Sunday, May 5, 2024

TS | నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం.. సమాచారం అందిస్తే క్యాష్ ప్రైజ్: సీపీ సుబ్బరాయుడు

రాబోయే వానాకాలం సీజ‌న్ కోసం ఇప్ప‌టి నుంచే విత్త‌నాల కొనుగోళ్లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో క‌రీంన‌గ‌ర్ పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మార్కెట్లోకి న‌కిలీ విత్త‌నాలు రాకుండా, రైతులు కొనుగోలు చేసి న‌ష్ట‌పోకుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇందులో భాగంగా క‌రీంన‌గ‌ర్ సీపీ ఎల్ సుబ్బ‌రాయుడు సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకోబోతున్న‌ట్టు తెలిపారు.

‌‌‌‌- ప్ర‌భ‌న్యూస్ బ్యూరో, క‌రీంన‌గ‌ర్‌

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్టు సమాచారం అందిస్తే వారికి క్యాష్ ప్రైజ్ ఇస్తామ‌న్నారు సీపీ ఎల్‌. సుబ్బ‌రాయుడు. వానాకాలం సాగు ప్రారంభమవుతున్న వేళ, కొందరు వ్యాపారులు, మధ్య దళారీలు రైతులను మోసం చేసేందుకు నకిలీ విత్తనాలను అంట‌గ‌ట్టేందుకు య‌త్నిస్తున్న‌ట్టు పోలీసుల దృష్టికి వ‌చ్చింద‌న్నారు. రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ముందస్తు చర్యలకు కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు సిద్ధమయ్యారు.

నకిలీ విత్తనాల నియంత్రణకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ఇవ్వాల (మంగళవారం) మీడియాకు స‌మాచారం అందించారు. ఎవరైన వ్యాపారులు, సంస్థలు, వ్యక్తులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందితే తక్షణమే స్థానిక పోలీసులకు గానీ, టాస్క్ ఫోర్స్ ఏసిపి ఫోన్ నంబర్ 8712670760, ఇన్‌స్పెక్ట‌ర్‌ ఫోన్ నంబర్ 87126 70708 కు సమాచారం అందించాలని కోరారు.

- Advertisement -

ఈ సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామ‌ని, వారికి నగదు పారితోషికం అందజేస్తామని సీపీ ఎల్ సుబ్బ‌రాయుడు తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయాలపై కమిషనరేట్ పోలీసులు ఉక్కుపాదం మోపుతార‌న్నారు. నకిలీ విత్తనాల సరఫరా, విక్రయాల వ్యవహారంలో ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా సంబంధం ఉన్న వ్యాపారులు, వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషనరేట్ వ్యాప్తంగా స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక బృందాలకు చెందిన పోలీసులు నకిలీ విత్తనాల విక్రయాల నియంత్రణకు తనిఖీలను నిర్వ‌హించ‌నున్న‌ట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement