Monday, May 6, 2024

ఆర్నెళ్ల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు – హ్యాట్రిక్ విజ‌యం కోసం కెసిఆర్ వ్యూహాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్‌ విజయం సాధిచాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధినేత కె.చంద్రశేఖరరావు, ఆ దిశగా పార్టీ యంత్రాంగాన్ని ముందుకు నడిపించేందుకు తనదైన శైలిలో కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే అత్యవసరంగా బుధవారం (ఈ నెల 17న) బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ, లెజిస్లేచర్‌ మీటింగ్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2గంటలకు జరుగనున్న ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ, లోక్‌సభ సభ్యులంతా విధిగా పాల్గొనాలని ఆదేశాలిచ్చా రు. పార్టీ సంస్థాగత అభివృద్ధి, గెలుపు కోసం అనుసరిం చాల్సిన వ్యూహాలపై అందరి అభిప్రాయాలు తెలుసు కుని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం మాత్రమే ఉండడంతో నియోజక వర్గాల్లో పెండింగ్‌లో ఉన్న
అభివృద్ధి పనులు, గత ఎన్నికల్లో ప్రధానంగా ఇచ్చిన హామీల అమలు తదితర అంశాలపై వ్యూహరచన చేయనున్నారు. ప్రత్యేక నిధులు కేటాయించి చేపట్టాల్సిన కార్యక్రమాలను గురించి ఎమ్మెల్యేలకు అధినేత కేసీఆర్‌ ఈ సందర్భంగా మార్గనిర్ధేశం చేయనున్నారు.

తస్మాత్‌ జాగ్రత్త!
విపక్షాల వ్యూహాలను తిప్పికొట్టి పైచేయి సాధించేందుకు ఇప్పటికే పలుసార్లు రాజకీయ మేధావులతో మధనం నిర్వహించిన సీఎం కేసీఆర్‌, తాజాగా పొరుగు రాష్ట్రం కర్నాటక ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రావడంతో కేడర్‌ను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు. ఒక్కోసారి రాజకీయ వ్యూహాలు బెడిసికొట్టే ప్రమాదం కూడా ఉండడంతో అన్ని కోణాల్లో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కర్నాటక ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలతో మమేకమవుతూ నిత్యం వ్యూహాత్మక కార్యాచరణను అమలు చేయాలని కేసీఆర్‌ సూచించే అవకాశాలు ఉన్నాయి.

పరిస్థితులను చక్కబెట్టుకునేందుకు ప్రణాళిక
బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల సమావేశంలో కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్న దానిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. మొన్నటిదాకా ఇలా ప్రజాప్రతినిధులు లేదా కార్యవర్గ సమావేశం ఏర్పాటు- చేస్తే ముందస్తు ఎన్నికల గురించి ఏమైనా చెబుతారేమో అనుకునేవారు. అయితే ఇప్పుడు ఆ సమయం దాటిపోయింది. వచ్చే ఆరు నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయి కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఏ కోణంలో చూసినా ఎన్నికలకు ఇంకా ఆరు నెలలకు మించి సమయం ఉండడంతో ఇక పూర్తిస్థాయిలో నియోజకవర్గాల్లోనే ఉండి పరిస్థితులను చక్కబెట్టుకోవాలని, ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం ఏమైనా ఉంటే స్పష్టంగా చెప్పాలని ఎమ్మెల్యేలకు సీఎం అడుగనున్నారు.

ఏం చెబుతారోనని కొందరు ఎమ్మెల్యేల్లో ఆందోళన
ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలన్న దానిపై ప్రజా ప్రతినిధులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత కొన్నిసమావేశాల్లో కొంత మంది ఎమ్మెల్యేల తీరుపై కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దళిత బంధు పథకాల్లో నిధులు కూడా.. పేదల వద్ద నుంచి కమిషన్లకు తీసుకుంటు-న్నారని వారి చిట్టా తన దగ్గర ఉందని మండిపడ్డారు. అదంతా బయటకు రావడంతోనే సంచలనం అయింది. ఇప్పుడు అలాంటి ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టి.. ఇక టిక్కెట్‌ లేదని చెబుతారేమోనన్న అభిప్రాయం వినిపిస్తోంది.

6 నెలల కాలానికి ప్రత్యేక కార్యాచరణ
పార్టీ అభ్యర్థులను కొంతకాలంగా గులాబీ దళపతి కేసీఆర్‌ ఖరారు చేస్తున్నారు. అనధికారికంగా వారికి సమాచారం ఇచ్చి.. పని చేసుకోమని చెబుతున్నారు. ఇప్పుడు ఆ అభ్యర్థులందరికీ క్లారిటీ- ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే కొంత మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు- ఇవ్వడం లేదన్న సమాచరం పంపారని అంటు-న్నారు. వచ్చే ఆరు నెలల పాటు- ప్రజల్లో ఉండేలా ప్రత్యేకమైన కార్యక్రమాలకు కేసీఆర్‌ రూపకల్పన చేశారని.. వాటిని ఇంప్లిమెంట్‌ చేసేలా.. అందరికీ సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇస్తారని భావిస్తున్నారు.

- Advertisement -

గెలుపు కోసం ఉద్యమ స్పూర్తితో మరోసారి ప్రజల్లోకి..
కేసీఆర్‌ పక్కాగా ఎన్నికలకు రెడీ అవుతున్నారు. గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు ఎంత పక్కాగా అన్ని సిద్ధం చేసుకుని ఎన్నికలకు వెళ్లారో అలాంటి ఏర్పాట్లు- చేసుకున్నారు. అయితే ఎమ్మెల్యేలు, అభ్యర్థుల విషయంలో మాత్రం ఈ సారి మరింత సహకారం అవసరం ఉంది. గతంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను ఇద్దరు, ముగ్గుర్ని తప్ప మార్చలేదు. కానీ ఈసారి మాత్రం భారీగా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇది వర్గ పోరాటానకి దారి తీస్తుంది. అందుకే వీలైనంత వరకూ.. టిక్కెట్లు- రాని వారికి మరో విధంగా అవకాశాలు కల్పిస్తామని కేసీఆర్‌ భరోసా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement