Friday, May 10, 2024

లతా జీ మరణంతో పాట మూగ బోయింది: గాన కోకిల మృతిపై సీఎం కేసీఆర్ విచారం

ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు తన పాటతో భారతీయ సినీ సంగీత రంగంపై చెరగని ముద్ర వేశారని అన్నారు. ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. భారత దేశానికి లతా మంగేశ్వర్ ద్వారా గాంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం అని చెప్పారు. లతా జీ మరణంతో పాట మూగ బోయినట్లైందని, సంగీత మహల్ ఆగిపోయిందని విచారం వ్యక్తం చేశారు.

‘’20 భాషల్లో 1000 సినిమాల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన లతా జీ సరస్వతీ స్వర నిధి. వెండితెర మీది నటి హావభావాలను అనుగుణంగా ఆ నటియే స్వయంగా పాడుతుందా అన్నట్టు తన గాత్రాన్ని అందించిన లతాజీ గొప్ప నేపథ్యగాయని. సినీ నిర్మాతలు మొదట హీరో హీరోయిన్లను ఖరారు చేసుకుని సినిమా నిర్మాణం ప్రారంభిస్తారు, కానీ, సింగర్ గా లతా జీ సమయం ఇచ్చినంకనే సినిమా షూటింగ్ ప్రారంభించే వారంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. పాటంటే లతా జీ.. లతా జీ అంటే పాట. సప్త స్వరాల తరంగ నాదాలలో శ్రోతలను తన్మయత్వంలో వోలలాడించిన లతా మంగేశ్వర్, ఉత్తర దక్షినాదికి సంగీత సరిగమల వారధి. హిందుస్థానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ వద్ద నేర్చుకున్న లతాజీ.. ఉర్దూ కవుల సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వలన, తన గాత్రంలో ఉర్దూ భాషలోని గజల్ గమకాల సొబగులను లాతాజీ గాత్రం వొలికించేది. కొందరికి పురస్కారాల వల్ల గౌరవం వస్తే, దేశ విదేశాల వ్యాప్తంగా ఆమెకు అందిన లెక్క లేనన్ని పురస్కారాలకు లతా జీ వల్ల గౌరవం దక్కింది. ఎందరో గాయకులు రావచ్చు కానీ లతా జీ లేని లోటు పూరించలేనిది” అని సీఎం స్మరించుకున్నారు. లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement