Saturday, May 4, 2024

Remand Report: నేరం ఒప్పుకున్న సీఐ నాగేశ్వరరావు.. సీసీ టీవీ ఫుటేజీలో ఆధారాల సేకరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వివాహితపై అత్యాచారం, కిడ్నాప్‌ కేసులో అరెస్టు అయిన మారేడ్‌పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు పోలీసుల విచారణలో నేరం చేసినట్లు అంగీకరించాడు. నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ రిపోర్ట్‌లో అనేక కీలకకాంశాలతో పాటు కొన్ని ఆసక్తికర అంశాలు కూడా ఉన్నాయి. కేసులో మొత్తం 17 మంది సాక్షుల వాంగ్మూలాలను సేకరించినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపారు.
సీఐ సర్వీస్‌ రివాల్వర్‌తో పాటు పోలీస్‌ యూనిఫాంను సేకరించామని తెలిపారు.

నాగేశ్వరరావు తన సర్వీస్‌ రివాల్వర్‌తో బెదరించి వివాహితపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆమె భర్తను కూడా కిడ్నాప్‌కు యత్నించారని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. బాధితురాలి ఇంట్లోకి నాగేశ్వరరావు బలవంతంగా చొరబడ్డారని, బాధితురాలి భర్త బలవంతంగా ఇంటి తలుపులు తెరిచాడని, దీంతో నాగేశ్వరరావు బాధితురాలి భర్తను కూడా తన సర్వీస్‌ రివాల్వర్‌తో బెదరించి కిడ్నాప్‌కు ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి నుంచి 161 సీఆర్‌పీసీ కింద స్టేట్‌మెంట్‌ రికార్డు చేశామని రిపోర్ట్‌లో తెలిపారు. బాధితురాలికి వైద్య పరీక్షలను కూడా నిర్వహించామని పేర్కొన్నారు.

బాధితురాలి గదిలో వెంట్రుకలు, దుప్పటి, గాజులు తదితర వస్తువులను క్లూస్‌ టీం స్వాధీనం చేసుకుంది. బాధితురాలిపై సీఐ నాగేశ్వరరావు అత్యాచారానికి పాల్పడుతున్న సమయంలో ఇంట్లోకి వచ్చిన ఆమె భర్త కర్రతో సీఐపై దాడికి పాల్పడ్డాడు. ఆ కర్రను కూడా క్లూస్‌ టీం స్వాధీనం చేసుకుంది. అత్యాచార సమయంలో బాధితురాలి దుస్తులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. బాధితురాలితో పాటు ఆమె భర్తను సీఐ తన కారులో బలవంతం ఎక్కిస్తున్న దృశ్యాలు, కారులో తీసుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి పరిశీలించారు.

బాధితురాలి ఇంటి సమీపంలో ఉన్న ఎలక్ట్రిక్‌ షాపులోని సీసీటీవీ పుటేజీని పోలీసులు సేకరించారు. ఇబ్రహీంపట్నం మార్గంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నాగేశ్వరరావు కారు వెళ్ళినట్లు రికార్డు కావడంతో ఆ సీసీటీవీ పుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకువాడిన కారు, బాధితురాలి సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశారు. బాధితురాలి ఇంట్లో నుంచి అకస్మాత్తుగా అరుపులు, కేకలు వినిపించాయని, ఏం జరిగిందో తెలుసుకునే లోపల కారులో వెళ్ళిపోయారని ఇరుగు పొరుగు నుంచి పోలీసులు వాంగ్మూలాన్ని సేకరించారు.

బాధితురాలిని, ఆమె భర్తను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్తుండగా ఇబ్రహీంపట్నం వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు నాగేశ్వరరావు తాను ఆక్టోపస్‌ అధికారినని, కానిస్టేబుల్‌తో కలిసి వెళ్తుండగా కారు ప్రమాదం జరిగిందని తప్పుడు సమాచారం ఇచ్చారు. కారు ప్రమాదంపై అతని వద్ద పని చేసే హోంగార్డుకు సమాచారం ఇవ్వడంతో అతను ట్రోయింగ్‌ వాగనం ద్వారా కారును చంపాపేట్‌కు తరలించాడు. దీంతో హోంగార్డు ప్రవీణ్‌ స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డు చేశారు.

- Advertisement -

అత్యాచార ఘటన తర్వాత ప్రమాదానికి గురైన కారును వదిలేసి ఇంటికి వచ్చిన నాగేశ్వరరావు తన దుస్తులను తానే స్వయంగా ఉతుక్కున్నాడు. తర్వాత ఏమీ తెలియదన్నట్లు మారేడ్ప్‌ల్లి పీఎస్‌కు వెళ్లి విధులు నిర్వహించాడని పోలీసులు ఆధారాలను సేకరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని మారేడ్‌పల్లి ఠాణాలోనే రివాల్వర్‌ ఉంచి బెంగళూరుకు పరారయ్యాడు. కొత్తపేటలోని గ్రీన్‌హిల్స్‌ కాలనీలో అతని నివాసంలో సోదాలను నిర్వహించి పోలీసులు అత్యాచార శమయంలో వాడిన ప్యాంట్‌, షర్టు, లోదుస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో పోలీసులకు లొంగిపోయిన సీఐని అరెస్టు చేసి వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, కోవిడ్‌ పరీక్షలు , లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించిన అనంతరం హయత్‌నగర్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement