Sunday, May 5, 2024

Big Story: అడ్డంకులు అధిగమించేలా వేర్వేరుగా నోటిఫికేషన్లు.. ఒక్కో నోటిఫికేషన్‌కు మధ్య గడువు

ఉద్యోగ భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. సీఎం కేసీఆర్‌ అధికారిక ప్రకటనతో శాఖల వారీగా ముమ్మర కసరత్తు మొదలైంది. ఖాళీల గుర్తింపు ప్రక్రియ ముగియడంతో మరింత వేగవంతంగా ప్రజలకు పారదర్శక ప్రభుత్వ పాలన అందజేత దిశగా సర్కార్‌ నోటిఫికేషన్ల జారీకి అడ్డంకులు లేని రీతిలో అన్ని ఏర్పాట్లూ చకచకా చేస్తోంది. ఒక్కో నియామక సంస్థ ఒక్కో సమయంలో వేర్వేరు నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు నిజమైన ఉద్యోగ పండుగగా అవకాశం విస్తృతం చేసేలా కార్యాచరణ ముగింపుకు చేరింది. ఇక వెంటనే నోటిఫికేషన్ల జారీతో నిరుద్యోగులను ఉద్యోగులుగా గుర్తించే సన్నాహాలు తుది దశకు చేరాయి.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నిరుద్యోగులకు ఇబ్బందులు లేకుండా, ఎక్కువ ఉద్యోగాలకు పోటీ పడేలా వారికి అవకాశం కల్పిస్తూ సర్కార్‌ కీలక చర్యలు తీసుకోనుంది. 80,039 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ల జారీపై తీవ్రంగా యోచిస్తోంది. వేర్వేరు నియామక సంస్థలతో వీలైనన్ని నోటిఫికేషన్లు జారీ చేసి ఒక్కో నోటిఫికేషన్‌కు మధ్య గడువు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో న్యాయపరమైన అవరోధాలను అధిగమించేందుకు ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఇప్పటికే కీలక చర్చలు జరిపి అవసరమైన చర్యలు తీసుకొంది. టీఎస్‌పీఎస్సీకి చెందిన 23వేల పోస్టుల వివాదాలపై దృష్టి పెట్టింది.

కొత్త జిల్లాలు, జోన్ల వారీగా నోటిఫికేషన్ల జారీకి శ్రీకారం చుట్టనున్నారు. అయితే తొలుత ఖాళీలను పూరించి, ఆ తర్వాత జిల్లాల వారీగా క్యాడర్‌స్ట్రెంగ్త్‌ను నిర్ధారించనున్నారని, అప్పుడు ఏర్పడే ఖాళీలను రెండో దశలో భర్తీ చేయాలని ప్రభుత్వ వ్యూహంగా ఉందని తెలుస్తోంది. 27శాఖలకు చెందిన ఉద్యోగాలను జిల్లా, జోనల్‌, మల్టిd జోనల్‌ విధానంలో కేటాయింపులు పూర్తి చేసిన ప్రభుత్వం ప్రత్యేక నియామక మండళ్లతో నోటిఫికేషన్లను జారీ చేయనుంది. ఉపాధ్యాయ పోస్టులకు విద్యాశాఖ, టెట్‌ వంటి నోటిఫికేషన్లు వేయనున్నారు. జిల్లా స్థాయి పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వారిద్వారా జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసి నియామక ప్రక్రియ ముగించనున్నారు. త్వరలో ఉద్యోగ భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఇందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, పోలీస్‌ నియామక బోర్డు, గురుకుల విద్యాలయాలు, వైద్య నియామకాల సంస్థలతోపాటు కొత్తగా ఏర్పాటు చేయనున్న నీటిపారుదల నియామక సంస్థలకు విడివిడిగా అధికారలు అప్పగించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలోని డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీల ద్వారా జిల్లా స్థాయి పోస్టులకు నియామకాలను జరపనున్నారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1, 2, 3 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనుంది.

వీలైనంత తొందర్లో 80,039 పోస్టుల భర్తీకి వీలుగా శాఖల వారీగా నోటిఫై చేసే కార్యాచరణ చురుగ్గా కొనసాగుతోంది. ఆ తర్వాత జీవోలను జారీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ అన్ని నియామకాలకు ఆమోదం ఇవ్వనుంది. దీంతో ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగిపోనున్నాయి. సర్వీస్‌ నిబంధనల మేరకు నూతన రోస్టర్‌ పాయింట్లతో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఒకే సిలబస్‌ ఉన్న పోస్టులకు ఒకే నోటిఫికేషన్‌ పరిధిలో నియామకాలు చేసేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఇక వడివడిగా అన్ని శాఖలు, విభాగాలు, జిల్లాల ఖాళీల భర్తీకి నేరుగా పర్యవేక్షణకు సీఎస్‌ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు అవుతోంది. ఈ కమిటీలో ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉండి, సమావేశాలద్వారా నియామక పరిస్థితులను పర్యవేక్షిస్తారు. కిందిస్థాయిలో పోస్టుల భర్తీకి రాతపరీక్షలను నిర్వహించనుండగా, ఉన్నతస్థాయి పోస్టులకు ఇంటర్వ్యూలను కూడా నిర్వహించనున్నారు. ఇలా జిల్లా స్థాయి పోస్టులు 39,829 పోస్టులను కలెక్టర్లు ఏ జిల్లాకు ఆ జిల్లాలో నోటిఫికేషన్లు వేసి భర్తీ ప్రక్రియ చేపడుతారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement