Saturday, May 4, 2024

కేంద్రంపై ‘వరి’ పోరుకు కేసీఆర్ సిద్ధం.. నేడు ఢిల్లీకి సీఎం పయనం

కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై పోరుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఢిల్లీలో రాజకీయంగా దండయాత్ర చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. బీజేపీ ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు, భారతదేశం దృష్టిని ఢిల్లీ వైపు మళ్లించేందుకు కేసీఆర్ పర్ఫెక్ట్ స్కెచ్‌తో నేడు న్యూఢిల్లీ వెళ్తున్నారు. తెలంగాణలో పండిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పంజాబ్‌ తరహాలో ఎఫ్‌సీఐ ద్వారా మొత్తం సేకరించాలనే డిమాండ్‌తో మరోసారి టీఆర్ఎస్ సర్కార్ పోరు బాట పట్టనుంది. రాష్ట్రంలో ఆందోళనలు, పార్లమెంటులో నిరసనలు, ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులతో భేటీ ద్వారా కేంద్రంపై ఒత్తిడికి సన్నద్ధమైంది. ఈ మేరకు ప్రధాని, కేంద్రమంత్రులను కలిసేందుకు సీఎంవో అనుమతి కోరింది.

మరోవైపు వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసనకు రూపకల్పన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దీనిపై మంత్రులతో చర్చించేందుకు ఎర్రవల్లిలో నిన్న అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రంపై పోరుకు సంబంధించి అన్ని వివరాలను మంత్రులకు తెలియజేసి సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

ఇవాళ టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులను కలిసి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేయనున్నారు. రాష్ట్రంలో జరిగే ఆందోళనలకు అనుగుణంగా లోక్‌సభలో, రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసనలు చేపట్టనున్నారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పంజాబ్ రాష్ట్రం నుంచి 100 శాతం వరి ధాన్యాన్ని సేకరిస్తున్నందున, తెలంగాణలో 100 శాతం ధాన్యాన్ని ఎఫ్‌సిఐ సేకరించాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement