Wednesday, May 1, 2024

వివాదాస్పద మెట్రో ప్రాజెక్టుపై ఏక్​నాథ్ ఫోకస్.. ఆరే కాలనీ పనులపై ఆదేశాలు..​

2019లో ఫడ్నవీస్ ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా మారి ఆందోళనకు కారణమైన ఆరే కాలనీలో మెట్రో షెడ్​నిర్మాణంపై ఏక్​నాథ్​ ప్రభుత్వం ఫోకస్​ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రదేశంలో మెట్రో షెడ్​ నిర్మాణానికి కావాల్సిన అనుమతుల కోసం కోర్టులో తగిన ఆధారాలు సమర్పించాలని అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోనిని షిండే ఆదేశించినట్లు తెలిసింది. ఇంతకుముందు ముంబైలో భారీ నిరసనలకు దారితీసిన ఈ సమస్య 2019 నాటిది. ఆరే కాలనీలో చెట్లను నరికివేయడానికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)ని, ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ అనుమతిని కోరింది.

ముంబైలో గ్రీన్​ లంగ్​గా పిలుచుకునే ఈ ఏరియాలో చెట్లను తొలగించడంపై పెద్ద ఎత్తున ఆందోళనలు తలెత్తడంతో అప్పట్లో ఫడ్నవీస్​ ప్రభుత్వం ముందుకు సాగలేదు. ఈ ప్రాజెక్ట్ కి BMC ఆమోదం తెలిపిన వెంటనే నిరసనలు ప్రారంభమయ్యాయి. పర్యావరణ కార్యకర్తలు తమ ఆందోళనను ఉధృతం చేయడంతో అప్పటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మెట్రో కార్​ షెడ్​​ కోసం గుర్తించిన ప్రాంతం జీవవైవిధ్యం, అటవీ భూమి పరిధిలో లేదు.. అయినా చెట్లు నరకడం వల్ల కాలుష్యం అవుతుందని పర్యావరణ ప్రేమికులు అడ్డుకున్నారు.  

ఆ సంవత్సరం చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత శివసేన దీర్ఘకాల మిత్రపక్షమైన బీజేపీతో విడిపోయింది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పడింది. పర్యావరణ కార్యకర్తల నిరసనలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా వచ్చిన ప్రభుత్వం మెట్రో కార్ షెడ్‌ను కంజుర్‌మార్గ్ కు మార్చాలని నిర్ణయించింది. ఆ తర్వాత కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం 2020లో బాంబే హైకోర్టుకు వెళ్లింది. ఈ భూమి తమ ఉప్పు శాఖకు చెందినదని పేర్కొంది. దీంతో హైకోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి ఆ ప్రాజెక్టు పనులు అటకెక్కాయి.

ఆరేలో షెడ్డు నిర్మించాలన్న యోచనను తాము బీజేపీ కూటమి భాగస్వాములుగా ఉన్నప్పుడు కూడా శివసేన వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ను మారుస్తూ శివసేన చేసిన ఆలోచనలపై బీజేపీ విమర్శలకు ఉద్ధవ్​ థాకరే గట్టిగానే సమాధానమిచ్చారు. హడావుడిగా చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు వృథాకు దారితీస్తాయని, నిజమైన అభివృద్ధి కాదని సీరియస్​ కామెంట్స్​ చేశారు. కానీ, ఇప్పుడు అదే ప్రాజెక్టుని మళ్లీ తెరపైకి తీసుకువస్తుండడంపై ముంబై ప్రజలు ఆలోచన చేస్తున్నారు. పర్యావరణానికి హాని చేసే ఈ నిర్ణయం వద్దని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement