Thursday, May 2, 2024

Big Story: ఫెడరల్‌ స్పూర్తికి విఘాతం.. కేంద్రం మరిన్ని ఆంక్షలు, రాష్ట్రాల అధికారాలకు కోత..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఏప్రిల్‌ 1నుంచి రాష్ట్రాలపై మరిన్ని ఆంక్షల దిశగా కేంద్రంలోని మోడీ సర్కార్‌ సకలం సిద్దం చేసింది. దీంతో కేంద్ర సహకారం లేకపోయినా ఆర్ధిక వృద్దిలో, తలసరిలో, జీడీపీలో అద్భుత ప్రతిభ కనబరస్తున్న తెలంగాణ వంటి చోధక రాష్ట్రంపై కేంద్రం మరింత పెత్తనం చేసి, అధికారాలను చేతుల్లోకి తీసుకోనుంది. ఇందుకు ముహూర్తం సమీపిస్తోంది. ఇది నాన్‌ బీజేపీ రాష్ట్రాలకు శరాఘాతంగా మారనున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలకు కేంద్రమే నిధులను ఇస్తోందని చెబుతున్న బీజేపీ నేతలు ఇకపై నేరుగా అబ్దిదారులకే తమవంతు కేంద్ర సాయాలను అందించేందుకు సిద్దమైనట్లుగా తెలిసింది. ఇందులో కేంద్రం తన సహకారంతో అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వైకుంఠ ధామాల ఖర్చులో తమ వాటే ఎక్కువగా ఉందని, కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్రం ఇతర వ్యయాలకు, పథకాలకు మళ్లిస్తోందని కేంద్ర ప్రభుత్వం, బీజేపి నేతలు వాదిస్తున్నారు. ఇకపై కేంద్ర మార్కు పథకాల్లో కనిపించి ప్రజలకు కలిగే మేలులో కేంద్ర వాటాను మాత్రమే ప్రముఖంగా కనిపించేలా చేయాలని బీజేపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా నాన్‌ బీజేపీ రాష్ట్రాల్లో కేంద్ర నిధులను ప్రజలకు వివరించి లబ్ది పొందాలని చూస్తోంది. అయితే ఈ అన్ని పథకాల్లోనే రాష్ట్ర వాటా కూడా సమానంగానే ఉంటుందనే అంశాన్ని కేంద్రం విస్మరిస్తోంది. ఇదిలా ఉండగా, ఇకమీదట లబ్దిదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే పథకాలకు చెందిన నిధులను జమ చేయాలని యోచిస్తోందని, ఇందుకు ఏప్రిల్‌ 1నుంచి అమలుకు ముహూర్తంగా నిర్ణయించుకుంది.

ఖాతాల్లోకే నేరుగా…

నేరుగా లబ్దిదారులకు అందేలా, వారి ఖాతాలకే కేంద్రం నగదు బదిలీ చేస్తే అనేక రకాలుగా రాష్ట్రాల అధికారాలకు కోతలు పడనున్నాయి. ఫెడరల్‌ స్పూర్తికి ఇది విఘాతంగా మారనుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరహా విధానం అమలుతో కీలకమైన ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన, ఎన్‌ఆర్‌ఈజిఎస్‌, ప్రధాన మంత్రి సమ్మాన్‌ నిధి, విద్యార్ధుల ఉపకార వేతనాలు, ఎల్పీజీగ్యాస్‌ సబ్సిడీలు, ముద్ర యోజన పథకం వంటి వాటి అమలు మొత్తం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి చేరుతుంది. కేవలం లబ్దిదారుల గుర్తింపుకు రాష్ట్ర అధికారుల సేవలను మాత్రమే కేంద్రం వినియోగించనుంది. దీంతో రాష్ట్రాల అధికారాలకు మరోసారి పెద్ద మొత్తంలో కోతలు పడనున్నాయనే ఆందోళన పలు రాష్ట్రాలు వ్యక్తపరుస్తున్నాయి.

నాన్‌ బీజేపీ పాలిత రాష్ట్రాలే టార్గెట్‌గా…

ఈ తరహా విధానంతో నాన్‌ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం తమ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెంచుకునేందుకు ప్లాన్‌ వేస్తోంది. తామే కొన్ని పథకాలకు 80శాతంపైగా నిధులను కేటాయిస్తుంటే రాష్ట్ర వాటా నామమాత్రంగా ఉన్నప్పటికీ పేరు వారికే వస్తోందని, మరోవైపు నిధుల దారిమళ్లింపు కూడా జరుగుతోందని కేంద్రం అంటోంది. అయితే కేంద్ర నిధులు ఎప్పుడో ఒకసారి జాప్యం తర్వాత విడుదలైనా, రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా నిధులను భరించి పథకాలను సకాలంలో అమలు చేస్తున్నాయి. ఇది ఒకవిధంగా కేంద్రానికే ఉపశమనంగా ఉంది. రాష్ట్రాలనుంచి పన్నుల రూపంలో కేంద్రం 60శాతంపైగా వసూలు చేసుకుంటోండగా, రాష్ట్రాల ప్రయోజనాలకు, ప్రజల సంక్షేమానికి తమ వంతుగా నిధులను కేటాయించాలని, ఇది హక్కుగా పలు రాష్ట్రాలు చెబుతూ వస్తున్నాయి.

- Advertisement -

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో నిధుల దుర్వినియోగం ఎక్కువగా జరుగుతోందని కేంద్రం ఆరోపిస్తోంది. మెటల్‌ కాంపొనెెంట్‌ కింద ఈ నిదులను ఇతర పథకాలు, పనులకు మళ్లిస్తోందని కేంద్రం విమర్శిస్తోంది. మిషన్‌ కాకతీయ, హరిత హారం, వైకుంఠధామాలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి , అంగన్‌ వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, ట్రాక్టర్ల కనుగోలు వంటి వాటిలో దారిమళ్లింపులు జరిగాయని బీజేపి ఇటీవలే ఆరోపణలు చేసింది. దీంతో తమ నిధులతో రాష్ట్రం పేరు తెచ్చుకుంటోందని బీజేపి నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.

పథకాల అమలులో రాష్ట్రాలే కీలకం…

కేంద్ర పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసికెళ్లి అమలు చేసే గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలే పోషిస్తాయి. కేంద్రం కేవలం తనవంతు వాటా నిధులను మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. కేంద్ర చెప్పే పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే అమలు జరగాలి. ఇదే సమాఖ్య స్పూర్తిగా రాజ్యాంగ నిపుణులు పేర్కొంటారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ఆదాయాన్ని, ప్రజల పన్నుల ఆదాయాలను ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేస్తున్నారని, తమ ప్రాంతంపై వివక్ష చూపుతున్నారని, అభివృద్ధికి నోచుకోకుండా చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలోనే తెలంగాణ వేర్పాటువాద ఉద్యమం వచ్చింది. ఇదే తీరు పలు రాష్ట్రాల విభజన ఉద్యమాల్లోనూ కనిపించింది. ఇప్పుడు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ నిధులు, వ్యయాల వివక్ష ఇటువంటి వాదనలను తెరపైకి తెస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకేపార్టీ అధికారంలో ఉంటేనే కేంద్ర నిధులు వచ్చి డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ సాధ్యమని బీజేపి నేతలు చెబుతున్నారు.

సకాలంలో నిధులను విడుదల చేయని కేంద్రం…

కేంద్రం అమలు చేస్తున్న ఫసల్‌ బీమా పథకంలో ఒక్కో రకమైన పంటకు ఒక్కో ప్రీమియం అమలులో ఉంది. ఈ ప్రీమియంలో రైతు వాటా 20వాతం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా చెరో 40శాతంగా ఉంది. కానీ ప్రీమియం చెల్లింపుల్లో రాష్ట్రం చెల్లింపులు చేసినా కేంద్రం జాప్యం చేస్తోంది. దీంతో రెండేళ్లుగా ఈ పథకం అమలులో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇక కిసన్‌ సమ్మాన్‌ నిధి కింద కేంద్రం రైతులకు ఏడాదికి రూ. 6వేల చొప్పున మూడు దశల్లో చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సూఇంచిన అర్హుల జాబితాతోనే ఈ నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తోంది. రైతుబంధు పథకానికే ఎక్కువ పేరు వస్తోందని, తమ పథకానికి ప్రాచుర్యం దక్కడంలేదని కేంద్రం భావిస్తోంది.

రాష్ట్ర పన్నుల లెక్కేదీ…

కేంద్ర వివక్షాపూరిత తీరు అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తోంది. 2014నుంచి 2019వరకు దక్షిణాది రాష్ట్రాలనుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లిన ప్రతీ రూపాయిలో తిరిగి కేంద్రం కేవలం 52 పైసలే తిరిగి వస్తుండగా, అదేసమయంలో ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం కేంద్రానికి వచ్చే రూపాయికి బదులుగా రూ. 3.25లను ఇవ్వడంపై సమాఖ్య స్పూర్తికి విరుద్దంగా మారింది. 15వ ఆర్ధిక సంఘం సూచించినట్లుగా కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 42నుండి 41 శాతం తగ్గించగా…అదేస్థాయిలో ఇతర పన్నుల్లో వాటాను కూడా భారీగా తగ్గడంతో మొత్తం కేంద్ర సాయం పద్దు తగ్గుతూ వస్తోంది. కేంద్ర సాయంలో మొత్తంగా 4 శాతంమేర తగ్గుదలతో 48శాతానికే పరిమితమైంది. జాతీయోత్పత్తిలో దక్షిణాది రాష్ట్రాల వాటా 2019-20లో 85.95శాతంగా నమోదుకాగా కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో ఈ రాష్ట్రాలకు 20నుంచి 25 శాతమే దక్కుతున్నాయి. పన్నుల వాటా నిర్ధేశించేందుకు 2011 జనాభా ఆధారంగా తీసుకోవాలన్న 15వ ఆర్ధిక సంఘం నిర్ణయంతో జనాభాను నియంత్రిస్తున్న తెలంగాణను దెబ్బతీసింది. జాతీయస్థాయిలో సంతాన వృద్ధి శాతం 2.33 కాగా, తెలంగాణలో ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యత్తమ విధానాల కారణంగా ఇది 1.8శాతంగా ఉంది. దీంతో కేంద్ర పన్నుల వాటా పెంచడానికి ప్రామాణికంగా తీసుకున్న జనాబా లెక్కలు ఆటంకంగా మారాయి. ఇక కేంద్రం నిర్ధేశించిన ఆర్ధిక సంస్కరణల వేగం, ఉపాధి అవకాశాల పెంపుదల, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వంటి అన్నింట్లో తెలంగాణ ముందంజలో ఉంది.

ఏటా రూ. 50వేల కోట్ల పన్నులు కేంద్రానికి…

తెలంగాణనుంచి కేంద్ర ప్రభుత్వానికి ఏటా రూ. 50వేల కోట్లకుపైగా రాబడి వెళుతోంది. రాష్ట్రంనుంచి కేంద్రానికి చెల్లిస్తున్న పన్నుల్లో తిరిగి రాష్ట్రానికి చేరుతున్న పన్నుల వాటా సగమేనని, 15వ ఆర్ధిక సంఘం నిర్ధేశించిన 41 శాతం వాటా నిధుల్లోనూ పురోగతి మందగిస్తోంది. 20167-17, 2017-18, 2019-20లలో ఒక్కో ఆర్ధిక యేడాది కేంద్రానికి పన్నుల రూపంలో రూ. 50వేల కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరింది. ఆదాయపు పన్ను, సేవా పన్ను, సెంట్రల్‌ ఎక్సైజ్‌ పన్ను, కస్టమ్స్‌ డ్యూటీ వంటి పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రంనుంచి పన్నులు చేరుతున్నాయి. అయితే కేంద్రంనుంచి రాష్ట్రానికి వివిధ రూపాల్లో వస్తున్న పన్నుల వాటా, కేంద్ర సాయం, ప్రాయోజిత పథకాలు అన్నీ కలుపుకుని రూ. 29వేలకు మించడంలేదు. కేటాయింపులతో పొంతన లేకుండా ఆర్ధిక యేడాది ముగింపునాటికి 70శాతం కూడా మించడంలేదు. ఇక సీఎస్‌ఎస్‌(కేంద్ర పథకాలకు రూ. 3నుంచి రూ. 4వేల కోట్లు అంచనా వేసుకోగా ఏ ఒక్క ఏడాదికూడా రూ. 1000 కోట్లు మించలేదు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలకు 80శాతంపైగా నిధులను కేటాయించడం, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే ఆరోపణలు పెరిగాయి.

15వ ఆర్ధిక సంఘం సూచీల్లో టాప్‌…

15వ ఆర్ధిక సంఘం కేంద్ర నిధుల కేటాయింపునకు సూచీలుగా నిర్ధేశించిన పనితీరు, ప్రోత్సాహకాలు, కేంద్ర పథకాల అమలు, జనాభా నియంత్రణ, ఇతర అంశాల్లో రాష్ట్రం పురోగతిలో ఉంది. ఇందుకు అనువుగా కేంద్ర కేటాయింపులు పెరగాల్సి ఉండగా తగ్గుతూ పోతోంది. గడచిన 14వ ఆర్ధిక సంఘం 5ఏళ్లలో లక్ష కోట్లు తెలంగాణకు ఇవ్వాలని సిఫార్సు చేసింది. పన్నుల ద్వారా రూ. 96,217కోట్లు స్థానిక గ్రాంట్‌లు రూ. 9449 కోట్లుగా అంచనా వేసింది. అది అమలుకాకపోగా, తాజాగా వచ్చే ఐదేళ్లకు నిధులనిచ్చేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్న 15వ ఆర్ధిక సంఘం మధ్యంతర నివేదికలో తెలంగాణ వాటాను 42శాతంనుంచి 41శాతానికి కుదించింది. జనాభా నియంత్రణ, జలవనరుల సంరక్షణ, డిజిటల్‌ లావాదేవీలు, గ్రామీణ ఆర్ధిక వనరుల బలోపేతం వంటివి తెలంగాణ ప్రగతితో అనుకూలంగా ఉన్నాయని తేలినా కేంద్రం పట్టించుకోలేదు. జనాభా తక్కువగా ఉండి తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు 115వ ఆర్ధిక సంఘం వెయిటేజీని తగ్గించడంతో కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్లలో తక్కువ మొత్తం ఇస్తూ వస్తోంది. 2019-20లో రూ. 18,964కోట్లుగా ఉన్న రాబడి రూ. 16,241కోట్లకు తగ్గింది. . 14వ ఆర్ధిక సంఘం నిర్లక్ష్యంతో తెలంగాణకు అన్యాయం చేసిందని, తాజా 15వ ఆర్ధిక సంఘానికి అటువంటి అవకాశం ఇవ్వకుండా గ్రామీణ ప్రాంతాలు, సమగ్ర రాష్ట్ర వివరాలు, పరిస్థితులు, ప్రజల జీవన ప్రమాణాలు వంటి వాటి ఆధారంగా నిధుల కేటాయింపు జరిగేలా నివేదికలను రూపొందిస్తోంది.

ఎన్నికల హామీల అమలుకు అడ్డంకి…

అయితే 15వ ఆర్ధిక సంఘం విధివిధానాలు రాష్ట్రాల ఆర్ధిక స్వాతంత్య్రానికి ముప్పుగా పరిణమించాయనే ఆందోళన పెరుగుతోంది. సమాఖ్య స్పూర్తికి విరుద్దంగా రాష్ట్రాలు తామిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చకుండా టర్మ్స్‌ అండ్‌ రిఫరెన్సెస్‌లో కొన్ని అంశాలు విరుద్దంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. జనాభా ప్రాతిపదికను మార్చడంతో ఆర్ధిక భారం, అదాయ నష్టం వాటిళ్లుతుందని పేర్కొంది. గ్రాంట్లలో కోతకు ఇదే కారణమవుతోందని ఆరోపిస్తోంది. రాష్ట్రాలను సంప్రదించకుండా కేటాయింపులను మారుస్తున్నారనే అంశాన్ని ఎత్తిచూపింది. మరోవైపు రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్ర పథకాల అమలుతో ముడిపెట్టడం పలు రాష్ట్రాలకు ఇబ్బందిగా మారింది. నాన్‌ బీజేపీ పాలిత రాష్ట్రాలు దీంతో భారీగా నష్టపోవాల్సి వస్తున్నది. ఇదేవిధంగా జనాకర్షక పథకాలు(పాపులిస్టిక్‌ స్కీమ్స్‌) పెంచితే కోత పెడతామని ఉన్న నిబంధన కూడా తెలంగాణ పురోభివృద్ధికి అడ్డంకిగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement