Thursday, November 7, 2024

TS | వేతనాలు పెంచాలన్న డిమాండ్‌.. 14న బస్‌ భవన్‌ ముట్టడికి పిలుపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తక్షణమే రెండు వేతన సవరణలు చేయాలన్న డిమాండ్‌తో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచకుండా వేధించడం, డీఏలు, రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వేధింపులపై ఇప్పటికే దశలవారీ పోరాటాలు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఈనెల 14న బస్‌ భవన్‌ను ముట్టడించాలని నిర్ణయించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ కార్మికులు పొదుపు చేసుకున్న డబ్బులను సైతం యాజమాన్యం వారి అవసరాలకు వాడుకుంటూ వేధించడంతో పాటు డిపోలలో టి24 టికెట్లు తక్కువ వచ్చాయని వేధించడం, కేఎంపీఎల్‌ రాలేదని డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

అలాగే, ఈపీకే రాలేదని మరో రకంగా కండక్టర్లను వేధించడం చట్ట వ్యతిరేక డ్యూటీలు 16 గంటల వరకూ ఇస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆరోగ్యం బాగులేక సెలవు అడిగినా ఇవ్వకుండా వేధించడం, కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఫోటోలు పెట్టమని వేధిస్తున్నారనీ, ఇది ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై అనుసరిస్తున్న అణచివేతకు నిదర్శనమని పేర్కొంటున్నారు. బస్సులను పెంచమని అడిగితే పని భారం పెంచి వేధిస్తున్నారనీ, ఈ విధంగా ఎన్నో రకాలుగా వేధిస్తూ ప్రాణాలు తీస్తున్నప్పటికీ ఎండీ, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులపై యాజమాన్యం వేధింపులు, అణచివేత ధోరణికి నిరసనగా, కార్మికులకు తక్షణమే రెండు వేతన సవరణలు చేయాలన్న డిమాండ్‌తో టీజేఎంయూ ఈనెల 14న చలో బస్‌ భవన్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

ఈమేరకు శుక్రవారం టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు ముదిరాజ్‌, రాష్ట్ర కార్యదర్శులు పిఎస్‌ఎస్‌ రావు,ముత్యాలు, జీవన్‌రామ్‌ చలో బస్‌ భవన్‌ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హనుమంతు ముదిరాజ్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ ఉద్యోగులపై వేధింపులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు వెంటనే రెండు వేతన సవరణలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 14న తలపెట్టిన చలో బస్‌ భవన్‌ కార్కక్రమాన్ని యూనియన్లకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని ఈసందర్భంగా హనుమంతు ముదిరాజ్‌ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement