Wednesday, May 1, 2024

కొత్త పార్టీపై ఈటల సమాలోచనలు.. గులాబీలో గుబులు!

మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌పై పోరుకే సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. హుజూరాబాద్‌ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. తన వర్గీయులు, సన్నిహితులతో కొద్దిరోజులుగా చర్చలు జరిపిన ఈటల… అధికార పార్టీపై పోరాటం సాగించాలన్న నిర్ణయానికే వచ్చినట్లు సమాచారం. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులలో మెజారిటీ నాయకులు ఇప్పటికే ఆయనకు మద్దతు తెలుపగా, కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ ఉమతోపాటు నిజామాబాద్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి కూడా ఈటెలకు సంఘీభావం ప్రకటించినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇతర పార్టీల నేతలు సైతం ఈటల కోసం గాలం వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు కూడా ఆయనకు ఆహ్వానం పలుకుతున్నాయి. అయితే.. ఈటల మాత్రం ఏ పార్టీలో చేరకుండా సొంతంగా పార్టీ పెట్టాలన్న అలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు పాలు పంచుకున్న తన అనుయాయులు, స్నేహితులు కూడా సొంత పార్టీ పెట్టి ప్రభుత్వంపై పోరు సాగించాలని సూచించినట్లు తెలిసింది. తన బలాన్ని నిరూపించుకోవడంలో భాగంగా తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకునేందుకు ఈటల రాజేందర్ సిద్ధమవుతున్నారు. తన అనుచర గణాన్ని ఏకం చేసేందుకు ఆత్మగౌరవ పోరాటం నినాదంతో హుజూరాబాద్‌లో భారీ బహిరంగసభను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్‌ పై ప్రత్యేక్ష పోరాటానికి నాంది పలకాలని ఈటల భావిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొత్త పార్టీ పెడుతున్నారా? అన్న ప్రశ్నలకు మాట దాటవేశారు ఈటల. అయితే, పార్టీ పెట్టిన నడింపించే సత్తా తనకు ఉందని స్పష్టం చేశారు. అంతేకాదు తనకు అన్నీ పార్టీల నాయకులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని, తనకు అన్న వర్గాల వారి మద్దతు ఉందని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఈటల పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని స్పష్టం అవుతోంది. ఇప్పటికే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యి.. పలు కీలక అంశాలపై చర్చించారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సైతం ఈటలతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఈటల పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement