Thursday, May 9, 2024

ఒకే దేశం..ఒకే హెల్త్ పాలసీ కావాలి!

దేశంలో వ‌న్ నేష‌న్, వ‌న్ హెల్త్ ఫాల‌సీని కేంద్రం ఎందుకు తీసుక‌రావ‌డం లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలో కరోనా రెండోసారి విజృంభిస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కరోనాపై 2020  ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ కేంద్రాన్ని హెచ్చరించారని గుర్తు చేశారు. అయితే, కేంద్రం చెప్పాపెట్టకుండా లాక్ డౌన్ విధించిందని విమర్శించారు. లాక్ డౌన్ సమయంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉపాధి హామి ఆదుకుందని తెలిపారు. ప్రధానమంత్రి సహాయ నిధి పేరుతో 20 వేల కోట్లు వసూలు చేశారని, రాష్ట్రంలో సీఎం సహాయనిధి పేరుతో 5 వేల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. కరోనా మందుల కోసం ఖర్చుకోసం నిధులు వెచ్చించకుండా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, కేసీఆర్ లకు ఎన్నికలు.. రాజకీయాల మీదనే దృష్టి పెట్టారని మండిపడ్డారు. మూడు రకాల ధరలను నిర్ణయించడంలో మత్లబ్ ఏంటి? అని ప్రశ్నించారు. సామాన్యుడికి రూ. 600 అంటే దోచుకోవడమేనని పేర్కొన్నారు. దేశంలో కరోనా మరణ మృదంగం చేస్తోందన్నారు.

130 కోట్ల మందిని గాలికొదిలేసి.. ఎన్నికల ప్రచారంలో మోదీ మునిగిపోయారని ధ్వజమెత్తారు. దేశంలో తయారైన వ్యాక్సిన్.. పాకిస్థాన్ లో ప్రజలందరికీ ఉచితంగా అందజేస్తున్నారని వ్యాఖ్యానించారు. చిన్న చిన్న దేశాలు తమ ప్రజలకు వ్యాక్సిన్ ఇస్తున్నారని, కానీ భారత్ లో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. ఆక్సిజన్ తయారు చేస్తున్న కంపెనీలను జాతీయ విపత్తు కింద స్వాధీనం చేసుకొని ప్రజలకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ కోసం 35 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించారని, ప్రజలకు రెండు డోసులు ఫ్రీగా ఇచ్చిన రూ. 30 వేల కోట్లే ఖర్చు అవుతాయని వివరించారు.

తెలంగాణలో ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన టిమ్స్ హాస్పిటల్ సిబ్బంది లేరని రేవంత్ అన్నారు. టిమ్స్ లో 38 మంది చనిపోయారని తెలిపారు.శవాల మీద పేలాల మాదిరిగా పీపీఈ కిట్లలో కమీషన్ లు నొక్కేశారని రేవంత్ ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో ఆరోగ్య శ్రీ కింద రూ. 2 లక్షల వైద్య సహాయం పేదలకు కాంగ్రెస్ కల్పించిందని గుర్తు చేశారు. కేంద్రం తరపున కరోనా ట్రీట్మెంట్ కు భరోసా లేదన్నారు. ఆఖరికి దహన సంస్కారాలు చేయడానికి భరోసా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ఏడేళ్లుగా ఐసోలేషన్ లోనే ఉన్నారని విమర్శించారు. కరోనాను ప్రభుత్వం ఆరోగ్య శ్రీలో ఎందుకు కలపడం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ హాస్పిటల్ లలో శవాలను కూడా పీల్చి పిప్పి చేస్తున్నాయని తెలిపారు. వ్యాక్సిన్ ఎగుమతులను పూర్తిగా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలను కేంద్రం జాతీయం చేయాలన్నారు. ఒకే దేశం.. ఒకే పాలసీ ఎందుకు ఉండొదని ప్రశ్నించారు.

తెలంగాణలో 22 మెడికల్ కాలేజ్ లలో 12 వేల బెడ్స్ ఉన్నాయని తెలిపారు. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని.. ఎందుకు చికిత్స ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మంత్రులు మల్లారెడ్డి, ఈటెల, హరీష్ రావు లకు మెడికల్ కాలేజ్ లు ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం లేదని ఆరోపించారు. వైద్యశాఖలో మంత్రికి, డీహెచ్ శ్రీనివాస్ కు పొసగడం లేదన్నారు. మెడిక‌ల్ డైరెక్ట‌ర్ ఓ మాట‌… ఆరోగ్య మంత్రి ఈట‌ల మ‌రో మాట్లాడుతున్నారని, భిన్నమైన స్టేట్ మెంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈటెల తన మంత్రి పదవి కి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హెటేరో డ్రగ్స్ కు మంత్రి కేటీఆర్ కు లావాదేవీలు ఉన్నాయని ఆరోపించారు. అందుకే రెమిడెసివర్ ను బ్లాక్ చేసి అమ్ముతోందని రేవంత్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement