Monday, May 6, 2024

జనవరిలో పెరగనున్న కార్ల ధరలు.. కంపెనీలపై ఇన్‌పుట్‌ వ్యయాల భారం..

న్యూఢిల్లీ : ఇన్‌పుట్‌ వ్యయాలు అంతకంతకూ పెరుగుతుండడంతో టాటా మోటార్స్‌, హోండా, రెనాల్ట్‌ వంటి కంపెనీలు వాహనాల ధరలు పెంచాలని నిర్ణయించాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి ధరల పెంపును ఆచరణలోకి తీసుకురావాలని కంపెనీలు యోచిస్తున్నాయి. ఇప్పటికే దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ, లగ్జరీ కార్ల తయారీ సంస్థలు ఆడీ, మెర్సిడెస్‌ బెంజ్‌ వాహన ధరల పెంపును ప్రకటించాయి. జనవరిలో ధరలు పెంపు ఉంటుందని స్పష్టం చేశాయి. జనవరిలో ధరల పెంపు ఉంటుందని, మోడళ్లను బట్టి ధరల పెంపు ఉంటుందని మారుతీ సుజుకీ తెలిపింది. ఎంపిక చేసిన మోడళ్లపై 2 శాతం వరకు ధరల పెంపు ఉంటుందని మెర్సిడెస్‌ బెంజ్‌ పేర్కొంది. వాహనాల ఫీచర్లు పెరడంతోపాటు ఇన్‌పుట్‌ వ్యయాలు కూడా ఎక్కువవ్వడం ధరల పెంపునకు కారణమని బెంచ్‌ వివరించింది. మరోవైపు ధరలపెంపు జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వస్తుందని ఆడీ కంపెనీ తెలిపింది. ఇన్‌పుట్‌ వ్యయాలు, కార్యకలాపాల ఖర్చులు పెరడంతో అన్ని రేంజ్‌ మోడళ్లపై 3 శాతం వరకు ధరల పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

పరిస్థితుల వల్ల అనివార్యం : టాటామోటార్స్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ శైలేష్‌
ధరల పెంపుపై సంప్రదించగా టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర స్పందించారు. వస్తువులు, ముడిసరుకులు, ఇతర ఇన్‌పుట్‌ వ్యయాల పెరుగుదల కొనసాగుతూనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్‌లో తగిన స్థాయిలో పాక్షికంగానైనా ధరల పెంపు అనివార్యమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా టాటా మోటార్స్‌ కంపెనీ పంచ్‌, నెగ్జాన్‌, హారియర్‌ వంటి మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. మరోవైపు హోండా కార్స్‌ ఇండియా కూడా ఇటివలే ధరల పెంపును ప్రకటించింది. ఇన్‌పుట్‌ వ్యయాల పెరుగుదలే ఇందుకు కారణమని పేర్కొంది. ముడిసరుకుల ధరలు పెరిగిపోవడం ఇన్‌పుట్‌ వ్యయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. సిటీ, అమేజ్‌ వంటి మోడళ్లను తయారు చేస్తే హోండాకార్స్‌ ఈ ఏడాది ఆగస్టులోనే ధరలను పెంచింది. స్టీల్‌, అల్యూమినియం, కాపర్‌, ప్లాస్టిక్‌, విలువైన మెటల్స్‌ ధరలు గతేడాది కాలంలో భారీగా పెరిగిపోవడం కంపెనీలపై ప్రభావం చూపుతోంది. ఇన్‌పుట్‌ వ్యయాలతోపాటు రవాణా ఛార్జీలు కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వాహనతయారీ కంపెనీలు చెబుతున్నాయి. ధరల పెంపునకు ఇదే కారణమంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement