Thursday, April 25, 2024

హైదరాబాద్ శివార్లలో అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీ నోటీసులు, లుక్​ అవుట్​ కోసం 3 జిల్లాల కలెక్టర్లకు ఆదేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగర శివార్లలోని మైనింగ్ జోన్లో చోటుచేసుకుంటున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్లు స్వయంగా వెళ్లి తనిఖీలు జరపాల్సిందిగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అక్రమ మైనింగ్ బాధితులు తెలంగాణకు చెందిన పి. ఇందిరా రెడ్డి, నిఖిల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ కే. రామకృష్ణన్, డా. కె. సత్యగోపాల్‌తో కూడిన చెన్నై ఎన్జీటీ ధర్మాసనం, కేంద్ర పర్యవరణ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, రంగా రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లకు నోటిసలు జారీ చేసింది. విచారణ సందర్భంగా ఆ ప్రాంతంలో అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ధృవీకరించారు.

ఈ క్రమంలో అక్రమ తవ్వాలకాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో తదుపరి విచారణ తేదీ నాటికి చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే అక్రమ మైనింగ్ వల్ల పర్యావరణానికి కలిగిన హానిని అంచనా వెసేందుకు సంయుక్త కమిటీని ధర్మాసనం ఏర్పాటు చేసింది. కమిటీలో కేంద్ర పర్యవరణ శాఖ, తెలంగాణ మైనింగ్ శాఖ, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, రంగా రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లను సభ్యులుగా నియమించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 28కు వాయిదా వేస్తూ, ఆలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement