Monday, April 29, 2024

కొవిడ్ న్యూ గైడ్‌లైన్స్ జారీ.. జ్వరం లేకపోతే హోం ఐసోలేషన్ 7 రోజులు చాలు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కోవిడ్-19 బారినపడి పెద్దగా లక్షణాలు లేనివారు లేదా స్వల్ప లక్షణాలతో బాధపడేవారి కోసం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. జ్వరం లేకపోతే బాధితులు 7 రోజుల పాటు హోం ఐసోలేషన్లో ఉంటే సరిపోతుందని, గతంలో మాదిరిగా 14 రోజులు ఉండాల్సిన అవసరం లేదని స్పష్టతనిచ్చింది. అయితే పాజిటివ్‌గా నిర్థారైన తర్వాత బాధితులు కుటుంబ సభ్యులకు దూరంగా, ఇంట్లో ప్రత్యేక గదిలో ఉండాలని సూచించింది. ఆ గదిలో గాలి, వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. ఎప్పుడూ మూడు పొరల మాస్కునే ఉపయోగించాలని, ప్రతి 8 గంటలకోసారి మాస్క్‌ను మార్చుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే 72 గంటల తర్వాత ఉపయోగించిన మాస్క్‌లను ముక్కలుగా కత్తిరించి పడేయాలని స్పష్టం చేసింది.

కుటుంబసభ్యులు ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లాల్సి వస్తే.. ఇద్దరూ ఎన్‌-95 మాస్క్‌ను ఉపయోగించాలని కేంద్రం తెలిపింది. బాధితులు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని, ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలని సూచించింది. రోజుకు మూడు సార్లు వేడి నీటితో గార్గిలింగ్ చేసుకోవడం, ఆవిరి పట్టడం వంటివి చేయాలని సూచించింది. జ్వరం తగ్గకపోతే వైద్యులను సంప్రదించి పారాసిటమాల్‌ ట్యాబ్లెట్లు వేసుకోవాలని పేర్కొంది. శ్వాస స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని, జ్వరం, ఆక్సిజన్‌ స్థాయులను తరచుగా చెక్ చేసుకుంటూ ఉండాలని కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.

చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని, తరచూ ముక్కు, నోటిని తాకడం వంటివి చేయకూడదని తెలిపింది. బాధితులు ఉంటున్న గదిని శుభ్రంగా ఉంచాలని పేర్కొంది. ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో కరోనా బాధితులు ఉపయోగించే వస్తువులను ఇతరులతో పంచుకోకూడదని సూచించింది. బాధితుల అవసరాలను చూసుకునే సంరక్షకులు లేదా కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తలు పాటించాలని, వారి గదికి వెళ్లి వచ్చిన తర్వాత చేతులు, కాళ్లను శుభ్రం చేసుకోవాలని కేంద్రం సూచించింది. బాధితుల వస్తువులను ముట్టుకునేప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోవాలని తెలిపింది.

అవసరమైతే టెలీ-కన్సల్టేషన్‌ ద్వారా వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు వరుసగా 3 రోజుల పాటు జ్వరం రాకపోతే 7 రోజుల తర్వాత ఐసోలేషన్‌ నుంచి బయటకు రావొచ్చని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత మాస్క్‌లు తప్పకుండా ధరించాల్సిందేనని పేర్కొంది. హోం ఐసోలేషన్‌ ముగిసిన తర్వాత ఎలాంటి కరోనా పరీక్షలు అవసరం లేదని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement