Friday, May 3, 2024

Delhi | తెలంగాణ బీజేపీ నాయకత్వం మరింత బలోపేతం.. అస్సాంలో ఈటల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్టానం కసరత్తు చేస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలు, గుణపాఠాలతో కేవలం జాతీయ నాయకత్వం బలంగా ఉంటే సరిపోదని, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను జాతీయ అంశాల ఆధారంగా గెలవలేమని గ్రహించిన కమలనాథులు రాష్ట్రాల్లో నాయకత్వంలో నెలకొన్న పొరపొచ్ఛాలు, స్పర్థలు, విబేధాలను పరిష్కరించి ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేయాలని భావిస్తోంది.

మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాల్లో దక్షిణాదిన తెలంగాణ, ఈశాన్యాన మిజోరాంతో పాటు మధ్యభారత దేశంలో చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలున్నాయి. వీటిలో రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో అంతర్గత విబేధాలు, వర్గాలు ఉన్నాయని అధిష్టానం గ్రహించింది. వీటిని తక్షణమే సరిదిద్దకపోతే ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం ఉందని భావిస్తోంది.

తెలంగాణ అత్యంత కీలకం
అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి తెలంగాణ అత్యంత కీలకంగా మారింది. పుదుచ్ఛేరిలోని సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీకి భాగస్వామిగా ఉన్నప్పటికీ, కర్ణాటకలో ఓటమితో ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో బీజేపీకి దాదాపుగా ఎక్కడా సొంతంగా అధికారం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో గెలుపొందకపోతే ‘బీజేపీ ముక్త్ దక్షిణ్ భారత్’ తరహా పరిస్థితి ఏర్పడుతుంది.

ఇప్పటికే ఉత్తరాది రాజకీయ పార్టీగా ముద్ర ఉన్న కమలదళం, దక్షిణ భారతదేశంలో పట్టు పెంచుకుని ఆ ముద్రను చెరిపేసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో మాత్రమే బీజేపీకి ఎంతో కొంత సానుకూల పరిస్థితులున్నాయి. అయితే పార్టీలో అంతర్గతంగా నెలకొన్న సమస్యలు ఉన్న కాస్త అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వాన్ని బండి సంజయ్ చేతుల్లో పెట్టిన తర్వాత బీజేపీ ఒక్కసారిగా బలం పుంజుకుంది. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు సహా ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబర్చింది. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్‌కు అసలైన పోటీ బీజేపీయే అన్న పరిస్థితి తీసుకొచ్చింది.

- Advertisement -

ఇంత వరకు బాగానే ఉన్నా.. బండి సంజయ్‌కు, పార్టీలోని సీనియర్లకు, ఇతర పార్టీల నుంచి కొత్తగా బీజేపీలో చేరినవారికి మధ్య అంతరాలు పెరిగాయి. కాంగ్రెస్ తరహాలో ఎవరూ బహిరంగంగా విమర్శించుకోకపోయినా.. అంతర్గతంగా పార్టీలో విబేధాలు నానాటికీ పెరుగుతూ పోతున్నాయి. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరినవారికి రాష్ట్ర నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొందరు, బండి సంజయ్ ఇంకా పరిణితి చెందాల్సి ఉందని మరికొందరు.. ఇలా తలా ఒక విధంగా అధిష్టానం దగ్గర తమ తమ వాదనలు వినిపిస్తూ వచ్చారు.

పార్టీకి ఊపు తీసుకురావడం వరకు బండి సంజయ్ సమర్థవంతంగా పనిచేశారని, కానీ ఎన్నికలు సమీపించిన సమయంలో పార్టీకి వ్యూహకర్తలు అవసరమని, పైగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న నేత కావాలని పదే పదే చెబుతున్నారు. తీరా ఎన్నికలు సమీపించే సమయంలో నాయకత్వ మార్పు చేస్తే కొత్త నాయకుడు నిలదొక్కుకునే సరికే ఎన్నికలు సమీపిస్తాయని తొలుత అధినాయకత్వం భావించింది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలోనే బండి సంజయ్ పదవీకాలం ముగిసినప్పటికీ దాన్ని అప్రకటితంగా కొనసాగిస్తూ వచ్చింది.

కానీ కర్ణాటక ఓటమి తర్వాత పార్టీలో కొత్తగా చేరాలనుకున్న ఇతర పార్టీల నేతలు సైతం వెనుకంజ వేస్తుండడంతో అధిష్టానం ఆలోచనలో పడింది. ఇదే అదనుగా నాయకత్వ మార్పుపై ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఆశిస్తున్న ఈటల రాజేందర్‌కు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తారని, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణకు రాష్ట్ర పగ్గాలు అప్పగించి బండి సంజయ్‌ను కేంద్ర హోంశాఖలో సహాయ మంత్రిగా చేస్తారని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నిప్పు లేనిదే పొగరాదు అన్న చందంగా మార్పులకు అధిష్టానం సంకేతాలిచ్చిందని కూడా తెలుస్తోంది. అయితే ఈ మార్పులు ఎలా ఉంటాయన్నది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు.

అస్సాంలో ఈటల రాజేందర్
రాష్ట్ర నాయకత్వ పగ్గాలు ఆశిస్తూ ఎప్పటికప్పుడు తన మనసులో మాటను అధిష్టానం పెద్దల దగ్గర చెబుతూ వస్తున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శుక్రవారం హుటాహుటిన హైదరాబాద్ నుంచి ప్రయాణమయ్యారు. దీంతో తొలుత అందరూ ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని, ఢిల్లీలో పెద్దలను కలవడానికి వెళ్తున్నారని అంతా భావించారు. కానీ ఆయన అనూహ్యంగా అస్సాంలో ప్రత్యక్షమయ్యారు. పైగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పెద్ద దిక్కుగా ఉన్న హేమంత బిశ్వ శర్మను కలిశారు. ఈ అనూహ్య కలయిక వెనుక ఆంతర్యం ఏంటా అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.

అయితే ఈటల మాదిరిగానే అవమానాలు ఎదుర్కొని బయటికొచ్చి బీజేపీలో చేరిన హేమంత బిశ్వ శర్మ.. అతి తక్కువ వ్యవధిలో తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ అస్సాంలోనే కాదు యావత్ ఈశాన్య రాష్ట్రాలకే పెద్ద దిక్కుగా మారారు. అదే తరహా కసితో ఉన్న ఈటల రాజేందర్, హేమంత బిశ్వ శర్మ నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడంతో పాటు అధిష్టానం పెద్దలకు సిఫార్సు కూడా చేయించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందుకే ఆయన ఢిల్లీకి బదులుగా ముందు అస్సాం వెళ్లి, అక్కణ్ణుంచి ఢిల్లీ వెళ్లి పెద్దలను కలవాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం చేరికల కమిటీకి నాయకత్వం వహిస్తున్న ఈటల రాజేందర్‌కు ప్రచారంలో ఉన్నట్టు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తారా లేక ఏకంగా రాష్ట్ర పగ్గాలే అప్పగిస్తారా అన్నది ప్రస్తుతానికి ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement