Thursday, April 25, 2024

ఈటల ఖాతాలో ‘దళిత బంధు’

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రాజకీయ వేడి పెంచుతోంది. ఓవైపు ఉపఎన్నిక.. మరోవైపు దళిత బంధు పథకం అమలుపై సర్వత్ర చర్చ జరుగుతోంది. ఉప ఎన్నికలో ఈటలను ఢీ కొట్టేందుకు దళిత బంధుతో కేసీఆర్ భారీ స్కెచ్ వేశారు. ప్రస్తుతం ఈటల వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా హుజురాబాద్ లో సీన్ కనిపిస్తోంది. హుజురాబాద్ అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ ఇంకా ఖరారు చేయనప్పటికీ ఓటర్లను ఆకర్షించే పనిలో కేసీఆర్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో దళిత బంధు పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రభుత్వ పథకాన్ని ఓ వర్గం స్వాగతిస్తుండగా… ఇది కేసీఆర్ ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. అయితే, అంతిమంగా దళిత బంధు క్రెడిట్ మాత్రం ఈటల ఖాతాలో పడిందని టాక్ వినిపిస్తోంది.  

హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటలకు దళిత ఓట్ల పడకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా దళిత బంధు పథకం రచన చేశారు కేసీఆర్. దీని ద్వారా వందల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈటల రాజీనామా, ఉపఎన్నికలో ఓటమి భయంతోనే కేసీఆర్ దళిత బంధును తెరపైకి తెచ్చారని ఈటల వర్గం అంటోంది. ఈటల వల్లే ఈ పథకం సాధ్యమైందని, ఈటల టీఆర్ఎస్ లోనే ఉంటే ఈ పథకం వచ్చేదా? అని ప్రశ్నిస్తున్నారు.

హుజురాబాద్ నియోజకవర్గంలోని విలాసాగర్‌ గ్రామంలో ఈటల రాజేందర్‌ కాళ్లను దళితులు పాలతో కడిగారు. అదే సమయంలో ఈటల రాజేందర్‌ కూడా వారి కాళ్లు మొక్కారు. ఈటల రాజీనామా చేయడం వల్లే దళితబంధు, ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని ఈ సందర్భంగా దళితులు వ్యాఖ్యానించారు. దళితులు తన కాళ్లు కడుగుతానని వస్తే రాజకీయ నాయకులు ఎక్కడ విమర్శిస్తారో అని ముందుగా తానే వాళ్ల కాళ్లకు మొక్కానని ఈటల చెప్పారు. ఈ క్రమంలో దళిత ఓట్లు కూడా ఈటలకే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఉపఎన్నిక గెలుపును అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు సీఎం కేసీఆర్ స్కెచ్లు వేస్తుంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ తమదేనని చాటి చెప్పాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు యోచిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: వీడియో: దళితుల కాళ్లు మొక్కిన ఈటల.. !

Advertisement

తాజా వార్తలు

Advertisement