Saturday, May 4, 2024

Ts | రక్తమోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజీ పినపాక వద్ద దైవ దర్శనానికి బాసర వెళ్లి తిరిగి వస్తున్న కారును లారీ ఢీకొన్న ఘటనలో రెండేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం వాజ్యానాయక్‌ తండాకు చెందిన ఓ వైద్యుడు.. పిల్లలకు బాసరలో అక్షరాభ్యాసం చేయించేందుకు కుటు-ంబంతో కలిసి వెళ్లారు. కల్లూరులో దంత వైద్యుడిగా పని చేస్తున్న నవీన్‌.. తన కుమారుడు కార్తికేయకు అక్షరాభ్యాసం చేయించారు. బాసరలో భార్య అంజలి, కుమార్తె శ్రీవల్లితో కలిసి పూజల్లో పాల్గొన్నారు. వీరితో పాటు- నవీన్‌ మామ రాంబాబు, మరో ఐదుగురు కలిసి మొత్తం 10 మంది బాసర వెళ్లారు. కల్లూరు నుంచి కారులో ఖమ్మం వెళ్లిన వీరంతా బంధువుల ఇంట్లో కారు వదిలి రైలులో బాసర వెళ్లారు.

ఈ నెల 7న వెళ్లిన ఆ కుటుంబం 8న అర్ధరాత్రి ఖమ్మంలో రైలు దిగారు. అక్కడి నుంచి బంధువు ఇంటికి వెళ్లి అక్కడే బస చేశారు. తెల్లవారిన తర్వాత బంధువుల ఇంట్లో కాసేపు సరదాగా గడిపి.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తమ కారులో బయలుదేరారు. పది మందిలో వైద్యుడు నవీన్‌, మరో వ్యక్తి బస్సులో బయలుదేరగా మిగతా వాళ్ళంతా కారులో వస్తున్నారు. వైరా దాటగానే మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వైద్యుడు నవీన్‌ మామ రాంబాబు, భార్య అంజలి, కుమార్తె శ్రీవల్లి అక్కడికక్కడే మృతి చెందారు.

- Advertisement -

ఘటనకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తండావాసులకు సమాచారం తెలియడంతో వారంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుని ఉన్న రాంబాబు మృతదేహం, రహదారి పక్కన ఉన్న తల్లీబిడ్డలు అంజలి, శ్రీవల్లి మృతదేహాలు చూసి కన్నీటి పర్యంతమయ్యారు. బస్సులో వస్తున్న వైద్యుడు నవీన్‌ విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చాడు. విగతజీవులుగా పడి ఉన్న భార్య, కుమార్తె, మామ, గాయాలతో ఉన్న కుమారుడిని చూసి గుండెలవిసేలా రోదించాడు. వైరా ఏసీపీ రెహమాన్‌, సీఐ సురేశ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం ఐదుగురు దుర్మరణం చెందారు. చావులోనూ బంధాన్ని వీడలేదు ఓ జంట. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందారు. ద్విచక్ర వాహనం-లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. మరిపెడ మండల కేంద్రానికి చెందిన అంజలికి, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన నారాయణతో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. హైదరాబాద్‌లో ఉండే వీరు ద్విచక్ర వాహనంపై మరిపెడలోని అత్తారింటికి బయలుదేరారు.

ఈ క్రమంలో తామంచెర్ల శివారు కోరుకొండ తండా వద్ద వీరి ద్విచక్ర వాహనం-లారీ ప్రమాదవశాత్తు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇదే తరహాలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం కరుణాపురం ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో అన్నా-చెల్లెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. లారీని వెనక నుంచి ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టడంతో ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వరంగల్‌ జిల్లాలో పొలం దుక్కి చేస్తుండగా ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి అజ్మీర కీమా అనే డ్రైవర్‌ మృతి చెందాడు. చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామ శివారులోని మేఘ్యూ తండాకు చెందిన అజ్మీర కీమా ఓ రైతు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement