Sunday, April 28, 2024

మెడికల్‌ సీట్ల బ్లాకింగ్‌కు చెక్‌… మాప్‌రౌండ్‌ తర్వాత అదనంగా మరో రెండు రౌండ్ల కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎంబీబీఎస్‌, పీజీ మెడికల్‌ సీట్ల బ్లాకింగ్‌ దందాకు చెక్‌ పెట్టేందుకు వైద్య, విద్య విభాగం సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోంది. వచ్చే ఏడాది నుంచి మెడికల్‌ సీట్ల బ్లాకింగ్‌కు అవకాశం ఇవ్వకుండా అదనపు మాప్‌ అప్‌ రౌండ్‌ కౌన్సిలింగ్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. రాబోయే కొత్త నిబంధన ప్రకారం మొదటి, రెండో విడత కౌన్సిలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు మాప్‌ అప్‌ రౌండ్‌లో పాల్గొనేందుకు అనర్హులు. అయితే ఇప్పటి వరకు మొదటి, రెండో విడత మెడికల్‌ సీట్ల కౌన్సిలింగ్‌లో సీటు వచ్చిన అభ్యర్థులు కూడా మాప్‌ రౌండ్‌ కౌన్సిలింగ్‌లో పాల్గొంటున్నారు. మొదటి, రెండో విడత కౌన్సిలింగ్‌లో సీట్లు పొందిన వారిని తదుపరి రౌండ్‌ కౌన్సిలింగ్‌కు అనుమతించొద్దన్న సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ప్రకటించింది. అప్పటి వరకు జరిగిన కౌన్సిలింగ్‌లో సీట్లు రాని మెడికోలనే ఇక మీదట మాప్‌ రౌండ్లోకి అనుమతించనున్నారు.

ఇటీ వల జరిగిన పీజీ మెడికల్‌ సీట్ల కౌన్సిలింగ్‌లో తెలంగాణలోని పలు ప్రయివేటు మెడికల్‌ కాలేజీలు సీట్ల బ్లాకింగ్‌కు పాల్పడిన విషయం విధితమే. ఈ విషయమై కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వరంగల్‌ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి సీట్ల బ్లాకింగ్‌ దందాకు అటు కాలేజీ యాజమాన్యాలకు, ఇటు విద్యార్థులకు అవకాశంఇవ్వకుండా తుదివిడత మాప్‌రౌండ్‌కు అదనంగా మరో విడత కౌన్సిలింగ్‌ను నిర్వహించారు. ఈ ఏడాది పీజీమెడికల్‌ మాప్‌అ ప్‌ రౌండ్‌ కు అధనంగా మరో రెండు విడతల కౌన్సిలింగ్‌ను నిర్వహించాలని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ నిర్ణయించింది. సాధారణంగా ఎంబీబీఎస్‌, పీజీ మెడికల్‌ సీట్ల భర్తీలో మాప్‌అప్‌రౌండ్‌ కౌన్సిలిం గ్‌ మాత్రమే చివరిది. అయితే చాలా మంది విద్యార్థులు మాప్‌అప్‌ రౌండ్‌ కౌన్సిలింగ్‌లో దరఖాస్తు చేసి కౌన్సిలింగ్‌కు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సీట్ల బ్లాకింగ్‌ దందా ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో ఈ విషయంపై అటు ప్రభుత్వం, ఇటు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీపై తీవ్ర విమర్శలు చెలరేగడంతో పలు ప్రయివేటు మెడికల్‌ కాలేజీలు స్వచ్ఛందంగా కొన్ని పేమెంట్‌ సీట్లను వెనక్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సీట్లను భర్తీ చేసేందుకుగాను మరో రెండు విడతల అదనపు కౌన్సిలింగ్‌ను యూనివర్సిటీ నిర్వహించింది. కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలోని దాదాపు 120 పీజీ మెడికల్‌ సీట్ల భర్త్తీకి కౌన్సిలింగ్‌ నిర్వహించింది. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగొద్దన్న ఉద్దేశ్యంతోనే యూనివర్సిటీ చరిత్రలో మొదటిసారి తుది విడత మాప్‌ రౌండ్‌ ముగిసినప్పటికీ అదనపు రౌండ్‌ కౌన్సిలింగ్‌ను నిర్వహించామని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డా. కరుణాకర్‌రెడ్డి తెలిపారు.

కాగా.. అదనపు మాప్‌అప్‌ రౌండ్‌ కౌన్సిలింగ్‌లోనూ తక్కువ ర్యాంకులు వచ్చిన వారికి సీట్లు ఇచ్చారని పీజీ మెడికోలు ఆరోపిస్తున్నారు. కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌ రౌండ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించినా ఇంకా కొంత మంది పీజీ మెడికోలు మిగిలిపోయారరు. సీట్లు పొందిన చాలా మంది పీజీ మెడికోలు తమకు నచ్చని కాలేజీలోనూ సీటును తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో అదనపు మాప్‌అప్‌ రౌండ్‌ కౌన్సిలింగ్‌ను మరింత పకడ్బంధీగా నిర్వహించాలని పీజీ మెడికోలు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement