Sunday, May 19, 2024

బ‌డుగు ఓట్ల‌పై కాంగ్రెస్ ఫోక‌స్…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వచ్చే ఎన్నికల్లో అధికారం లోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ.. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మొదటి నుంచి కాంగ్రెస్‌కు దన్నుగా నిలుస్తున్న దళిత, గిరిజన వర్గాలను కాపాడుకుంటూనే.. జనాభాలో సగ భాగం బడుగు, బలహీన వర్గాలకు ‘ చెయ్యి ‘ అందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. జన గణనలో కుల గణన, బీసీ జనాభా మేరకు రిజర్వేషన్ల పెంపు, క్రిమిలేయర్‌ ఎత్తివేత అంశాలు.. బీసీ వర్గాల నుంచి మొదటి నుంచి వినిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేలు.. బీసీల డిమండ్లను కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. అంతే కాకుండా జన గణలో కుల గణన చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. ఇదే విషయంపై మంగళవారం గాంధీభవన్‌ ఆవరణలోని ఇందిరాభవన్‌లో పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు అధ్యక్షతన బీసీల సమావేశం జరిగింది. బీసీలకు రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలు, సందేశాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాల్లి బీసీ వర్గాల్లో చైతన్యం కలిగేలా చూడాలని నిర్ణయించారు. పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకత్వం ఉమ్మడి జిల్లాల వారిగా సమావేశాలు నిర్వహించాలని, జిల్లా నాయకులతో పాటు ఇతర నాయకులు కూడా మండలాలు, నియోజక వర్గ స్థాయిలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకు న్నారు. బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా వీహెచ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయయ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్‌ కలిసి బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పీసీసీ చీఫ్‌గా గత ఎన్నికల్లో 32 మంది బీసీలకు టికెట్లు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో బీసీల్లో ఐక్యత కొరవడిందని టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని, మైనార్టీల రిజర్వేషన్లు తీసేసి బీసీలకు ఇస్తామని చెబుతున్న అమిత్‌షా.. కుల గణన ఎందుకు చేయడం లేదని నిలదీశారు. మైనార్టీల్లో వెనుకబడిన ప్రజలకే రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపారు. బీసీల కుల గణణకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు.

బీసీల కోసం పోరాడే వ్యక్తి వీహెచ్‌ మాత్రమేనని, గతంలో ఆయనకు కూడా అన్యాయం జరిగిందన్నారు. వీహెచ్‌ వెనుకాల ప్రతి ఒక్కరు ఉండాల్సిన అవసరం ఉందని మహేష్‌కుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు. పార్టీలో టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో పాటు జానారెడ్డి, ఉత్తమ్‌కుమారెడ్డి లాంటి నేతలకు ముందే టికెట్‌ ఖరారు అవుతుందని, అదే బీసీల విషయానికి వచ్చేసరికి చివరి నిమిషంలో ప్రకటిస్తారని, దీంతో ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం లేకుండా పోతుందని టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగయ్య యాదవ్‌ అన్నారు. అరు నెలల ముందే సీట్లు ప్రకటిస్తే.. మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్‌ నేత అనంతుల శ్యాంమోహన్‌, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునితారావు, జగదీష్‌, రాజ్‌ఠాకూర్‌, నగేష్‌ ముదిరాజ్‌, లక్ష్మణ్‌యాదవ్‌, రాపోలు జయప్రకాశ్‌, చెవిటి వెంకన్న యాదవ్‌, ఎస్పీ క్రాంతికుమార్‌, మెట్టు సాయికుమార్‌, నూతి శ్రీకాంత్‌గౌడ్‌, కోట్ల శ్రీనివాస్‌, శంభుల శ్రీకాంత్‌గౌడ్‌, యాదగిరిగౌడ్‌, పి. రామ్మోహన్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement