Saturday, May 18, 2024

బడ్జెట్‌ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం.. పలు బిల్లులు, ఆర్డినెన్స్ లపై చర్చ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సంక్షేమమే ఎజెండాగా రూపొందించిన రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సోమవారంనుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రిమండలి సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా బడ్జెట్‌ ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. 2022-23 వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించిన అనంతరం శాసనసభలో వ్యవహరించాల్సిన వ్యూహంతోపాటు, గవర్నర్‌ ప్రసంగం లేకుండా నిర్వహిస్తున్న సమావేశాల్లో తాజా పరిణామాలు, గవర్నర్‌ మీడియా ప్రకటన వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఈఎం కేసీఆర్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గానికి దిశానిర్ధేశం చేశారు. రానున్న ఆర్ధిక యేడాదిలో ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాలను వివరించేందుకు సిద్దంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా దళితబంధు, పేదలకు ఇండ్ల నిర్మాణానికి సాయం, ఉద్యోగ భర్తీ వంటివాటితోపాటు ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలను సీఎం కేసీఆర్‌ మంత్రివర్గానికి వివరించినట్లు తెలిసింది. గవర్నర్‌ తమిళిసై తన ప్రసంగం లేకపోవడంపై లేవనెత్తిన అంశాలు, ఆమె వ్యక్తం చేసిన అసంతృప్తిపై కూడా మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం.

బడ్జెట్‌తోపాటు శాసనసభ, మండలిలలో ఆర్డినెన్స్‌ల స్థానంలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలిపారు. సమావేశంలో ప్రధానంగా కరోనా ప్రతికూలతల ప్రభావం, రాష్ట్ర ఆర్ధిక వ1ద్దిరేటు, తలసరి, సంపద వృద్ధిలో తెలంగాణ ఎదిగిన తీరుపై మంత్రిమండలి చర్చించి, సమావేశాల్లో ప్రజలకు వీటిని వివరించేలా సిద్దం కావలనే కోణంలో చర్చించినట్లు తెలిసింది. తగ్గిన గ్రాంట్లు, కేంద్ర సాయాలు, వితరణ నిధులు, పల్లె, పట్టణ ప్రగతి అమలుకు చర్యలు, ఇందుకు కేటాయించిన నిధులపై చర్చించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను, ప్రజా సంక్షేమ పథకాలు, ఇరిగేషన్‌, వ్యవసాయ రంగాలపై సీఎం కేసీఆర్‌ తన వైఖరిని వెల్లడించినట్లు తెలిసింది. ప్రధానంగా దళితబంధు పథకాన్ని నియో.వకర్గానికి 100మందికి అందించేలా తీసుకోవాల్సిన చర్యలపై పలు జాగ్రత్తలు సూచించినట్లు సమాచారం.

వాస్తవిక రాబడులు, బడ్జెట్‌ ప్రతిపాదనలలో భారీగా అంతరాలు పేర్కొంటూ, లోటును పూడ్చేందుకు పన్నుల సహేతుక విధానాలు, తీసుకురానున్న పెంపుదలల వర్తింపు అంశాలను వెల్లడించినట్లు సమాచారం. పన్నుల పెంపుతోపాటు, భూముల విక్రయాలు, రుణాల వంటి అంశాలు చర్చించి ఆమోదించారు. సుమారు రూ. 2.60 లక్షలనుంచి రూ. 2.70 లక్షల కోట్ల నడుమ బడ్జెట్‌ ఉండనుందని తెలిసింది. టీఆర్‌ఎస్‌ ప్రముఖంగా ప్రస్తావించిన 2018 ఎన్నికల హామీగా పేర్కొన్న రైతు రుణమాఫీకి రూ. 24వేల కోట్లు అవసరమవుతాయని అంచనాలునా వేయగా, ఈ ఏడాది బడ్జెట్‌లో అంతేమొత్తంగా కేటాయింపులు చేస్తున్నారని తెలిసింది. సామాజిక పించన్లకుగానూ వయో పరిమితి అర్హత వయసును 57ఏళ్లకు తగ్గించడంతో అదనంగా 12 లక్షల మందికి ఈ పథకం వర్తించనుంది. దీంతో ఈ బడ్జెట్‌లో గత పద్దుకు అదనంగా రూ. 2500కోట్లను పెంచుతూ కేటాయింపులు చేస్తున్నారు. రైతు బందుకు రూ. 18వేల కోట్లు, జీత భత్యాలకు రూ. 50వేల కోట్లు, సబ్సిడీలకు రూ.20వేల కోట్లు, అప్పులపై వడ్డీలకు రూ. 15వేల కోట్లు, రైతు బీమా, ఉపకార వేతనాలు, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మిలకు రూ. 19వేల కోట్లు, విద్యుత్‌ రాయితీలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమానికి , విద్యకు, హోంశాఖకు, ఈ ఏడాదినుంచి అదనంగా పట్టణ ప్రగతికి రూ. 1500కోట్లు తప్పనిసరి కేటాయింపులతో జరిగిన బడ్జెట్‌ కూర్పుకు ఆమోదం తెలిపారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను పెంపు, విద్యుత్‌ టారిఫ్‌ పెంపుతో డిస్కంలకు చెల్లించాల్సిన భారీ మొత్తాలనుంచి ఉపశమనం పొందడం, భూముల మార్కెట్‌ విలువల సవరణతో రూ. 4 వేల కోట్లు అదనంగా రావొచ్చని, భూముల విక్రయాలతో రూ. 30 వేల కోట్లు లక్ష్యంగా ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement