Sunday, May 19, 2024

రిజ‌ర్వ్ డ్ సీట్ల‌పై బిజెపి క‌న్ను… గెలిచేందుకు వ్యూహాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అసెంబ్లి ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలోని ఎస్సీ నియోజకవర్గాలపై బీజేపీ గురిపెట్టింది. రానున్న అసెంబ్లి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు మిషన్‌-90 లక్ష్యాన్ని విధించు కున్న కమలనాథులు అందుకు అత్యధిక ఎస్సీ నియోజక వర్గాల్లో విజయం సాధిస్తేనే అధికారం దక్కుతుందని గట్టిగా నిర్ణయించుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో 19 ఎస్సీ రిజర్వ్‌డ్‌ సీట్లు ఉన్నాయి. చెన్నూరు, బెల్లంపల్లి, చొప్పదండి, ధర్మపురి, మానకొండూరు, మధిర, సత్తుపల్లి, ఆందోల్‌, జహీరాబాద్‌, నకిరేకల్‌, తుంగతుర్తి, జుక్కల్‌, చేవెళ్ల, వికారాబాద్‌, వర్ధన్నపేటతోపాటు మరో రెండు నియోజక వర్గాలకు ఎస్సీ వర్గానికి రిజర్వ్‌డ్‌ అయ్యాయి. ఇందులో 2009లో జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్‌ 10సీట్లు గెలుచుకుంది. టీఆర్‌ఎస్‌ 2014లో 13స్థానాలను, 2018లో 16సీట్లు గెలుచుకుని రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వెనక ఎస్సీ రిజర్వ్‌డ్‌ సీట్లలో మెజారిటీ సీట్లను గెలుచుకోవడమేనని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందుకే ఈసారి మిషన్‌-90 లక్ష్యంలో భాగంగా ఈసారి ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. ఈ స్థానాల్లో దాదాపు 7 చోట్ల బీజేపీకి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ నిర్వహించిన సర్వేలో తేలిందని నేతలు చెబుతున్నారు. ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో పార్టీ పట్టును పెంచుకోవడం ద్వారా బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అన్న ముద్రను కూడా తిప్పికొట్టాలని నిర్ణయించింది. ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లోని మండలాలకు ఇన్‌చార్జిలను నియమించి బూత్‌స్థాయి నుంచి ఆ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన బ్లూప్రింట్‌ను కూడా బీజేపీ జాతీయ నాయతక్వం సిద్ధం చేసింది. ఆ మేరకు ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో మండలాల వారీగా ఇన్‌చార్జిల నియామకం పూర్తయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎస్సీ బస్తీల్లో ప్రచారం చేయటంతోపాటు అనేక కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ తెలంగాణ వ్యవహారాల సహా ఇన్‌చార్జి అరవింద్‌ మీనన్‌ ఎస్సీ మోర్చా నేతలను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఎస్సీ మోర్చా నేతలతో సమావేశమయ్యారు.

ఎస్సీ రిజర్వ్‌ డ్‌ స్థానాల్లో పట్టుకోసం అమలు చేసే కార్యాచరణలో భాగంగా ముందుగా మేథావులు, విద్యావంతులతో సమావేశాలు నిర్వహించి బీజేపీ ఆలోచనలు, ఆశయాలను తెలియజేయనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని దళితుల ఓట్లు కాంగ్రెస్‌ లేదంటే అధికార బీఆర్‌ఎస్‌కే పడుతున్న నేపథ్యంలో కనీసం ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లోనైనా ఎస్సీ ఓటర్లను బీజేపీ వైపుకు తిప్పుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది. అధికార బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను, వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లోని అసంతృప్త నేతలకూ గాలం వేసేందుకు బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement