Friday, May 17, 2024

TS | ప్రభుత్వ హాస్పిట‌ళ్ల‌పై విశ్వాసం పెరిగేలా కృషి చేయాలి: మంత్రి హరీష్‌ రావు

హెదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా తీసుకున్న చర్యల ఫలితంగా ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో ఎంతో విశ్వాసం పెరిగిందనీ, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ రావు అన్నారు. వైద్య సేవలు అందించడంతో పాటు రోగులతో ఆప్యాయంగా ఉండాలని సూచించారు. శుక్రవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల పనితీరుపై ఆయన నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు పూర్తి ఉచితంగా అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌లో రూ.12,364 కోట్లు కేటాయించి ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేసినట్లు చెప్పారు.

ఉన్న ఆసుపత్రులకు మరమ్మత్తులు, పెద్ద సంఖ్యలో కొత్త ఆసుపత్రుల నిర్మాణం, అవసరమైన వైద్య సిబ్బంది నియామకం, అధునాతన వైద్య పరికరాల కొనుగోలు, మందుల కొరత లేకుండా చూడటం వంటి చర్యలకు వైద్యారోగ్య శాఖ ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా శానిటేషన్‌, సెక్యూరిటీ, పేషెంట్‌కేర్‌ సిబ్బంది పేషెంట్లు అడెండెంట్స్‌తో గౌరవంగా ఉండాలనీ, వారి మెప్పు పొందేలా సేవలు అందించాలని సూచించారు. పీడియాట్రిక్‌ సేవలు, ఎస్‌ఎన్సీయూ, పాలియేటివ్‌ కేర్‌ ఫెసిలిటీ సేవలు ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. అవగాహన పెంచి క్యాంపుల నిర్వహణ ద్వారా రక్తదానాన్ని ప్రోత్సహించాలన్నారు.

కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదల తెలుసుకునేందుకుసీఎం కేసీఆర్‌ ఆలోచనలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కాన్‌లు గర్బిణులకు వరంగా మారాయనీ, గడచిన మూడు నెలల్లో 6395 టిఫా స్కానింగ్‌లు నిర్వహించినట్లు తెలిపారు. ప్రైవేటులో రూ.రెండు వేలు ఖర్చయ్యే ఈస్కానింగ్‌ను ప్రభుత్వ ఆసుపత్రుల ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత నెలలో సాధారణ ప్రసవాలు ఎక్కువ శాతం నమోదు చేసిన వికారాబాద్‌, జనగాం, ఖమ్మం జిల్లా ఆసుపత్రుల ఓబీజీ విభాగాలను మంత్రి అభినందించారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు మరింత నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు కొత్త డైట్‌ పాలసీ తెచ్చి అమలు చేస్తున్నామనీ, అన్ని ఆసుపత్రుల్లో మెనూ ప్రకారం డైట్‌ అందేలా చూసే బాధ్యత సూపరింటెండెంట్లపైనే ఉందన్నారు.

- Advertisement -

మందులు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రిఫర్‌ చేయకూడదనీ, డిశ్చార్జ్‌ అయిన పేషెంట్లకు మందులు ఇచ్చి పంపించాలని స్పష్టం చేశారు. చరిత్రలో నిలచిపోయే విధంగా ఒక పండుగ వాతావరణంలో సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారనీ, 9 ఏళ్ల కాలంలో రాష్ట్రం సాధించిన అద్భుతమైన ప్రగతిని శాఖల వారీగా ప్రజల ముందు ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈనెల 14న తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నామనీ, అందరూ భాగస్వాములై ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement