలను అమలుపరచడంలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చాలామంది ఫేస్ మాస్క్‌ లు ధరించలేదని, శానిటైజర్లు వినియోగించలేదని.. భౌతిక దూరం పాటించలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం రాజ్యాంగ సంస్థల కర్తవ్యమని, పౌరులు బతికుంటేనే వాళ్లు తమకు రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్ల ప్రయోజనం పొందగలుగుతారని చీఫ్ జస్టిస్ గుర్తు చేశారు. పౌరులను బతికించుకోవడం, కాపాడుకోవడమే ప్రస్తుత పరిస్థితుల్లో ముందున్న కర్తవ్యమని.. ఏదైనా ఆ తర్వాతేనని చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ స్పష్టం చేశారు.

మే 2న జరిగే కౌంటింగ్ కు సంబంధించి హెల్త్ సెక్రటరీతో చర్చించి తగిన యాక్షన్ ప్లాన్‌ ను సిద్ధం చేయాలని.. కోవిడ్-19 ప్రొటోకాల్‌ ను తప్పనిసరిగా పాటించాలని తమిళనాడు ఎన్నికల సంఘానికి మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందో బ్లూప్రింట్‌ ను కోర్టుకు సమర్పించాలని.. లేని పక్షంలో ఎన్నికల కౌంటింగ్ నిలిపి వేసేలా ఆదేశాలు ఇచ్చేందుకు కూడా కోర్టు వెనకాడదని మద్రాస్ హైకోర్టు ఈసీని హెచ్చరించింది.

కాగా, తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నాయకులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా రాహుల్ గాంధీ బీజేపీ నేతలంతా తమిళనాడు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలు తమిళనాడులో కోవిడ్-19 తీవ్రత పెరగడానికి కారణమయ్యాయనే వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు తమిళనాడులో ఆదివారం కొత్తగా 15,659 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement