Monday, April 29, 2024

ఢిల్లీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. జ‌న‌వరి 1 నుంచి వాటికి రిజిస్ట్రేషన్ ఉండ‌దు..

ఢిల్లీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. 2022 జనవరి 1 నాటికి 10 యేండ్లు దాటినా అన్ని డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తామని ప్రకటించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపింది. అట్లాగే.. ఈ డీజిల్ వాహనాలకు ఎలాంటి అభ్యంతర లేకుండా ధ్రువీకరణ పత్రం జారీ చేస్తామనీ, వీటిని ఇతర ప్రదేశాలలో రిజిస్టర్ చేయించుకోవచ్చునని పేర్కొంది. లేదంటే.. 10 ఏళ్ల డీజిల్ వాహనాలు లేదా 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే అవకాశం క‌ల్పించ‌నున్న‌ట్టు తెలిపింది ఢిల్లీ ప్ర‌భుత్వం.

ఇప్పటికే 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లు నిండిన వాహనాలకు ఎలాంటి NOCజారీ చేయడం లేద‌ని ఢిల్లీ నగర రవాణా శాఖ వెల్లడించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో 10 సంవత్సరాల కంటే ఎక్కువ యేండ్లు ఉన్న డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న పెట్రోల్ వాహనాల రిజిస్ట్రేషన్లు ర‌ద్దుతో పాటు ప‌రిమితుల‌కు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. జూలై 2016లో, ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం.. 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఏళ్లు ఉన్నా డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ సంస్థ ఆదేశాల మేర‌కు ఇట్టి చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు తెలిపింది. ఎన్‌జిటి ఆదేశాలను పాటిస్తూ.. డిపార్ట్‌మెంట్ వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన ఢిల్లీలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న లేదా పూర్తి చేసుకోనున్నడీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తుందని రవాణా శాఖ ప్రకటన పేర్కొంది.

అలాగే 10 ఏళ్లు నిండిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు నిండిన పెట్రోల్ వాహనాలకు దేశంలోని ఏ ప్రాంతానికైనా ఎన్‌ఓసీ జారీ చేయవచ్చని పేర్కొంది. అయితే, అటువంటి వాహనాల రీ-రిజిస్ట్రేషన్ కోసం రాష్ట్రాలు నిషేధిత ప్రాంతంగా గుర్తించిన స్థలాలకు NOC జారీ చేయబడదు అనే షరతుకు ఇది లోబడి ఉంటుంది. వాహనాల సాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలని NGT రాష్ట్రాలను ఆదేశించింది. 10 ఏళ్ల డీజిల్ లేదా 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలను నడపాలనుకుంటే వాటిని వెంటనే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కొన్ని వారాల క్రితం, ఢిల్లీ ప్రభుత్వం EV కిట్‌తో పాత డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలను రీట్రోఫిట్‌మెంట్ చేయడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఇటువంటి పాత వాహనాలను స్వాధీనం చేసుకుని, అధీకృత విక్రేతలచే వాటిని స్క్రాపింగ్ కోసం పంపుతున్నామ‌ని ఢిల్లీ రవాణా శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement