Tuesday, May 21, 2024

అదనపు టిక్కెట్ ఛార్జీలు వసూలు చేసినందుకు జరిమానా

హైదరాబాద్: సినిమా టిక్కెట్ల విషయంలో ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీల పేరుతో ప్రేక్షకుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్న బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్‌కు జిల్లా వినియోగదారుల ఫోరం కొరడా ఝళిపించింది. సినిమా టిక్కెట్‌ ధరపై అదనంగా డబ్బులు వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త విజయ్‌ గోపాల్‌ 2019 జనవరి నెలలో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. అన్ని ఆధారాలు పరిశీలించిన కమిషన్ 25 నెలల నిరీక్షణ తర్వాత తుదితీర్పు వెలువరించింది.

విజయ్ గోపాల్ పీవీఆర్ సినిమాస్‌లో సినిమా చూసేందుకు బుక్ మై షో ద్వారా టిక్కెట్ బుక్ చేశారు. అయితే ఇంటర్నెట్‌ హ్యాండిలింగ్‌ ఛార్జీల పేరిట రూ.41.78 వసూలు చేయడంతో ఆగ్రహానికి గురయ్యారు. టిక్కెట్‌ ధరపై సుమారు 18శాతం ఛార్జ్ వసూలు చేయడంపై ఆయన జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. దీనిపై వివరణ అందించిన బుక్ మై షో సంస్థ.. ఫిర్యాదుదారుడు చెప్పినవి నిరాధారమంటూ తెలుపుతూ కేసును కొట్టివేయాలని కమిషన్‌ను కోరింది. విచారణ జరిపిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌-3 అధ్యక్షుడు నిమ్మ నారాయణ, సభ్యురాలు సీ.లక్ష్మీప్రసన్నతో కూడిన బెంచ్‌ ఫిర్యాదుదారుడి వాదనలతో ఏకీభవించింది. దీంతో విజయ్‌గోపాల్‌కు రూ.25వేలు పరిహారం, కేసు ఖర్చుల కింద మరో రూ.1000 చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది. రూ.5వేలు లీగల్‌ ఎయిడ్‌ కింద కోర్టుకు చెల్లించాలని బుక్‌ మై షో, పీవీఆర్‌ సినిమాస్‌ను ఆదేశించింది. 45 రోజుల వ్యవధిలో ఈ డబ్బులు చెల్లించాలని.. లేనిపక్షంలో తీర్పు వెలువడిన కాలం నుంచి 18శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

అయితే టిక్కెట్ ధరపై రూ.6 అదనంగా వసూలు చేసుకోవచ్చని జిల్లా కమిషన్ తెలిపిందని… దీనిపై తాను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో సవాల్ చేస్తానని సామాజిక కార్యకర్త విజయ్ గోపాల్ తెలిపారు. తాను తెలుసుకున్న పూర్తి సమాచారం ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు ఛార్జీల వసూలుపై అనుమతులు ఇవ్వలేదని ఆయన స్సష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement