Monday, April 29, 2024

బాలీవుడ్ నటి జుహీకి రూ.20లక్షల జరిమానా!

భారత్ లో 5జీ సేవలను వ్యతిరేకిస్తూ ప్రముఖ బాలీవుడ్ నటి జుహీ చావ్లా దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. పిటిషన్ ను తిర్కరించింది. న్యాయవ్యవస్థను అపహసం చేసినందున జుహీ, మరికొందరికి రూ. 20 లక్షలు జరిమానా విధించింది.

దేశంలో 5జీ సేవల ఏర్పాటుకు వ్యతిరేకంగా నటి జుహీతోపాటు మరికొందరు ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీలో ఉండే రేడియేషన్‌ వల్ల దుష్పరిణామాలు తలెత్తుతాయని, మనుషులు, మూగజీవాలపై ప్రస్తుతం ఉన్న ప్రభావం కంటే 10 నుంచి 100 రెట్లు అధిక ప్రభావం పడుతుందని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై న్యాయస్థానం ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరపగా.. జుహీ అభిమానులు కొందరు ఆన్‌ లైన్‌లోకి వచ్చి పలుమార్లు ఆటంకం కలిగించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. విచారణను వాయిదా వేసింది.

ఈ పిటిషన్‌పై శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యం మాత్రమేనని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టిపారేసింది. కోర్టు విచారణ లింక్‌ను జుహీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినట్లుగా అనిపిస్తోందని పేర్కొంది. న్యాయప్రక్రియను హేళన చేసినందుకుగాను పిటిషనర్లకు రూ.20లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అంతేగాక, విచారణ సమయంలో ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించిన వారెవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

కాగా, వైర్ లెస్ నెట్వర్క్ సేవలుగా ప్రచారం పొందుతున్న 5G భారత్ లోనూ ఎంటరవుతోంది. అత్యంత స్పీడ్ తో ఇంటర్నెట్ సర్వీసులు, ఫోన్ సేవలు 5జీతో సాధ్యం. అయితే.. 5G కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుందన్న వాదనలు కూడా తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. భారత్ లో 5జీ సేవలను వ్యతిరేకిస్తూ ప్రముఖ బాలీవుడ్ నటి జుహీ చావ్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సాంకేతికపరమైన ఆవిష్కరణల అమలును తాము వ్యతిరేకించడంలేదని.. వైర్ లెస్ కమ్యూనికేషన్ సహా సాంకేతిక ప్రపంచం నుంచి వస్తున్న కొత్త ఆవిష్కరణలను అందరం ఆస్వాదిస్తున్నామని తెలిపారు జుహీ చావ్లా. అయితే.. ఆ తర్వాత జనరేషన్స్ కు పరికరాల ఉపయోగించడంలో అయోమయం ఏర్పడుతోందన్నారు. వైర్ లెస్ గాడ్జెట్ల నుంచి, సెల్ టవర్ల నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ధార్మికత విడుదలవుతుందని మన సొంత అధ్యయనాలే చెబుతున్నాయన్నారు. ప్రజల ఆరోగ్యంపై రేడియేషన్ తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నదానికి ఇదే తగిన కారణమన్నారు. ప్రజల భద్రతకు ఇది హానికరం అని భావిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement