Tuesday, October 29, 2024

Big Story: దక్షిణకాశీ, కేతకీ మహాక్షేత్రం.. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

అష్టతీర్థముల సంగమం దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగబంగారంగా విరాజిల్లుతున్న కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి నవహీనిక బ్రహ్మోత్సవములు ఫిబ్రవరి 26 శనివారం నుండి మార్చి 6 కొనసాగనున్నాయి. 9 రోజుల పాటు నిర్వహించే కేతకీ సంగమేశ్వరస్వామి నవహీనిక బ్రహ్మోత్సవములకు మనరాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు.

ఝారాసంఘం (ప్రభ న్యూస్‌) : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కాశీవిశ్వనాథ ఆలయం తర్వాత అంతటి ప్రసిద్ది గాంఛినది ఈ ఆలయం. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయానికి ప్రతీ సంవత్సరం లక్షల సంఖ్యలో భక్తులు సందర్శించి తమతమ మొక్కులు తీర్చుకుంటారు. దేవాలయంలో సంగమేశ్వరస్వామిని దర్శించుకుంటే పనీహితులమవుతామనే నమ్మకం భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. తాము చేసిన పాపాలు పోవాలని తమకు వచ్చిన కష్టాలు తీరాలని, తమ కోరికలు నెరవేరాలని ఆయురారోగ్యంగా అష్ట ఐశ్వర్యంతో తూగాలని స్వామివారిని వేడుకుంటూ అమృత గుండంలో స్నానం చేసి మొక్కుకుంటారు.

ఆలయ సంగ్రాహ చరిత్ర..
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం గ్రామంలో వేచి ఉన్న శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామివారి చరిత్ర స్కంధపురాణంలో చెప్పబడి ఉంది. బ్రహ్మ సృష్టి కార్యం పూర్తి చేసిన పిదప కేతకీ వన (మొగలి వన) ప్రాంతమున పరమేశ్వరున్ని జ్ఞానింపగా బాణాలింగకారుడైన శివుడు ప్రత్యక్షమై బ్రహ్మచే స్థాపించి కమండలంలోని జలము చే అభిషేకించబడిన బ్రహ్మదేవుని కోరికచే ఈ కేతకీ మొగిలి వన ప్రదేశంలో శాశ్వతంగా భక్తుల పూజలందుకున్నచో ఉండగలవని వరమును గ్రహించేను. కేతకీ అను అక్షర శాప విమోచనముచే కేతకీ మొగిలి వనంగా వెలసి బానాలింగకారుడగు పరమశివుడు కేతకీ పుష్పములచే పూజించ ఉండుచుండును. కేతకీ పుష్పములచే పూజించుట వలన కేతకీ సంగమేశ్వరుడిగా స్థిరనామము ఏర్పడినది.

అమృతగుండం.. అష్టతీర్థముల చరిత్ర..
పూర్వం ఈ స్థలంన మహాపురుషులు యజ్ఞం చేసినట్టుగా హర్యోక్తి. కృతాయుగమున పూర్వపు సూర్యవంశపు రాజు శ్రీ కుపేంద్ర బూపాలుడు బయంకరమైన ఛర్మవ్యాధి రోగపీడితుడై దేశమందలి అన్నీ పవిత్ర పుణ్యక్షేత్రంలో దర్శించినప్పటికీ ఏమాత్రం లాభం లేకపోయింది. చివరికి ఒకనాడు కేతకీ వనంకు ఏక మార్గమున వచ్చి ఒక లేడిని చూసి తరుముచూ ఈ ప్రదేశానికి వచ్చారు. ఇంతలో రాజుగారికి దాహం వేసి నీటికై వెతుకుతుండగా జరాగుండం కనబడినది. రాజుగారికి అందులోని నీరు త్రాగి కొంతసేపు సేదతీరి తిరిగి ఇంటి ముఖం పట్టాడు. ఇంటికి వెళ్లగానే భార్య చంద్రకళ ఏమి మీ చర్మ రోగము ఎలా పోయిందని ప్రశ్నించింది. రాజుగారు తన వేట వృంత్తాంతను చెప్పాడు. అటు పిమ్మట రాజు అచట బానాలింగరూపుడగు శివున్ని అర్పించి ఆలయం వద్ద గుండం నిర్మాణం ప్రారంభించెను. ఈ గుండంకు అమృత గుండం అనే పేరు. ఈ అమృత గుండంలో నారాయణ, ధర్మఋషి, వరుణ, సోమ, చంద్ర, దత్త, యమజలాలు అష్ట తీర్థములుగా ప్రసిద్ది పొంది భక్తులను పుణ్యాతిథులుగా చేయుచున్నది. కాశీ నుండి ఒక జళ ఈ అమృత గుండంలో కలిగి ఉన్నదని పూర్వికుల కథనం.. దేశంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఈ అమృత గుండంకు కలిగి ఉందని స్కంద పురాణంలో తెలియజేయబడినది. ఇచట భక్తులు స్నానం చేయుటయే కాక గుండంను ఖాళీ చేయించి అందులో ఋషితీర్థం నందు పంచభక్ష పరమాన్నములతో నైవేద్యం పెట్టి అట్టి నైవేద్యం వెనుకకు రాకుండా దరిలోకి వెళ్లిపోయి కొన్ని గుంటలకే మళ్లీ గుండం పూర్తిగా నిండిపోవును.

- Advertisement -

మహాశివరాత్రి ఉత్సవాలు ఇలా..
మొదటి రోజైన 26/2/2022 శనివారం నాడు అంకురార్పణం, ద్వజారోహణం, విజ్ఞేశ్వరపూజ, స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చాన జరుపబడును. ఉదయం 11:15 నిమిషాలకు శిఖర పూజా, రాత్రికి పల్లకిసేవా భజనలు. ఆదివారం నాడు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చాన, రాత్రికి పల్లకిసేవా భజనలు. సోమవారం నాడు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చాన, సాయంత్రం 5 గంటలకు స్వేచ్చవాహనసేవ, గ్రామ ఊరేగింపు, రాత్రి పల్లకిసేవా భజనలు. మంగళవారం నాడు మహాశివరాత్రి, అగ్నిప్రతిష్ట, గణపతి హోమం, స్వామివారికి అభిషేకం, రాత్రి లింగోద్భవ సమయమున మహాన్యాత పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పల్లకిసేవా భజనలు, బుధవారం నాడు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చాన, రుద్ర స్వహకార హోమం, నవగ్రహా శాంతి హోమం. సాయంత్రం 5 గంటల నుండి నందివాహన సేవ, రాత్రి 12 గంటలకు అగ్నిగుండం, పూజా, అగ్నిప్రతిష్ట, గురువారం నాడు ఉదయం 4:30 నిమిషాలకు అగ్నిగుండం, స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చాన, రుద్రస్వహకార హోమం, సాయంత్రం 5:30 నిమిషాలకు శ్రీ పార్వతీ సంగమేశ్వరస్వామి కళ్యాణోత్సవం, రాత్రి 10:30 నిమిషాలకు శ్రీ స్వామివారి విమాన రథోత్సవం, పల్లకిసేవ. శుక్రవారం నాడు అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చాన, పూర్ణాహుతి, పల్లకిసేవా భజనలు. శనివారం నాడు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చాన, రాత్రికి పల్లకిసేవా భజనలు. ఆదివారం నాడు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, లక్ష బిల్వార్చన, అన్నదానం, పల్లకిసేవా కార్యక్రమాలు జరుగాయి. ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పర్యాటక కేంద్రంగా ఝారాసంఘం..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వందకిలోమీటర్ల దూరంలో జహీరాబాద్‌ పట్టణంకు 16 కిలోమీటర్ల దూరంలో శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయం కలదు. ఈ ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందింది. ఈ ఆలయానికి వివిధ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మొగిలి వనంలో వెలిసిన శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయం ఇక్కడి వచ్చే భక్తులకు కమణీయంగా ఉంటుంది. ఆలయంలో ప్రధాన గర్భగుడితో పాటు పంచాయతీల మందిరం, బస్వన్న మందిరం, హోమ మండపం, చీకటి మందిరం, నవగ్రహ మందిరం, కాశీబాబా మటాలు ఉన్నాయి. కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయ సమీప దూరంలో అతిపురాతన కట్టడాలు, ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. పొట్‌పల్లి సిద్దేశ్వరాలయం, కొల్లూరు రామేశ్వరాలయం, సంగమేశ్వరుని పాదాలు, మల్లన్నగట్టు ఆశ్రమం, పర్దీపూర్‌ దత్తగిరి ఆశ్రమం ఇక్కడ కొలువుదీరాయి. ఇక్కడకు వచ్చే భక్తులకు వీలుగా గదుల సౌకర్యంతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం దేవాలయంలో చల్లని పందిళ్లు, త్రాగునీరు, భోజన వసతి కల్పించేందుకు దేవాలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement