Sunday, May 5, 2024

తెలంగాణలో విద్యాయజ్ఞం.. మన ఊరు – మన బడితో శ్రీకారం: మంత్రి సబితాఇంద్రారెడ్డి

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో విద్యా యజ్ఞం మొదలైందని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేశామని, కేజీ టూ పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్య అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ‘మన ఊరు మన బడి… మన బస్తీ మన బడి’ పథకంపై సభ్యులు రవిశంకర్‌ సుంకె, మర్రి జనార్థన్‌రెడ్డి, బాపూరావు రాథోడ్‌, జైపాల్‌ యాదవ్‌, వివేకానంద, జాఫర్‌ హుస్సేన్‌ తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

12 అంశాలతో, 3ఏండ్లలో పథకం పూర్తి..

ఈ సందర్భంగా సబితా మాట్లాడుతూ.. కార్యక్రమం క్రింద 12 అంశాలను చేపట్టామని నీటి సరఫరా, టాయిలెట్లు, విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులూ సిబ్బందికి ఫర్నిచర్‌, పాఠశాల అంతటికి పెయింటింగ్‌, పెద్ద చిన్న తరహా మరమ్మతులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ప్రహారీ గోడలు, వంటశాల షెడ్లు, శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల స్థానే కొత్త తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాళ్లు, వాటిల్లోనే డిజిటల్‌ తరగతి గదులను ఏర్పాటు చేసేందుకు కేబినేట్‌ సబ్‌కమిటీ కూడా ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం ద్వారా మూడు దశల్లో స్కూళ్లను ఆధునీకరించనున్నామని, ఇందుకోసం మొత్తం రూ.7289.54కోట్ల బడ్జెట్‌తో 26,065 పాఠశాలల్లో చేపట్టనున్నట్టు తెలిపారు. మొదటి దశలో రూ.3497.62 కోట్ల అంచనా బడ్జెట్‌తో 9,123 స్కూళ్లను తీసుకున్నామన్నారు. మొదటి దశలోనే 60 శాతం విద్యార్థులు కవర్‌ అవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌, జిల్లా మంత్రి ఆధ్వర్యంలో 8 పనులు లోకల్‌గానే పూర్తవనున్నట్టు తెలిపారు. కాగా ఇందులో పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేయాలన్నారు. మొదటి దశలో ఏవైనా అత్యవసరంగా బాగు చేయాల్సిన స్కూళ్లు ఉంటే ప్రతిపాదనలు పెట్టాలని శాసనసభ్యులను కోరారు.

రూ.కోటి విరాళమిస్తే..స్కూల్‌కు దాత పేరు నామకరణం..

ఈ పథకంలో ప్రభుత్వంతో పాటు దాతలను కూడా భాగస్వామ్యం చేస్తున్నామని ఇప్పటికే ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి తను చదివిన స్కూలుకు రూ. 3.5 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఎన్‌ఆర్‌ఐలతో కేటీఆర్‌ సమావేశం పెట్టారని, వారు భాగస్వామ్యం అవుతామని తెలిపారు. ఎవరైనా దాతలు రూ.2లక్షలు ఖర్చు చేస్తే విద్యా కమిటీలో శాశ్వత సభ్యుడిగా ఉంచుతామన్నారు. స్కూలు గదికి రూ. 10 లక్షలు ఖర్చుచేస్తే వారి పేరు పెడతామని, ప్రాథమిక పాఠశాలకు రూ.25 లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ. 50 లక్షలు, ఉన్నత పాఠశాలకు కోటి రూపాయలు ఖర్చు చేస్తే దాతల పేర్లు పెట్టేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.

- Advertisement -

ఉపాధ్యాయులకు ఇంగ్లీషులో శిక్షణ..

రాష్ట్రంలో 973 గురుకులాలను ఏర్పాటు చేయడంతో అడ్మిషన్లు కావాలని ఎమ్మెల్యేలకు ఒత్తిళ్లు వస్తున్నాయన్నారు. ఇంగ్లీషు మీడయంలో బోధనతో మంచి ఫలితాలు వస్తాయని కరోనా సమయంలో విద్యా వ్యవస్థ అతలాకుతలమైందన్నారు. కొవిడ్‌ సమయం నుంచి ఆన్‌లైన్‌ చదువలు అందరికీ కష్టమవ్వడంతో టీవీల ద్వారా బోధించాలని సీఎం సూచించారన్నారు. దీనివల్ల మారుమూల గ్రామాలకు టీవీల ద్వారా టీశాట్‌ ద్వారా బోధన చేశామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3 లక్షల మంది ఈ ఏడాది అదనంగా చేరారు. వారిలో చాలామంది ప్రైవేట్‌లో ఇంగ్లీషు మీడియం చదివేవారు వచ్చారన్నారు. ఇంగ్లీషు మీడియం వచ్చినా పుస్తకాలు ఇంగ్లీషు, తెలుగు రెండు భాషల్లో ముద్రిస్తామన్నారు. ఇంగ్లీషుపై ఉపాధ్యాయులకు ఈ నెల 14వ తేదీ నుంచి శిక్షణ ఇస్తామన్నారు. విద్యాశాఖలో త్వరలోనే 21 వేల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. జూనియర్‌ కాలేజీల కూడా బాగు విషయంపై పరిశీలన చేస్తామని సభ్యుల ప్రశ్నకు సమాధానమిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement