Friday, April 26, 2024

దళిత బంధు పథకం ఉద్దేశం ఏంటి? హుజురాబాద్ ప్రజలకు వివరించనున్న కేసీఆర్

తెలంగాణలో హుజురాబాద్ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయి. ఓవైపు  హుజూరాబాద్ ఉపఎన్నిక, మరోవైపు సీఎం కేసీఆర్ ప్రకటించన దళిత బంధు పథకం గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉపఎన్నికల జరుగుతున్న హుజూరాబాద్ నుంచే దళిత బంధు పథకాన్ని ప్రారంభం అవుతుందని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో జులై 26న దళిత బంధుపై ప్రగతి భవన్‌లో అవగాహన సదస్సు జరగనుంది. పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణపై హుజూరాబాద్‌కు చెందిన దళిత సామాజికవర్గం ప్రజలకు సీఎం కేసీఆర్ అవగాహన కల్పించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ అవగాహన సదస్సుకు హుజూరాబాద్ నుంచి 412 మంది దళితులు హాజరు కానున్నారని సమాచారం.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు కలిపి నలుగురికి ఆహ్వానం అందింది. అలాగే ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున సీఎంతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. మొత్తంగా 412 మంది దళిత పురుషులు, మహిళలు సదస్సుకు హాజరవుతారు. దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి? అనే అంశాలపై వారికి సీఎం కేసీఆర్ స్వయంగా అవగాహన కల్పిస్తారు.

దళిత బంధు అవగాహన సదస్సుకు హాజరయ్యే వారంతా జులై 26న ఉదయం 7 గంటల్లోపు తమ గ్రామాల నుంచి మండల కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ టిఫిన్ చేసిన తర్వాత ప్రత్యేక బస్సుల్లో హుజూరాబాద్ కేంద్రానికి వెళ్తారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. అనంతరం సీఎం కేసీఆర్ వారితో సమావేశం అవుతారు.

దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా మొదట హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన ప్రకారమే తెలంగాణ దళిత బంధు పథకం 1200 కోట్లతో అమలవుతుందని సీఎం కేసీఆర్ ఇటీవల తెలిపారు. అయితే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తంగా దళిత బంధు పథకం నిబంధనల ప్రకారం అమలవుతుందని చెప్పారు. హుజురాబాద్ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గానికి చెందిన దళిత ప్రజలతో సమావేశం కానుండడం ఆసక్తి రేపుతోంది.

ఇది కూడా చదవండిః అభివృద్ధి కావాలంటే ఉప ఎన్నికే మార్గామా?

Advertisement

తాజా వార్తలు

Advertisement